Tuesday, August 24, 2010

ఆ రోజు...



వారంలో ఏడో రోజు
సాయంత్రం ఏడో గంట
లేజర్ షోలో ఏడో రంగు

ఒక్క క్షణం ఆగింది
మరుక్షణం బాంబై పేలింది
పచ్చటి నేలతల్లి
నెత్తుటి చీరను కట్టింది

అహింసో పరమోధర్మమంటూ చాటే
తథాగతుని కంఠం వణికింది
హింసకు సాక్షిగా నిలిచిన నిలువెత్తు
విగ్రహం సిగ్గుతో తల వంచింది


కూల్ డ్రింక్ సీసా పై నెత్తుటి మరకలు
ఐస్ క్రీం కప్ లో మాంసపు తునకలు
అమాయక జీవులపై దానవత్వపు ఘాతుకాలు
అణువంతైనా దయలేని భగవంతుడి శాపాలు

మానవత్వమే లేని (అ)మానవుడా!!
శిలా రూపంలో నిలిచిన భగవంతుడా!!

ఒక్కసారి మీరు కూడా మనుషులు కండి
నిలువునా మానవత్వాన్ని నింపుకోండి
గాలిలో కలిసిన ప్రాణాల కోసం
గాయపడిన ప్రాణుల కోసం
మాలా వెక్కి వెక్కి ఏడవండి......

(ఆగష్టు 25,2007 లుంబిని పార్క్, గోకుల్ చాట్ జంట బాంబు పేలుళ్ళు జరిగి మూడు సంవత్సరాలు.బాధితులకు కన్నీటి నివాళులు అర్పిస్తూ...)

Friday, August 13, 2010

వదల బొమ్మాళీ....వదల.

ఈమధ్య బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇది. అరుంధతి సినిమా రిలీజయ్యాక అందరి నోటా ఇదే మాట. అయితే చాలామందికి ఈ బొమ్మాళి పేరిట శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్రామాలున్నాయని తెలియకపోవచ్చు. వినడానికి తమాషాగా అనిపించినా ఇది నిజం. వాటి పేర్లు కోట బొమ్మాళి, సంత బొమ్మాళి . ఇవి ప్రత్యేక మండలాలు కూడా.

కోట ఉన్న ఊరు కాబట్టి కోటబొమ్మాళి, సంత జరిగే ఊరు కాబట్టి సంత బొమ్మాళి అయి ఉంటుందని అని ఎవరైనా ఊహించవచ్చు. కానీ అసలు బొమ్మాళీ అంటే?
అరుంధతి లో బొమ్మాళీకి దీనికి ఏమేనా సంబంధం ఉందా అనుకుంటున్నారా. అబ్బే. బొత్తిగా సంబంధం లేదు. సినిమాలో అందమైన బొమ్మలాంటి అమ్మాయి అనే అర్ధంలో రచయిత కాయిన్ చేసిన మాట అది.
కానీ ఈ బొమ్మాళీ కథ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది.

కోట బొమ్మాళి అసలు పేరు వనమాలి కోట. టెక్కలి వంశ రాజుల్లో ఒకడైన వనమాలి తన పేరిట వనమాలి కోట అనే గ్రామాన్ని నిర్మించాడు. అది కాలక్రమంలో కోట వనమాలి అయింది. ఒరియా భాషలో వకారం బకారం అవుతుంది కాబట్టి వనమాలి బనమాలి గామారి ఉచ్చారణ సౌలభ్యం కోసం బొమ్మాళి అయింది.

కళింగ దేశ చరిత్ర ( రాళ్ళబండి సుబ్బారావు, 1930 ) గ్రంథంలో టెక్కలి రాజ వంశస్థులయిన శ్రీ లక్ష్మీనారాయణ హరిచందన జగద్దేవు రచించిన టెక్కలి కాదంబ రాజుల వంశేతిహాసము అనే వ్యాసంలో ఈ వివరాలు పొందు పరచబడ్డాయి.ఆ వ్యాసం ఆధారంగా వనమాలి చరిత్ర చూడండి.

పద్మనాభుడు అనే టెక్కలి రాజుకు వీరభద్రుడు, చంద్రశేఖరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరభద్రుడు వీరభద్రుడై ప్రస్తుతం కోట బొమ్మాళి అని పిలవబడే కోటబొమ్మాళి సముద్ర తీర ప్రదేశాన్ని ఆక్రమించి పాలించాడు. అప్పటి ఉత్కళ రాజు వీరభద్రుడి విజయ క్రీడలకు శ్లాఘిస్తూ బోడోజన్మ అనే బిరుదు ఇచ్చి ఆ ప్రాంతానికే కాక జుల్మూరి కోటకుకూడా అధికారిగా చేసాడు.. చంద్రశేఖరుడు వారసత్వంగా వచ్చిన టెక్కలి రాజ్యానికి రాజయ్యాడు. 
ఇతను తన సోదరపుత్రుడైన వనమాలిని టెక్కలిలో కాలు మోపకుండా
చేసాడు. వనమాలి తన తండ్రి వశపరచుకున్న ప్రదేశంలో తన పేరిట ఒక గ్రామాన్ని నిర్మించాడు. అది వనమాలి కోట అని పిలవబడుతూ  కాలక్రమంలో కోట వనమాలి అయింది. వకారం ఉత్కళ (ఒరియా) భాషలో బకారం అవుతుంది కాబట్టి వనమాలి బనమాలి అయి ఉచ్చారణ సౌలభ్యంకోసం బొమ్మాళి అయింది.

చంద్రశేఖరుడు వనమాలిని తన జోలికి రాకుండా బొమ్మాళి రాజ్యానికి, తన రాజ్యానికి మధ్య సరిహద్దులలో ఒక గ్రామంలో త్రిలింగ దేశపు సర్దారును కాపలా పెట్టారు. ఆ గ్రామం ఇప్పుడు తిర్లంగి (త్రిలింగ) అని వ్యవహరించబడుతోంది. ఆ తర్వాత ముసల్మానులు విప్లవకారులై కోట బొమ్మాళిని ఆక్రమించారు. ఈ మహమ్మదీయులే పాత టెక్కలిని స్వాధీన పరచుకుని తురకల కోటని కట్టి నివసించారు. కోటబొమ్మాళికి సమీపంలో అగ్బరుపూరు ( నేటి అక్కవరం ) గ్రామాన్ని కూడా నిర్మించి నివసించారు. చంద్రశేఖర జగద్దేవుడు మహమ్మదీయులను తరిమికొట్టి పర్వత మధ్యలో దుర్భేధ్యంగా చింతామణి కోటను కట్టించాడు.

టెక్కలి రాజయిన వనమాలి పేరిట ఈ రెండు గ్రామాలే కాకుండా కంచిలి మండల పరిధిలో బొనమాలి పేరుతో మరొక గ్రామం కూడా ఉంది. ఒరియా వారిలో బనమాలి (వనమాలి-విష్ణుమూర్తి) పేరు వ్యక్తినామంగా విరివిగా కనిపిస్తుంది.

ఇదండీ బొమ్మాళి కథ. బావుంది కదూ.

Sunday, August 1, 2010

కవితామృతాన్ని కురిపించిన తిలక్




వెన్నెల్లో అందమైన ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటే
కొబ్బరాకుల మధ్యనుండి పున్నమి చంద్రుడు అమృతం కురిపిస్తూ ఉంటే
నిశ్శబ్దంగా ఒక వెన్నెల బిందువు కొబ్బరి మొవ్వలో రాలి పడితే
ప్రియురాలి కాలి మువ్వ మధురంగా సందడి చేస్తే
జూకామల్లె పరిమళంతో పిల్ల తెమ్మెర మృదువుగా ఒళ్ళు నిమిరితే

 అది తిలక్ కవిత్వం అవుతుంది. ఆ కవిత్వపు లోతులు చవిచూసిన వారికే అతని సుకుమార హృదయం ఆవిష్కృతమవుతుంది. ఆ సున్నిత హృదయంలోని ఆర్తి, కరుణరసాభివ్యక్తి పాఠకులకు నిత్య వసంతానుభూతి కలిగిస్తుంది. వారి మనసులను కరుణరసకాసారాలుగా మారుస్తుంది.

వంతెన కింద పిల్లాణ్ణి ప్రసవించి మూర్ఛిల్లిన స్త్రీ మూర్తిని చిత్రించినా, చిన్నసైజు జీతగాడైన తపాలా బంట్రోతును కళ్ళముందు సాక్షాత్కరింపజేసినా, ఆర్ద్రత నిండిన మనసుసుకవి తిలక్ ఒకడే అలా మనఃఫలకం మీద అద్దగలడు. కన్నీరుగా కరిగిన గీతికగా మార్చగలడు. కఠిన శిలనైనా కన్నీటి జడులతో తడిసిన దయా పారావతాలుగా మలచగలడు. అతని కవిత్వం అనితర సాధ్యం. అతను మూర్తీభవించిన మానవత్వం.

కుందుర్తి వారు చెప్పినట్లుగా వాల్మీకి నుండి నేటివరకూ కవులందరూ  కరుణరస వాదులే. కరుణ రసావేశం తో కవిత్వం రాసినవారే. పక్షుల శోకం వాల్మీకి నోట శ్లోకంగా పలికి రామాయణమైంది. పీడిత వర్గాల శోకం చూసి చలించిన ఆధునిక కవిలోని ఆర్ద్రత అభ్యుదయ కవితగా ఆవిష్కరింపబడింది. ఆభ్యుదయ కవికి పేదవర్గాల పట్ల ఎంత సానుభూతి ఉందో వారి పేదరికానికి కారకులైన ధనిక వర్గాల పట్ల, సమాజం పట్ల అంతకు రెట్టింపు కోపం ఉంది. దోపిడీ వ్యవస్థ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చెయ్యడానికి భయంకరమైన కొత్త పదబంధాలు సృష్టిస్తూ పరుష పదజాలంతో నిందిస్తాడు అభ్యుదయ కవి. భావ, అభ్యుదయకవులకి వారధిగా నిలిచిన తిలక్ కి కూడా బడుగు వర్గాల పట్ల సానుభూతి ఉంది. కానీ వారిని దోచుకుంటున్న వారిపై ద్వేషం లేదు, కసి లేదు.ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలన్న తపన మాత్రమే ఉంది. బడుగు వర్గాలను ఆదుకోవడానికి ఏ దేవుడైనా దిగివస్తే బావుండునన్న ఆవేదనా, దిగిరమ్మన్న నివేదనా అతని రచనలో కనిపిస్తుంది. వీరందరి కవితా భూమిక ఒకటే. అభివ్యక్తి లోనే భిన్నత.

బడుగు జీవుల కష్టాలను శ్రీశ్రీ చిత్రిస్తే పాఠకుల కళ్ళనుండి కలకలా కన్నీళ్ళు రాలవు. ఒంట్లోని రక్తం సల సలా మరుగుతుంది. రక్త జ్వాలలూ, కలకత్తా కాళిక నాలుకలూ కళ్ళముందు ఆవిష్కృతమవుతాయి. పదండి ముందుకు, పదండి తోసుకు అంటూ కదం తొక్కుతూ పదం పాడుతూ తాము కూడా విప్లవ సైనికులుగా మారిపోవాలనే ఆవేశం కలుగుతుంది. అదే బడుగువర్గం గురించి తిలక్ రాస్తే జాలిజాలిగా కన్నీరు చెక్కిళ్ళనుండి జాలువారుతుంది. ఆ కరుణ రసానుభూతిలో గుండె బరువెక్కుతుంది. శ్రీశ్రీ – తిలక్ వీరిద్దరి కవితా భూమిక ఒకటే కానీ వ్యక్తులు వేరు. వారి అభివ్యక్తులు వేరు. అందుకే శ్రీ శ్రీ అభ్యుదయ కవి అయాడు. తిలక్ భావకవికీ, అభ్యుదయ కవికీ వారధిగా నిలిచాడు. మానవతా వాది, అనుభూతివాది అయాడు.

ఆర్తి లేదా ఆర్ద్రత అన్న పదాన్ని నిర్వచించడం చాలా కష్టం. అది ఒక అనుభవం. బాధ అనే సామాన్యార్థం చెప్పుకున్నా దాని స్థాయి వేరు, తీవ్రతా వేరు. అది భాషలో పొదగలేని భావం. మరి ఇలాంటి, భాషకందని భావాన్ని భాషలో ఒదిగించి రాయగలగడమే తిలక్ విశిష్టత. తిలక్ ఆర్తగీతాన్ని చదివినప్పుడు మాత్రమే ఆర్తి అనే పదానికి గల అసలు అర్థాన్ని అనుభవంతో గ్రహించగలం.

అభ్యుదయకవి దేవుడి పేరిట సమాజంలో జరుగుతున్న మోసాలను, దోపిడీని, మూఢవిశ్వాసాలను, పేదవారి హీనస్థితికి కారణమైన పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థమీద ఆగ్రహంతో దుమ్మెత్తిపోస్తాడు. కానీ తిలక్ పేదవారి హీనస్థితి చూసి దానికి కారణమైన దోపిడీ వ్యవస్థను నిందించడు. కన్నీరుగా కరిగిపోతాడు. అంతరాంతరాలలోనే దగ్ధమైన బూడిద అవుతాడు. ‘ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు, ఏ భగవంతుడికి నివేదించగలదు’(ఆర్తగీతం) అంటూ పరితపిస్తాడు. సమాజానికి పేదవాడిని చూపించి వాడిమీద జాలి కలిగించి చేయూతనిప్పించడమే తిలక్ లక్ష్యం. అందుకే మనల్ని 'మీరెప్పుడైనా చూసారా ? కన్నీరైనా విడిచారా ' (పిలుపు) అని జాలిగా, సూటిగా ప్రశ్నిస్తాడు. లోకంలోని దైన్యాన్ని కళ్ళకు కట్టించి తోటి మానవుడితోనే కాదు ఆఖరికి దేవుడితో కూడా కన్నీరు కార్పిస్తాడు.

ఇలాంటి దుర్మార్గులను ఎందుకు సృష్టించావని గద్దించడు. దేవుణ్ణి నిలదీయడూ, నిర్బంధించడు. 'కాసంత కన్నీరూ, మరికాస్త సంతోషపు తేనీరూ యిచ్చి నిజాయితీగా హాయి హాయిగా బతక నివ్వ' మంటూ (ప్రార్ధన) జాలిగా వేడుకుంటాడు. ‘దేవుడా రక్షించు నా దేశాన్ని’ అంటూ దీనంగా ప్రార్ధిస్తాడు. తన చేత సృష్టించబడిన మానవుడే దానవుడై పోయాడని కన్నీళ్ళు పెట్టుకున్న దేవుడి కన్నీరు కూడా తుడిచి వీధి చివరిదాకా సాగనంపుతాడు.
‘పెద్దవాడు, కన్న కడుపు. ఏంచేస్తాడు పాపం’(నిన్న రాత్రి) అంటూ భగవంతుణ్ణి కూడా మహోదార హృదయంతో క్షమిస్తాడు. అంతటి కారుణ్య మూర్తిమత్వం తిలక్ ది.

తోటి మానవుణ్ణి హింసించే దానవుడి లాంటి మానవుణ్ణి చూసినా తిలక్ కు ఆవేశం కలగదు. ఆవేదనా, ఆక్రందనా తప్ప. అందుకే నేమో.. ‘చిన్నమ్మా వీళ్ళను కోపగించుకోకు అసహ్యించుకోకు’(నీడలు) అంటాడు. తిలక్ లక్ష్యం దానవుడిగా మారిన మానవుణ్ణి చంపడం కాదు. అతడిలోని దానవత్వాన్ని చంపి మానవత్వాన్ని నింపడమే తిలక్ ధ్యేయం. '.... పొసగి మేలు చేసి పొమ్మనుటే చాలు' అని వేమన చెప్పినట్టుగా శత్రువును చంపడం కాదు. ఆ శత్రుత్వ గుణాన్ని పోగొట్టడమే ఉత్తమం అనే మార్గాన్ని అవలంబిస్తాడు తిలక్.

దేవుడు మానవుణ్ణిని ఉత్తమ గుణాలతోనే సృష్టించాడు. కానీ ఆ మానవుడు ఏ కారణం వల్లో దానవుడిగా మారితే అది దేవుడి తప్పెలా అవుతుంది. తల్లి తండ్రులు పిల్లలను సదుద్దేశ్యంతోనే కంటారు. సక్రమ మార్గంలోనే నడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ తాము కన్న పిల్లలు దుర్మార్గులుగా మారిపోతే  తల్లితండ్రులు మాత్రం ఏం చేయగలరు? ‘నా కన్నబిడ్డ ఇలా మారిపోయాడే’అని నిశ్శబ్దంగా రోదించడం తప్ప. తిలక్ దృష్టిలో దేవుడు కూడా అంతే. అందుకే అతని దేవుడు ఇలాంటి దానవులని చూసి జాలిగా కన్నీళ్ళు కారుస్తాడు.

మానవుడిలోని దానవుడిని తరిమి కొట్టి మానవత్వం నింపడమే తిలక్ కవితా లక్ష్యం. అందుకే అతను అతి గొప్ప మానవతా వాదిగా నిలిచాడు- కవితాభిమానుల మనసులను  గెలిచాడు.
(ఆగష్టు 1,1921 బాలగంగాధర తిలక్ పుట్టినరోజు)
Related Posts with Thumbnails