Saturday, December 25, 2010

ఆమె !!

                                                    
చందమామలో సూర్యతేజాన్ని రంగరించి
కలువరేకులకు మెరుపుకాంతి నలది
కలువల మధ్య సంపెంగను పూయించి
సంపెంగకి సాయంగా అరవిచ్చిన గులాబీని అరువిచ్చి
ఆ గులాబీ మీద మంచు ముత్యం లాగా
మంచి నవ్వును మెరిపిస్తే
అది తేనెల వాననూ వెన్నెల సోననూ కురిపిస్తే
ఇన్ని అందాలను సన్నజాజి మోయలేదేమోనని బ్రహ్మ బెంగపడి
పూచిన గున్నమామిడిమీద ఆ ముఖ చంద్రుణ్ణి మెరిపిస్తే......  
     
                    *        *                *              *            *

ముద్దమందారం లోని ముగ్థత్వం
గులాబీ లోని గుబాళింపూ
మల్లెలోని మృదుత్వం
సన్నజాజి సన్నని సౌరభం కలగలిపి ఒంటికి తైలం పూసి
మంచితనం అనే మంచి గంధంతో నలుగు పెట్టి
సహజత్వాన్నీ సజీవత్వాన్నీ వలువలుగా నేసి
మానవత్వపు మేలి ముసుగు తొడిగితే.............     ....................ఆమె ?

                    *        *            *               *           *

ఆమె..................
వెండితెరకే వెలుగునిచ్చిన  వెండివెన్నెల కొమ్మ
రసిక హృదయాలను దోచిన రంగారు బంగారు బొమ్మ
కరుణ రసావిష్కరణంలో కరగించే కలికి రెమ్మ
సరస శృంగార దీప్తిని వెలిగించే  సావిత్రమ్మ
          
ఆమె -

సినీ వినీలాకాశంలో వెలిగే జాబిల్లి
కళామతల్లి సిగలో విరిసిన సిరిమల్లి
నటనకే భాష్యం చెప్పిన మహా తల్లి
తెలుగు సినీవాకిట దిద్దిన ముద్దుల రంగవల్లి

                 *           *              *                      *


ఆమె -
సోగకన్నుల ఆ వాలు చూపు
తెలుగు ప్రేక్షక హృదయాల నూపు
ముచ్చటైన ఆ మూతి ముడుపు
మరునికే మరి మరి మరులు గొలుపు
ముని పంట పెదవి నొక్కే తీరు
పడుచు గుండెలను చీల్చే మంచు కఠారు
జాణతనము, చానతనము కలబోసిన చిలిపితనము
కనుల పండువగా రూపు కట్టే నిండైన తెలుగు ధనము

                 *          *            *            *            *
ఆమె -
నటనలు తెలియని నటీమణి
నటనలోనే జీవించిన విదుషీ మణి
జీవన పాత్రను పోషించ లేని అలివేణి
నలభైలోనే అరవై నిండిన అసంపూర్తి పాత్రధారిణి

                *           *        *            *              *

ఆమె -
నవ రసాలను ప్రేక్షకులకు పంచి ఇచ్చి
తాను మాత్రం విషాదాన్నే గ్రోలిన నవరస కథానాయిక
సంతోషపు వెన్నెల కోసం కడదాకా వేచిన అభిసారిక
కలవరించే మన(సు)లను కలలో మాత్రమే వరించే మధుర స్వాప్నిక !!

Tuesday, August 24, 2010

ఆ రోజు...



వారంలో ఏడో రోజు
సాయంత్రం ఏడో గంట
లేజర్ షోలో ఏడో రంగు

ఒక్క క్షణం ఆగింది
మరుక్షణం బాంబై పేలింది
పచ్చటి నేలతల్లి
నెత్తుటి చీరను కట్టింది

అహింసో పరమోధర్మమంటూ చాటే
తథాగతుని కంఠం వణికింది
హింసకు సాక్షిగా నిలిచిన నిలువెత్తు
విగ్రహం సిగ్గుతో తల వంచింది


కూల్ డ్రింక్ సీసా పై నెత్తుటి మరకలు
ఐస్ క్రీం కప్ లో మాంసపు తునకలు
అమాయక జీవులపై దానవత్వపు ఘాతుకాలు
అణువంతైనా దయలేని భగవంతుడి శాపాలు

మానవత్వమే లేని (అ)మానవుడా!!
శిలా రూపంలో నిలిచిన భగవంతుడా!!

ఒక్కసారి మీరు కూడా మనుషులు కండి
నిలువునా మానవత్వాన్ని నింపుకోండి
గాలిలో కలిసిన ప్రాణాల కోసం
గాయపడిన ప్రాణుల కోసం
మాలా వెక్కి వెక్కి ఏడవండి......

(ఆగష్టు 25,2007 లుంబిని పార్క్, గోకుల్ చాట్ జంట బాంబు పేలుళ్ళు జరిగి మూడు సంవత్సరాలు.బాధితులకు కన్నీటి నివాళులు అర్పిస్తూ...)

Friday, August 13, 2010

వదల బొమ్మాళీ....వదల.

ఈమధ్య బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇది. అరుంధతి సినిమా రిలీజయ్యాక అందరి నోటా ఇదే మాట. అయితే చాలామందికి ఈ బొమ్మాళి పేరిట శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్రామాలున్నాయని తెలియకపోవచ్చు. వినడానికి తమాషాగా అనిపించినా ఇది నిజం. వాటి పేర్లు కోట బొమ్మాళి, సంత బొమ్మాళి . ఇవి ప్రత్యేక మండలాలు కూడా.

కోట ఉన్న ఊరు కాబట్టి కోటబొమ్మాళి, సంత జరిగే ఊరు కాబట్టి సంత బొమ్మాళి అయి ఉంటుందని అని ఎవరైనా ఊహించవచ్చు. కానీ అసలు బొమ్మాళీ అంటే?
అరుంధతి లో బొమ్మాళీకి దీనికి ఏమేనా సంబంధం ఉందా అనుకుంటున్నారా. అబ్బే. బొత్తిగా సంబంధం లేదు. సినిమాలో అందమైన బొమ్మలాంటి అమ్మాయి అనే అర్ధంలో రచయిత కాయిన్ చేసిన మాట అది.
కానీ ఈ బొమ్మాళీ కథ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది.

కోట బొమ్మాళి అసలు పేరు వనమాలి కోట. టెక్కలి వంశ రాజుల్లో ఒకడైన వనమాలి తన పేరిట వనమాలి కోట అనే గ్రామాన్ని నిర్మించాడు. అది కాలక్రమంలో కోట వనమాలి అయింది. ఒరియా భాషలో వకారం బకారం అవుతుంది కాబట్టి వనమాలి బనమాలి గామారి ఉచ్చారణ సౌలభ్యం కోసం బొమ్మాళి అయింది.

కళింగ దేశ చరిత్ర ( రాళ్ళబండి సుబ్బారావు, 1930 ) గ్రంథంలో టెక్కలి రాజ వంశస్థులయిన శ్రీ లక్ష్మీనారాయణ హరిచందన జగద్దేవు రచించిన టెక్కలి కాదంబ రాజుల వంశేతిహాసము అనే వ్యాసంలో ఈ వివరాలు పొందు పరచబడ్డాయి.ఆ వ్యాసం ఆధారంగా వనమాలి చరిత్ర చూడండి.

పద్మనాభుడు అనే టెక్కలి రాజుకు వీరభద్రుడు, చంద్రశేఖరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరభద్రుడు వీరభద్రుడై ప్రస్తుతం కోట బొమ్మాళి అని పిలవబడే కోటబొమ్మాళి సముద్ర తీర ప్రదేశాన్ని ఆక్రమించి పాలించాడు. అప్పటి ఉత్కళ రాజు వీరభద్రుడి విజయ క్రీడలకు శ్లాఘిస్తూ బోడోజన్మ అనే బిరుదు ఇచ్చి ఆ ప్రాంతానికే కాక జుల్మూరి కోటకుకూడా అధికారిగా చేసాడు.. చంద్రశేఖరుడు వారసత్వంగా వచ్చిన టెక్కలి రాజ్యానికి రాజయ్యాడు. 
ఇతను తన సోదరపుత్రుడైన వనమాలిని టెక్కలిలో కాలు మోపకుండా
చేసాడు. వనమాలి తన తండ్రి వశపరచుకున్న ప్రదేశంలో తన పేరిట ఒక గ్రామాన్ని నిర్మించాడు. అది వనమాలి కోట అని పిలవబడుతూ  కాలక్రమంలో కోట వనమాలి అయింది. వకారం ఉత్కళ (ఒరియా) భాషలో బకారం అవుతుంది కాబట్టి వనమాలి బనమాలి అయి ఉచ్చారణ సౌలభ్యంకోసం బొమ్మాళి అయింది.

చంద్రశేఖరుడు వనమాలిని తన జోలికి రాకుండా బొమ్మాళి రాజ్యానికి, తన రాజ్యానికి మధ్య సరిహద్దులలో ఒక గ్రామంలో త్రిలింగ దేశపు సర్దారును కాపలా పెట్టారు. ఆ గ్రామం ఇప్పుడు తిర్లంగి (త్రిలింగ) అని వ్యవహరించబడుతోంది. ఆ తర్వాత ముసల్మానులు విప్లవకారులై కోట బొమ్మాళిని ఆక్రమించారు. ఈ మహమ్మదీయులే పాత టెక్కలిని స్వాధీన పరచుకుని తురకల కోటని కట్టి నివసించారు. కోటబొమ్మాళికి సమీపంలో అగ్బరుపూరు ( నేటి అక్కవరం ) గ్రామాన్ని కూడా నిర్మించి నివసించారు. చంద్రశేఖర జగద్దేవుడు మహమ్మదీయులను తరిమికొట్టి పర్వత మధ్యలో దుర్భేధ్యంగా చింతామణి కోటను కట్టించాడు.

టెక్కలి రాజయిన వనమాలి పేరిట ఈ రెండు గ్రామాలే కాకుండా కంచిలి మండల పరిధిలో బొనమాలి పేరుతో మరొక గ్రామం కూడా ఉంది. ఒరియా వారిలో బనమాలి (వనమాలి-విష్ణుమూర్తి) పేరు వ్యక్తినామంగా విరివిగా కనిపిస్తుంది.

ఇదండీ బొమ్మాళి కథ. బావుంది కదూ.

Sunday, August 1, 2010

కవితామృతాన్ని కురిపించిన తిలక్




వెన్నెల్లో అందమైన ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటే
కొబ్బరాకుల మధ్యనుండి పున్నమి చంద్రుడు అమృతం కురిపిస్తూ ఉంటే
నిశ్శబ్దంగా ఒక వెన్నెల బిందువు కొబ్బరి మొవ్వలో రాలి పడితే
ప్రియురాలి కాలి మువ్వ మధురంగా సందడి చేస్తే
జూకామల్లె పరిమళంతో పిల్ల తెమ్మెర మృదువుగా ఒళ్ళు నిమిరితే

 అది తిలక్ కవిత్వం అవుతుంది. ఆ కవిత్వపు లోతులు చవిచూసిన వారికే అతని సుకుమార హృదయం ఆవిష్కృతమవుతుంది. ఆ సున్నిత హృదయంలోని ఆర్తి, కరుణరసాభివ్యక్తి పాఠకులకు నిత్య వసంతానుభూతి కలిగిస్తుంది. వారి మనసులను కరుణరసకాసారాలుగా మారుస్తుంది.

వంతెన కింద పిల్లాణ్ణి ప్రసవించి మూర్ఛిల్లిన స్త్రీ మూర్తిని చిత్రించినా, చిన్నసైజు జీతగాడైన తపాలా బంట్రోతును కళ్ళముందు సాక్షాత్కరింపజేసినా, ఆర్ద్రత నిండిన మనసుసుకవి తిలక్ ఒకడే అలా మనఃఫలకం మీద అద్దగలడు. కన్నీరుగా కరిగిన గీతికగా మార్చగలడు. కఠిన శిలనైనా కన్నీటి జడులతో తడిసిన దయా పారావతాలుగా మలచగలడు. అతని కవిత్వం అనితర సాధ్యం. అతను మూర్తీభవించిన మానవత్వం.

కుందుర్తి వారు చెప్పినట్లుగా వాల్మీకి నుండి నేటివరకూ కవులందరూ  కరుణరస వాదులే. కరుణ రసావేశం తో కవిత్వం రాసినవారే. పక్షుల శోకం వాల్మీకి నోట శ్లోకంగా పలికి రామాయణమైంది. పీడిత వర్గాల శోకం చూసి చలించిన ఆధునిక కవిలోని ఆర్ద్రత అభ్యుదయ కవితగా ఆవిష్కరింపబడింది. ఆభ్యుదయ కవికి పేదవర్గాల పట్ల ఎంత సానుభూతి ఉందో వారి పేదరికానికి కారకులైన ధనిక వర్గాల పట్ల, సమాజం పట్ల అంతకు రెట్టింపు కోపం ఉంది. దోపిడీ వ్యవస్థ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చెయ్యడానికి భయంకరమైన కొత్త పదబంధాలు సృష్టిస్తూ పరుష పదజాలంతో నిందిస్తాడు అభ్యుదయ కవి. భావ, అభ్యుదయకవులకి వారధిగా నిలిచిన తిలక్ కి కూడా బడుగు వర్గాల పట్ల సానుభూతి ఉంది. కానీ వారిని దోచుకుంటున్న వారిపై ద్వేషం లేదు, కసి లేదు.ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలన్న తపన మాత్రమే ఉంది. బడుగు వర్గాలను ఆదుకోవడానికి ఏ దేవుడైనా దిగివస్తే బావుండునన్న ఆవేదనా, దిగిరమ్మన్న నివేదనా అతని రచనలో కనిపిస్తుంది. వీరందరి కవితా భూమిక ఒకటే. అభివ్యక్తి లోనే భిన్నత.

బడుగు జీవుల కష్టాలను శ్రీశ్రీ చిత్రిస్తే పాఠకుల కళ్ళనుండి కలకలా కన్నీళ్ళు రాలవు. ఒంట్లోని రక్తం సల సలా మరుగుతుంది. రక్త జ్వాలలూ, కలకత్తా కాళిక నాలుకలూ కళ్ళముందు ఆవిష్కృతమవుతాయి. పదండి ముందుకు, పదండి తోసుకు అంటూ కదం తొక్కుతూ పదం పాడుతూ తాము కూడా విప్లవ సైనికులుగా మారిపోవాలనే ఆవేశం కలుగుతుంది. అదే బడుగువర్గం గురించి తిలక్ రాస్తే జాలిజాలిగా కన్నీరు చెక్కిళ్ళనుండి జాలువారుతుంది. ఆ కరుణ రసానుభూతిలో గుండె బరువెక్కుతుంది. శ్రీశ్రీ – తిలక్ వీరిద్దరి కవితా భూమిక ఒకటే కానీ వ్యక్తులు వేరు. వారి అభివ్యక్తులు వేరు. అందుకే శ్రీ శ్రీ అభ్యుదయ కవి అయాడు. తిలక్ భావకవికీ, అభ్యుదయ కవికీ వారధిగా నిలిచాడు. మానవతా వాది, అనుభూతివాది అయాడు.

ఆర్తి లేదా ఆర్ద్రత అన్న పదాన్ని నిర్వచించడం చాలా కష్టం. అది ఒక అనుభవం. బాధ అనే సామాన్యార్థం చెప్పుకున్నా దాని స్థాయి వేరు, తీవ్రతా వేరు. అది భాషలో పొదగలేని భావం. మరి ఇలాంటి, భాషకందని భావాన్ని భాషలో ఒదిగించి రాయగలగడమే తిలక్ విశిష్టత. తిలక్ ఆర్తగీతాన్ని చదివినప్పుడు మాత్రమే ఆర్తి అనే పదానికి గల అసలు అర్థాన్ని అనుభవంతో గ్రహించగలం.

అభ్యుదయకవి దేవుడి పేరిట సమాజంలో జరుగుతున్న మోసాలను, దోపిడీని, మూఢవిశ్వాసాలను, పేదవారి హీనస్థితికి కారణమైన పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థమీద ఆగ్రహంతో దుమ్మెత్తిపోస్తాడు. కానీ తిలక్ పేదవారి హీనస్థితి చూసి దానికి కారణమైన దోపిడీ వ్యవస్థను నిందించడు. కన్నీరుగా కరిగిపోతాడు. అంతరాంతరాలలోనే దగ్ధమైన బూడిద అవుతాడు. ‘ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు, ఏ భగవంతుడికి నివేదించగలదు’(ఆర్తగీతం) అంటూ పరితపిస్తాడు. సమాజానికి పేదవాడిని చూపించి వాడిమీద జాలి కలిగించి చేయూతనిప్పించడమే తిలక్ లక్ష్యం. అందుకే మనల్ని 'మీరెప్పుడైనా చూసారా ? కన్నీరైనా విడిచారా ' (పిలుపు) అని జాలిగా, సూటిగా ప్రశ్నిస్తాడు. లోకంలోని దైన్యాన్ని కళ్ళకు కట్టించి తోటి మానవుడితోనే కాదు ఆఖరికి దేవుడితో కూడా కన్నీరు కార్పిస్తాడు.

ఇలాంటి దుర్మార్గులను ఎందుకు సృష్టించావని గద్దించడు. దేవుణ్ణి నిలదీయడూ, నిర్బంధించడు. 'కాసంత కన్నీరూ, మరికాస్త సంతోషపు తేనీరూ యిచ్చి నిజాయితీగా హాయి హాయిగా బతక నివ్వ' మంటూ (ప్రార్ధన) జాలిగా వేడుకుంటాడు. ‘దేవుడా రక్షించు నా దేశాన్ని’ అంటూ దీనంగా ప్రార్ధిస్తాడు. తన చేత సృష్టించబడిన మానవుడే దానవుడై పోయాడని కన్నీళ్ళు పెట్టుకున్న దేవుడి కన్నీరు కూడా తుడిచి వీధి చివరిదాకా సాగనంపుతాడు.
‘పెద్దవాడు, కన్న కడుపు. ఏంచేస్తాడు పాపం’(నిన్న రాత్రి) అంటూ భగవంతుణ్ణి కూడా మహోదార హృదయంతో క్షమిస్తాడు. అంతటి కారుణ్య మూర్తిమత్వం తిలక్ ది.

తోటి మానవుణ్ణి హింసించే దానవుడి లాంటి మానవుణ్ణి చూసినా తిలక్ కు ఆవేశం కలగదు. ఆవేదనా, ఆక్రందనా తప్ప. అందుకే నేమో.. ‘చిన్నమ్మా వీళ్ళను కోపగించుకోకు అసహ్యించుకోకు’(నీడలు) అంటాడు. తిలక్ లక్ష్యం దానవుడిగా మారిన మానవుణ్ణి చంపడం కాదు. అతడిలోని దానవత్వాన్ని చంపి మానవత్వాన్ని నింపడమే తిలక్ ధ్యేయం. '.... పొసగి మేలు చేసి పొమ్మనుటే చాలు' అని వేమన చెప్పినట్టుగా శత్రువును చంపడం కాదు. ఆ శత్రుత్వ గుణాన్ని పోగొట్టడమే ఉత్తమం అనే మార్గాన్ని అవలంబిస్తాడు తిలక్.

దేవుడు మానవుణ్ణిని ఉత్తమ గుణాలతోనే సృష్టించాడు. కానీ ఆ మానవుడు ఏ కారణం వల్లో దానవుడిగా మారితే అది దేవుడి తప్పెలా అవుతుంది. తల్లి తండ్రులు పిల్లలను సదుద్దేశ్యంతోనే కంటారు. సక్రమ మార్గంలోనే నడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ తాము కన్న పిల్లలు దుర్మార్గులుగా మారిపోతే  తల్లితండ్రులు మాత్రం ఏం చేయగలరు? ‘నా కన్నబిడ్డ ఇలా మారిపోయాడే’అని నిశ్శబ్దంగా రోదించడం తప్ప. తిలక్ దృష్టిలో దేవుడు కూడా అంతే. అందుకే అతని దేవుడు ఇలాంటి దానవులని చూసి జాలిగా కన్నీళ్ళు కారుస్తాడు.

మానవుడిలోని దానవుడిని తరిమి కొట్టి మానవత్వం నింపడమే తిలక్ కవితా లక్ష్యం. అందుకే అతను అతి గొప్ప మానవతా వాదిగా నిలిచాడు- కవితాభిమానుల మనసులను  గెలిచాడు.
(ఆగష్టు 1,1921 బాలగంగాధర తిలక్ పుట్టినరోజు)

Saturday, July 24, 2010

మా ఊరూ మా ఏరూ మారిపోయిన తీరు - పోటెత్తిన కొత్తనీరు





వర్షాకాలపు మేఘుడి  ప్రేమ వృష్టికి పులకరం అనే సువాసనలు వెదజల్లిన పుడమినయ్యాను.
తల్లి ఒడిలో ప్రేక్షీరాన్ని ఆస్వాదిస్తూ అర్థ నిమీలిత నేత్రాలతో పరవశించే పసి బిడ్డనయ్యాను.  
నాగావళి గట్టున కోటీశ్వరాగ్రహారపు తొలి మెట్టున
రావిచెట్టు నీడ పట్టున... 
నేను వేసిన తొలి అడుగు
చిన్ననాటి జ్ఞాపకాలకు పట్టిన గొడుగు.
మట్టిలోంచి పుట్టిన మనిషి మట్టివాసనను తనలో నింపుకుని జీవిస్తూ చివరకు మట్టిలోనే లయిస్తాడు. కానీ మట్టి వాసన రాకుండా, మట్టి మరకలు కనిపించకుండా నాగరికతా గంధాన్ని పూసుకుని కృత్రిమ వేషాన్ని అభినయిస్తాడు. కనీసం ప్రయత్నిస్తాడు.  
కానీ తనకు జన్మనిచ్చిన పుడమితల్లి ముని వాకిట్లో అడుగు పెట్టిన నాడు, తల్లి పాద ధూళి తన మనసుకంటిన నిముషాన మట్టి సురభిళ సౌరభం తన చుట్టూ వ్యాపించి జ్ఞాపకాల ఉప్పెనలో ముంచి వేసిన క్షణంలో తిరిగి మట్టి మనిషవుతాడు. ఇక ఎన్నడూ కనబడదనుకున్న తల్లి ఆప్యాయంగా చేతులు చాచి పిలిచిన అనుభూతికి లోనవుతాడు. ఆతల్లి ఒడిలో చేరి పరవశించే పసిబిడ్డ అవుతాడు. తిలక్ మాటల్లో చెప్పాలంటే చచ్చిపోయిన అమ్మ తిరిగి వవ్చినప్పటి ఆనందానుభూతికి లోనవుతాడు. ఆనందానికి అంతకుమించిన అవధి ఉంటుందా. అందుకే వాల్మీకి రామాయణంలో శ్రీ రాముడితో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనిపించాడు.
నన్ను చూసి నా పుడమితల్లి కూరిమి అనే రసంతో తడిసి పులకలిస్తూ వెదజల్లిన మట్టివాసన తగలగానే , తల్లి పిలుపు వినగానే నాలో ఎగసిన జ్ఞాపకాల ఉప్పెన.......స్వర్గలోకానికి వేసిన వంతెన. అది ఒక అలౌకిక దివ్యానుభూతి....మధురమైన ప్రాచీన స్మృతి. భూతకాలపు సుందర దృశ్యమాలికాగీతి.
నార్నియా సినిమాలో కబోర్డులో దూరి తలుపు వేసుకోగానే నార్నియా వింతలోకంలోకి అడుగు పెట్టినట్టుగా ..... నాగావళి ఒడ్డున అడుగు పెట్టీ పెట్టగానే వర్తమానపు వాకిలి తలుపులు మూసుకుపోయి భూతకాలపుసుందరభావాల తలపులు ముసురుకున్నాయి.
కోటీశ్వరుడి కోటిదీవెనలను భక్తకోటికి ప్రసాదిస్తూ అభయమిస్తున్నట్టుగా ఠీవిగా నిలుచున్న ఆలయ గోపురం(ధ్వజస్తంభం), యుగయుగాలుగా తన నీరు అనే అమృతాన్ని ఊరివారికి పంచుతున్నా ఎండిపోని ఏరు, వయసు పెరిగినా సడలని సౌందర్యానికి ఆటపట్టు అయిన రావిచెట్టూ, వేసవికాలంలో భానుడి ప్రతాప జ్వాలకు తాళలేక దిగులుగా నీరసించి మూలకి ఒదిగి పడుకున్నా అమ్మే అన్నం పెట్టాలంటూ మారాం చేసే పసిబిడ్డల్లా నీటికోసం మేమంతా చెలమలు తవ్వి ప్రాణాలు తోడేస్తున్నా విసుక్కోకుండా దిగులుగా నవ్వుతూనే తన ప్రేమామృత ధారలందించే త్యాగశీలి నాగావళి.
అవతలి ఒడ్డున కొండపై వెలసిన వేంకటేశ్వరుణ్ణీ, ఇవతలి ఒడ్డున పాతాళంలో నిలిచిన ఈశ్వరుణ్ణీ కలుపుతూ హరిహరాద్వైతాన్ని చాటే జ్ఞాని లాంటి వంతెనా....

అదే ఊరు......అదే ఏరు
అదే గుడి.....అదే అమ్మ ఒడి
అది నా బాల్యం......అది నాకమూల్యం
నా స్థూల దృష్టికి అందని మార్పులు
సూక్ష్మ దృష్టికి సరికొత్త చేర్పులు
కొత్తదనాన్ని తనలో పొదవుకుంటున్న పాతదనం
పాతదనంలో ఒదిగిపోతున్న కొత్తదనం
కొత్త పాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులు చిమ్ముతుండగా భూతకాలపు భావసంచలనంలోంచి పూర్తిగా బయటకు రాలేక, వర్తమానపు ఒడిలో చేరలేక, రెండింటి సంధి వాకిట్లో ఓమూలగా ఒదిగి నిలుచున్నాను. నా చిన్ననాటి జ్ఞాపకాల చిలిపి కళ్ళతో నాటి కొత్తదనపు పోకిళ్ళను బేరీజు వేసుకున్నాను.
ఉత్సవాల సమయంలో హరిదాసులకు చోటిచ్చినా
మిగిలిన వేళల్లో మమ్మల్ని దాగుడుమూతలు ఆడుకోనిచ్చిన
నాలుగు స్తంభాల మంటపం స్ధానం బోసిపోయింది.
దానికి రెక్కలొచ్చి దూరంగా ఓమూలకు ఎగిరిపోయింది.

రెండువందలేళ్ళు బతుకుతానని మాటఇచ్చిన మిత్రుడు
అర్ధాంతరంగా అర్థాయుష్కుడిగా నాగావళిలో కలిసిపోయాడు
సంతానాన్ని మాత్రం మిగిల్చిపోయిన నా బుజ్జి కూర్మనాథుడు
మనవళ్ళలో తనను చూసుకొమ్మన్నాడు
 నా చేతి అరటి పండు తింటూ గాయం చేసిన బుల్లి కూర్మనాథుడు
తాత చేసిన ఆనాటి గాయాన్ని గుర్తుచేసి గుండె తడి చేసాడు


గర్భాలయంలో నేలబారుగా ఉండే మా శివలింగం
మా గుండెల గుడిలోనే శాశ్వతంగా బందీ అయిపోయింది
కాశీ నుండి వచ్చిన కొత్త లింగం ఎత్తైన పానవట్టం అధిరోహించింది
క్రొంగొత్త రూపాన్ని సంతరించుకుంది.
ఒకప్పుడు గర్భాలయంలోకి రానిచ్చి సేవలందుకున్న మా శివుడు
విడిచి వెళ్ళామన్న కోపంతో నేమో
పదడుగుల దూరంలోనే నిలబెడుతున్నాడు.
నల్ల కలువ లాంటి నిగ నిగల శరీర కాంతిలో
తెల్లతామరలాంటి వెండి కన్నుల దీప్తితో
స్వామికి ఎడమవైపు కొలువుండే చల్లని తల్లి
కోరిన వరాలు ఇచ్చే కల్ప వల్లి
స్వామికి కుడి ఎడమలుగా శృంగీ, భృంగీ
కంటికెదురుగా కొలువైన లేపాక్షి నందీ,గంటా
మీ దృష్టికి దేవుడు మారినా
అతని దయాదృష్టి మారలేదని చాటాయి




గుడికి ఎడం పక్కగా ఉండే చిన్న గుడిలోని
శివలింగం చెక్కు చెదరకుండా అలాగే ఉంది
పూలురాల్చి పలకరించే నిద్ర గన్నేరు చెట్టుమాత్రం
శాశ్వతంగా నిద్రపోయింది
పూలలోని మకరందం ఒలికిపోయింది
నిశ్శబ్దంగా కన్నీటి బిందువు రాలిపోయింది
ప్రియుడి సమాగమం కోసం పరిగెడుతున్న
పదహారేళ్ళ కన్నెపిల్ల నడుంలా వంపులు తిరుగుతూ
వయ్యారంగా పారుతూ
మొదటి మెట్టుమీదనుంచే కనిపించే నాగావళి
వంపులను కోల్పోయిన ప్రౌఢాంగన నడుంలా
విశాలంగా, భారంగా మూలుగుతోంది
ఒకప్పుడు దోసిలి పట్టి అమృతంలా తాగిన నది నీరు
నేడు కాళ్ళు కడుక్కోవడానికి కూడా భయపెడుతున్న తీరు
మీ మలినాలను కలిపి మలినం చేయకండర్రా
అంటూ తల్లి కారుస్తున్న కన్నీరు
'ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో  అంటున్న
నా ఆవేదన తీర్చేదెవరు ??

యవ్వనంలో ఉండగా ఏనుగెక్కించి ఆడించాను గానీ
మిమ్మల్నింక మోయలేనురా సవారీ చేయకండిరా
అంటూ మూలుగుతున్న ముసలితాతలా వంగిన వంతెన
తన గత వైభవాన్ని మాత్రం ఘనంగా చాటుతోంది.


అవతలి గట్టున కనిపించే గుడిసెలన్నీ
సమ్మెకట్టి తమ హక్కుల్ని సాధించిన గుర్తుగా
కాస్త దూరంగా, ఒంటరిగా ఉన్న కొండతో దోస్తీ చేస్తున్నట్టుగా
ఒంటి స్తంభం మేడ రూపంలో ఏకమై పోయాయి.
నది మధ్యలో కొత్తగా వెలసిన తథాగతుని దివ్యమంగళ విగ్రహం
క్రీస్తు పూర్వమే అంకురించిన బౌద్ధ మత ప్రాచీనతను చాటుతోంది
మూసుకు పోయిన మానవత్వపు కవాటాలను తెరుస్తోంది



ఒకప్పుడు అడుగు పెట్టడానికే అసహ్యించుకునే చోట
నగర పాలకసంస్థ నాటింది పారిశుధ్యపు బావుటా
రివర్ వ్యూ పార్కులో వెలసిన రాక్షస బల్లులు
చూపరులపై చిందిస్తాయి సంతోషపు జల్లులు
పార్కును రూపొందించిన తీరును
అభినందించకుండా ఉండలేను

కొబ్బరి కాయలమ్మే కనకమ్మ మనవడు కోటిగాడు
నా బుజ్జి కూర్మనాధుడి మూడవతరం బుల్లి కూర్మం
పూజారి హరిబాబు గారి మనవడు కొత్త పూజారి
టీ ఏజంటు తాతగారింట్లో మూడవతరం మేమూ
తరాలు మారినా తరగని మమతలు
ఎన్నటికీ తెగిపోని అనుబంధాల గొలుసు
మృతినైనా మరువలేని మృత్తిక వాసనలు
రాతిరి చీకటి దుప్పటి కప్పుకోవడం
వేకువ వెలుగుల కుంపటి రాజేయడం
ప్రకృతి మాత నైజం
మారిన కాలంతో మార్పులు రావడం సహజం
ఇది అందరం అంగీకరించక తప్పని చేదు నిజం
కొత్తనీరు వచ్చినంత మాత్రాన
పాతనీరు పూర్తిగా కొట్టుకుపోదు
పాత నీరు కలిసినంత మాత్రాన
కొత్తనీరు పాచి పట్టదు
పాత లోని చెడుగుదనాన్ని కొత్తనీరు కడుగుతుంది
కొత్త లోని మంచిదనాన్ని పాతనీరు గ్రహిస్తుంది
కొత్త పాతల మేలుకలయికే
వింత సౌరును ప్రసరిస్తుంది
Related Posts with Thumbnails