Tuesday, December 6, 2011

చదివించే ఒక మంచి పుస్తకం--నింగీ..నేలా..నేనూ..అనే ఓ ఎన్నారై ఆత్మ కథ

నింగీ-నేలా-నేనూ అను (ఓఎన్నారై ఆత్మకథ)
డా. ప్రయాగ మురళీకృష్ణ
జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని ఉన్నత పీఠాన్ని అధిరోహించి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొంద గలిగిన వ్యక్తుల జీవితాలు తోటి వారికే కాదు తరతరాలకూ ఆదర్శనీయం.అటువంటి గొప్ప వ్యక్తులు తమ జీవిత చరిత్ర లను  గ్రంథస్థం   చేయడంవల్ల భావితరాల వారికి స్ఫూర్తి  ప్రదాతలు కాగలుగుతారు. ఓటమిని కూడా గెలుపుగా మార్చుకోగల ధీరత్వాన్నీ, చాకచక్యాన్నీ పదిమందికీ నేర్పించిన వారౌతారు. అందుకే గాంధీ నెహ్రూ వంటి మహనీయుల చరిత్రలు నేటికీ నిత్య నూతనంగా, ఆదర్శనీయంగా విరాజిల్లుతున్నాయి. మహామహులే కాదు జీవితంలో ఒక స్థాయిని అందుకో గలిగిన ప్రతి ఒక్కరి జీవితం లోనూ తెలుసుకోదగ్గ విశేషాలు చాలానే ఉంటాయి. అయితే హంగుకోసం కొత్తరంగులు పులమకుండా జరిగింది జరిగినట్టుగా చిత్రించబడినవీ, సమకాలీన సమాజచిత్రపటాన్ని అవిష్కరించగలిగినవీ అయిన జీవిత చరిత్రలకు మాత్రమే ప్రత్యేకమైన శాశ్వతమైన స్థానం ఉంటుంది. అటువంటి రచనలు మాత్రమే నిత్యనూతనంగా ప్రకాశిస్తూ భావితరాలకు ఆదర్శనీయంగానూ, పఠనీయ గ్రంథాలుగానూ నిలువగలుగుతాయి. 

విదేశాల్లో తెలుగు జెండాను ఎగురవేసి వైద్యరంగ వికాసానికే కాక తెలుగు సంస్కృతి వికాసానికి కూడా దోహద పడిన  సుప్రసిధ్ధవైద్యులు డా. ప్రయాగ మురళీ మోహనకృష్ణగారు తన జీవిత చరిత్రను  గ్రంథస్థం చేయడం బహుదా అభినందనీయం.

ప్రయాగ వారి స్వీయ చరిత్ర చక్కటి కథనాత్మకశైలిలో సాగింది. దీనిని చదువుతున్నప్పుడు పాఠకులకు ఎక్కడా స్వీయచరిత్ర చదువుతున్నట్టు అనిపించదు. ఉత్తమ పురుషలో సాగిన ఒక చక్కటి నవల చదువుతున్న అనుభూతి కలుగుతుంది. రచనలో ప్రయాగవారు ఉద్దేశించి ప్రత్యేక శిల్పాన్ని పాటించకపోయినప్పటికీ  దానంతటదే వచ్చి ఒదిగిపోయింది. అందువల్లే ఇందులో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు.

శ్రీకాకుళం జిల్లా మధ్యతరగతికి చెందిన బ్రాహ్మణ కుటుంబాల్లోని జీవద్భాషని రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబీకుల మధ్య  ఉండే ఆప్యాయతానురాగాలను, అనుబంధాలను మనోహరంగా చిత్రించారు. మానవీయ విలువలు జారిపోతూ మానవ సంబంధాలు మాసిపోతున్న నేటి
సమాజానికి ఆ మాధుర్యాన్ని రుచి చూపించారు. తల్లితోనూ తల్లి సమానురాలైన వదినతోనూ ఉన్న అనుబంధాన్నిఆయన వర్ణిస్తున్నప్పుడు ఎవరిగుండె అయినా ఆర్ద్ర మవక మానదు. మానవ సంబంధాలలో ఉండే గొప్పతనం అది తామూ తమ కుటుంబీకులూ నేడు ఉన్నత స్థానాల్లో ఉండడానికి తమ తాత ముత్తాతలు చేసిన పుణ్యకార్యాలే కారణమని వారి ఆశీర్వాదబలమే తమని ఈ స్థితికి చేర్చాయని  ప్రయాగవారు పేర్కొనడం తమ పూర్వీకులపై వారికి గల గౌరవ భావానికీ  తన నిగర్వతకూ వినమ్రతకూ నిదర్శనం.  మౌనంగానే ఎదగడం ఎంత ఎదిగినా ఒదగడం ప్రయాగవారి వినయశీలతకు తార్కాణం.

స్వస్థలమైన గొటివాడ పల్లె వాతావరణాన్నీ, ఆనాటి కట్టుబాట్లనూ, జీవితాలనూ, అనుబంధాలనూ  ప్రయాగవారు చాలా అందంగా సుమనోహరంగా  వివరించారు. బృందావనంలో మురళీమోహనుడు వేణుగానాన్ని ఆలపించినంత అలవోకగా, అతిరమణీయంగా, మధురాతిమధురంగా  మురళీ మోహన కృష్ణ గారి రచన సాగింది.

ఎందుకూ పనికిరాడని అందరితోనూ అనిపించుకున్న వ్యక్తి అతికష్టంమీద అత్తెసరు మార్కులతో పాసవుతున్న మనిషి పంతంపట్టి మెడిసిన్ సీటు సాధించడమే కాకుండా నిర్విఘ్నంగా చదువును పూర్తి చేయడం నిజంగా అద్భుతం. మెడిసిన్ సీటు ప్రయాగ  వారి జీవనయానంలో అతి గొప్ప మలుపు. కృషితో నాస్తి దుర్భిక్షం. అనే ఆర్య వాక్యానికి చక్కటి ఉదాహరణ ఇది. ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఏదో ఒక శక్తి దాగి ఉంటుందని, దానిని వెలికి తీయగలిగినప్పుడు  తప్పకుండా అద్భుతమైన    ప్రగతి సాధించగలుగుతాడని ప్రయాగవారి జీవితం నిరూపిస్తుంది.

కేవలం డాక్టరు పట్టా పొందడం తోనే ప్రయాగవారి  ప్రస్థానం ఆగి పోలేదు. అ క్కడి నుండే అసలు ప్రస్థానం మొదలైంది.అనస్థీసియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడమే కాకుండా ఆ రంగంలో విశేషమైన కృషి చేసారు. వారు ఆవిష్కరించిన నూతన వైద్యవిధానాలతో అంతర్జాతీయ ఖ్యాతిని పొంద గలిగారు.  ట్రినిడాడ్ దేశంలో ఉన్నప్పుడు వారు చేసిన సేవకు ఫలితంగా మ్యాన్ ఆఫ్ ద ఇయర్ బహుమతి పొందారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగిన అరుదైన  విజయం. 

ప్రయాగ వారి కీర్తి దేశ దేశాలా విస్తరించినా  వేళ్ళు మాత్రం మాతృభూమి లోనే నాటుకున్నాయి. అందువల్లనే వారు ఏదేశంలో ఉన్నా మాతృదేశపు మృత్తిక వాసనలు  ఆయనను వీడలేదు, తెలుగు వాడితనాన్నీఆయన మరచిపోలేదు. విదేశాల్లో కూడా తెలుగు సంస్కృతి మొలకలు నాటగలిగారు. ఆయన ట్రినిడాడ్ దేశంలో నివసించేటప్పుడు సత్య సాయి భజన సమావేశాలు ఏర్పరచి అక్కడి వారిలో కలిగించిన చైతన్యం గురించి చదువుతున్నప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది.

విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాషనీ, సంస్కృతినీ మరచిపోకుండా పిల్లలను మరువనివ్వకుండా చక్కటి సంప్రదాయ వాసనలతో పెంచిన ఘనత ప్రయాగ దంపతులది. తనభార్య రాజ్యలక్ష్మి చీరకట్టుగురించి సందర్భానుసారంగా ప్రయాగ వారు పేర్కొన్న విషయాలు రాజ్య లక్ష్మి గారి  సంస్కారాన్ని, సంప్రదాయ నిబద్ధతనీ నిరూపిస్తాయి. తల్లిదండ్రులు సంస్కారవంతులూ, సంప్రదాయానుసారులూ  కాబట్టే పిల్లలకూ అవి అలవడ్డాయి..అందుకే హిందూదేశపు దేవతా విగ్రహాలను నిరసిస్తున్న ఉపాధ్యాయురాలికి  వీరి కుమార్తె శ్రావణి చక్కటి ఉపదేశాన్ని ఇవ్వగలిగింది. చిన్న వయసులో తమ మతంపైన, సంస్కృతి పైన అంత అవగాహన, అభిమానం కలిగిఉండడం నిజంగా అభినందనీయం. జైలాండ్ అండ్ పోస్టెన్ అనే డేనిష్ పత్రికకు ప్రయాగ వారి కుమార్తెలు ఇచ్చిన ఇంటర్వ్యూద్వారా సంప్రదాయానికీ, కట్టుబాట్లకూ భారతీయ సంస్కృతికీ వారు ఇచ్చిన విలువ అవగతమవుతుంది.

మెడిసిన్ చదువుతుండగా ప్రయాగ వారికి కలిగిన ఆధ్యాత్మిక పరిణామం, అన్నిటినీ త్యజించి హరిద్వార్ వెళ్ళిపోవడం, అక్కడ గురూపదేశం పొందాక మామూలు స్థితికి రావడం వంటి విషయాలు వారిలోని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రయాగ వారిలో అంతర్లీనంగా  జీవుని వేదన దాగి ఉన్నదనిపిస్తుంది. ఇది వారి వ్యక్తిత్వంలోనే విలక్షణంగా తోచే అంశం. బహుశా ఈ లక్షణమే వారిని ప్రత్యేక మూర్తిమత్వం గలవారిగా తీర్చిదిద్దిందేమో ? సంప్రదాయబద్ధులుగా మలచిందేమో ?

జీవితపులోతులు తరచి , మూసి ఉన్న మనసుల తలుపులు తెరచి చూసి కనుగొన్న జీవిత సత్యాలను ప్రయాగ  వారు ఆవిష్కరించిన విధం శ్లాఘనీయం. ముందుతరాలకు స్ఫూర్తిదాయకం.

ఒకతరంనాటి జీవితాన్నీ, భాషనీ, సంస్కృతినీ అన్నిటినీ మించి మానవీయవిలువలనూ తెలుసుకోదలచుకున్న ప్రతి ఒక్కరూ చదివితీరవలసిన ఉత్తమ గ్రంథం ఇది.
        ఒక నింగీ...
        ఒక నేలా...
        ఒక ప్రయాగ !

(ఈ పుస్తకానికి ముందు మాటలు శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారూ, కీ.శే. అవసరాల రామ కృష్ణారావు గారూ వ్రాసేరు, ఈ పుస్తకం నవంబరు 24వ తేదీన విశాఖపట్టణంలో ఆంధ్రా యూనివర్శిటీ ప్లాటినమ్ జూబిలీ హాలులో ఆవిష్కరింబడింది. దీనిని ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించారు)





















                             నింగీ...నేలా...నేనూ...
                                                                    
                                 




                                         
                                   

Sunday, October 2, 2011

తెలుగు సాహితీ పథంలో "అలుపెరుగని బాటసారి"



ఆధునిక భావాలతో సంప్రదాయ రీతిలో ఉత్తమ రచనలు చేసినవారిలో గుఱ్ఱం జాషువా ప్రథమ గణ్యులు. ఆధునిక మహా కవులలో విశిష్టస్థానం పొందిన జాషువా లెక్కలేనన్ని సన్మానాలు, ప్రశంసలూ పొందారు.
1895 లో వినుకొండలో వీరయ్య, లింగమాంబలకు జన్మించిన జాషువా విశ్వ నరుడిగా ఎదిగారు. వారిది విశ్వమానవ గోత్రం. ఆనాటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న  అంటరానితనం  అనే పెను భూతాన్ని రూపుమాపడానికి తన వాడి కలాన్నే ఆయుధంగా వాడిన కవి వీరుడు జాషువా.

జాషువా జీవితాన్ని కవిత్వాన్ని విడదీసి చూడలేం. జీవితంలో తాను పొందిన అనుభూతుల యొక్క ఆవేదన యొక్క వ్యక్తీకరణమే అతని కవిత్వంగా రూపొందింది. అస్పృశ్యతా నివారణ, మూఢాచార ఖండన, పేదల పట్ల సానుభూతి, అభ్యుదయ కాంక్ష, జాతీయ దృష్టి జాషువా కవిత్వంలో ప్రధానంగా కనిపించే అంశాలు. అరుంధతీ సుతుడు గా తాను పొందిన ఆవేదనే గబ్బిలమనే కరుణ రసాత్మక కావ్యంగా రూపుదాల్చింది. తన జీవితంలో పొందిన అనుభూతులను, మానావమానాలను, నా కథ (ఆత్మకథ) గా ఆవిష్కరించారు. నాగార్జున సాగర్, ముంటాజ మహల్, బాపూజీ, నేతాజీ  మొదలయినవి వీరి ఇతర ఖండకావ్యాలు. శ్మశాన వాటిక, శిశువు, గిజిగాడు  మొదలయినవి కవితాఖండికలు.

జాషువా వారి పేరు తలచుకోగానే మనకు స్ఫురణకు వచ్చేవి గబ్బిలము, శిశువు, స్మశాన వాటిక మొదలయినవి. ముఖ్యంగా గబ్బిలం కావ్యాన్ని జాషువాని వేరు చేసి చూడలేం. అంతగా ఆ కావ్యంతో ముడి పడిపోయింది వారి జీవితం. జాషువా వారి కావ్యాలలో ముసాఫరులు కావ్యం గురించి తెలిసిన వారు చాలా అరుదు. ఆ పేరు విని ఉండవచ్చు కానీ దాని గురించి చదివినవారు గానీ, పరిచయం ఉన్నవారు గానీ తక్కువ.
జాషువా వయసు మీరిన తరువాత రాసిన కావ్యం. ఇది. నిజానికి ఇది చాలా అద్భుతమైన కల్పనతో కూడిన కథ. రెండు ఆత్మల సంభాషణ ఈ కావ్యం. ఇది కవి స్వకపోల సృష్టి. ఇందులో మాతృక కథ, ఆంధ్రదేశము, నా జననము, యోధుడుఅనే శీర్షికలున్నాయి. ముసాఫరులు అంటే బాటసారులు అని అర్థం.
కథా కాలం నాటికి భారతదేశానికీ చైనాకీ మధ్య సరిహద్దు విషయంలో యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో భారత వీరుడు ప్రాణాలు కోల్పోయి వీరమరణం పొందాడు. స్వర్గానికి ప్రయాణిస్తూ అతని ఆత్మ మేఘ మండలాన్ని దాటి నక్షత్రమండలం లోని (తారానాథాంతిక సీమ) ఒక సత్రం లో విడిది చేసి అలసట తీర్చుకుంటోంది. అదే సమయంలో స్వర్గలోకం నుండి భూలోకానికి ఒక ఆత్మ పయనిస్తూ ఈ సత్రంలోనే విడిది చేసింది. ఇహ పరాలకు ప్రయాణించే రెండు ఆత్మల సమావేశమే ఈ కావ్యంలోని ఇతివృత్తం. ఈ రెండు ఆత్మలు కుశల ప్రశ్నలు వేసుకున్న తరువాత తమ లోకంలోని విశేషాలను తీరుతెన్నులను ముచ్చటించుకుంటాయి. దేవలోకం ఆత్మ వేసిన ప్రశ్నలకు భూలోక వీరుడి ఆత్మ ఇచ్చే జవాబుల ద్వారా జాషువా ప్రపంచ తీరు తెన్నులను, వివిధ మానవ మనస్తత్వాలను అత్యద్భుతంగా ఆవిష్కరిస్తారు.

విశ్వమానవ గోత్రేయ వీరులైన  
కవులకున్ కర్మబంధంబు కట్టబెట్టి
పులుముచుందురు తలమీద కులమురంగు
తొలగి పోవదు లక్ష సబ్బులకు గూడ.
విశ్వనరులుగా భావించబడే కవులకు కూడా కులం  అనే రంగును ఈ లోకపు జనులు పులుముతారుట. ఆ కులం అనే రంగు తొలగి పోవదు లక్ష సబ్బులకు కూడా, అంటారు.

మానవ లోకంలో కులపిచ్చి ఎంత ముదిరిపోయిందో, విశ్వనరులైన కవులను అది ఎంత బాధిస్తుందో దీని ద్వారా వ్యక్తమవుతుంది. కవులు కులమతాలకు అతీతులనే విషయాన్ని మనం గ్రహించాలి.
మానవులకొక ముసాఫరు
 ఖానా ఈ భువనంబు కొంతకాలము తనువుం
బూని  వసించి యనంతర
యానమున కుపక్రమింతురనవతరంబున్.
మానవులకు ఈ లోకం ఒక సత్రం లాంటిదట. కొంతకాలం శరీరాన్ని ధరించి, జీవించి, మరల ప్రయాణానికి ఉపక్రమిస్తారట. చావు పుట్టుకలు శరీరానికే గాని ఆత్మకు కాదని ఈ ప్రయాణం అనంతమనీ కవి తెలియజేస్తారు.
మంచివాడొక్క తెగకు దుర్మార్గుడగును
దుష్టుడొక వర్గమున మహా శిష్టుడగును
ఒక్కడౌనన్న కాదనునొక్కరుండు
బుఱ్ఱలన్నియు నొకమారు వెఱ్ఱివగును

లోకో భిన్నరుచి అన్నట్టుగా ఒక్కొక్కరూ ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఒక వర్గానికి మంచి వాడైన వాడు వేరొక వర్గానికి దుర్మార్గుడు కావచ్చు. అలాగే ఒక వర్గానికి దుర్మార్గుడైన వాడు మరొక వర్గానికి సన్మార్గుడు కావచ్చు. ఒకడు అవునంటే ఒకడు కాదంటాడు. పరస్పర భిన్నమైన అభిప్రాయాలలో బుర్రలన్నియు నొకమారు వెఱ్ఱివగును అంటారు జాషువ. లోక ప్రజలలో ఐకమత్యం కొరవడుతోందని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించకపోవడం వల్లే లోకంలో ఇంత అశాంతి, అంతఃకలహాలు ఉన్నాయని జాషువ అంటారు.
 ధర్మమును సత్యమను పదార్థములు రెండు
 కలవు దొరకవు నీకు నంగళ్ళయందు
నిత్యము లభించు రత్న మాణిక్యమణులు
అనుగమింపవు నిన్ను దేహాంతరమున.
ఈ లోకంలో  ధర్మం, సత్యం అనే రెండు పదార్థాలు, కొనాలంటే అంగట్లో దొరకవు. నిత్యం మనిషితో ఉండే రత్న మాణిక్యాలు మనిషి పోయిన తర్వాత వెంటరావు. 
ఈ పద్యం చదవగానే ఎవరికైనా చటుక్కున పోతన వారి పద్యం కారే రాజుల్ రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే. వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే గుర్తుకు రాక మానదు. భావ స్వారూప్యం ఉండడం తప్పు కాదు కదా. ఒకే భావాన్ని చెప్పినా ఎవరి శైలివారిదే.  ఎవరి గొప్పదనం వారిదే.
అరిషడ్వర్గాలలో లోభ గుణం ఒకటి. లోభి గురించి ఎందరో కవులు ఎన్నో రకాలుగా చెప్పారు. జాషువా ఎలా చెప్తారో చూడండి.
ధనమార్జింతురు దాతురు
తినరేరికి బెట్టరింత తిరిపంబు మహా
ధనికులు కొందరు వారిం
కనుగొనుచు మృత్యువంతికంబున నవ్వున్.
కొందరు ధనం సంపాదిస్తారు. దాస్తారు. కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. ఇలాంటి వారిని చూస్తూ వారి ప్రక్కనే మృత్యువు చేరి నవ్వుతూ ఉంటుంది. ధనము శాశ్వతం కాదని మృత్యువుతో చిరునవ్వు నవ్వించి తేల్చి చెప్పేస్తారు జాషువా. ఎంత గొప్ప భావమో.

ఇంటనున్న ద్రవ్యమెరువు గుట్టను బోలు
వ్యాప్తి జెందెనేని ఫలము నిచ్చు
పారుచున్న నీరు పంటలు పండించు
పారకున్న నీరు ప్రాచి బట్టు
రువు కుప్ప ఒకచోటే ఉంటేకంపు కొడుతుంది. అది పొలంలో చల్లబడినప్పుడే నేల సారవంతమవుతుంది. అలాగే పారని నీరు పాచి పడుతుంది. పారే నీరే పంటల్ని పండిస్తుంది. ఇంట్లో దాచి పెట్టబడిన సొమ్ము ఊరికే పడి ఉన్న ఎరువు కుప్పలాగా, పారని నీరులాగా ఎవరికీ ఉపయోగ పడదు కాబట్టి  దాన గుణాన్ని పెంచుకొని జీవితం సార్థకం చేసుకోమని కవి ఉపదేశం.
ఈ తనువు విడిచి నరుడొక 
భూతంబై తిరుగునని యభూత కథలతో 
భీతిం గొల్పెడు మాంత్రిక 
జాతి యొకటి గల్గు నుర్వి స్వార్థ పరంబై. 
 
అలాగే కొందరు మంత్రగాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని, చనిపోయిన మనిషి  దయ్యమవుతాడని, పట్టి పీడిస్తాడని కట్టుకథలు ప్రచారం చేస్తూ ఉంటారని, అలాంటివాళ్ళ మాటలని నమ్మవద్దంటారు జాషువా. వేదాంతం చెపుతూ తోటివాడికి సహాయం చెయ్యని మానవుల గురించి  పెట్టడింత కబళమున్ అంటూ చురక వేస్తారు. మానవత్వాన్ని పెంచుకోవడం, దయా స్వభావం కలిగి ఉండడం ముఖ్యమని ఇటువంటి మానవతా దృక్ఫథాన్ని పెంచే బోధలే ఉండాలని జాషువా ఉద్దేశం.
పసితనము నందు హృదయము
కుసుమము వలె పరిమళించు గుణగణములు నిం
పెసలారు చుండు నాదశ
ముసలి తనంబునను గల్గ ముక్తి ఘటించున్.
మానవుడు బాల్యంలో చాలా నిష్కపటంగా ఉంటాడు. పువ్వలాగా పరిమళాన్ని వెదజల్లుతుంది అతని హృదయం. రాను రానూ స్వార్థ పరుడైపోతూ ఉంటాడు. బాల్యంలో ఉన్న కల్మష రహితమైన స్థితి వార్థక్యంలో కూడా పొందగలిగితే మోక్షం వస్తుందంటారు జాషువా.

కొమరులకోసమై భరతగో రమణీమణి పిండుచున్న క్షీ
రము పరరాజ ధూర్తులకు ప్రాప్తముగాదిక చీని రాజ్యమే
ఘము హిమశైల భూముల నకారణగర్జలు సల్పసాగె ద
ర్పముగల భారత ప్రళయ వాయుహతిం దుమురై నశించెడిన్

భారతదేశమనే గోవు  పిండుతున్న పాలు భారతీయులకే తప్ప విదేశీయులకు లభించవు. చైనా రాజ్యమనే మేఘం అకారణంగా మంచుకొండల్లో గర్జిస్తోంది. భారతవీరుల ప్రతాపం అనే గాలి వేగానికి  ఆ మేఘం చెల్లాచెదురైపోతుంది. శత్రువు యొక్క గుండెలు చీల్చి  వేడి రక్తాన్ని ఆపోసన పట్టగలిగే వీర సింహాలు భారతావనిలో అగణితంగా ఉన్నాయంటూ భారతవీరుల  ధైర్యసాహసాలను ప్రశంసిస్తారు కవి.
భారత దేశాన్ని గోవుతో పోలుస్తూ ఆ ఆవు పాలు భారతీయులకే దక్కుతాయి అనే సందర్భంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి భరతఖండము చక్కని పాడియావు  అనే పద్యం గుర్తురాక మానదు
ఒక త్యాగమూర్తి ప్రేమకు పాదులొనరించి  
                         స్వీయ రక్తమును వర్షించినాడు
ఒక మహాత్ముండు స్వేచ్ఛకు ప్రాణమర్చించి
                            మై మీద బట్టతో బ్రతికినాడు
ఒక రాచవాడహింసకు సర్వరాజ్యంబు
                           విడనాడి భిక్షకు నడచినాడు
ఒకడు ఖొరాను వ్యాప్తికి దేశదేశాల
                              తలదాచుకొని దీక్ష నిలిపినాడు
వారి దివ్యాత్మ లుభయ ప్రపంచములకు
జ్యోతులై ప్రజ్వలించు నచ్యుతములగుచు
వారి పగవారు మృత్యుగర్భమును జొచ్చి
భస్మమైనారు నామ రూపములు లేక

అనే పద్యంలో ఏసుక్రీస్తు, గాంధీ, బుద్ధుడు, మహమ్మదు ప్రవక్త ల మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తారు కవి.
ఏసుక్రీస్తు స్వీయరక్తాన్ని ధారపోసి ప్రేమకు పాదులు తీసాడు. గాంధీ ఒంటిమీద బట్టతోనే బతికి, స్వేచ్ఛ కోసం ప్రాణాన్ని అర్పించాడు. బుద్ధుడు అహింసకోసం సమస్త రాజ్యాన్ని వదిలిపెట్టాడు. ప్రవక్త ఖురాను వ్యాప్తికి దేశ దేశాలన్నీ తిరిగాడు. ఈ మహనీయుల దివ్యమైన ఆత్మలు ఇహ పర లోకాల్లో జ్యోతులై ప్రకాశిస్తూ ఉండగా వారిని అంతం చేయడానికి ప్రయత్నించిన వారు మాత్రం నామరూపాలు లేకుండా భస్మమైపోయారు. నిస్వార్థ గుణానికి త్యాగానికి ప్రేమకు ఎప్పుడూ శాశ్వతమైన స్థానం ఉంటుందని వాటిని అంతం చెయ్యాలనుకున్నవారే నామరూపాలు లేకుండా అంతరించక తప్పదని కవిభావం. 
భువనంబొక  రణరంగము
కవియుం దినదినము నైహికపు టిచ్చలు మం
చివియుం జెడ్డవి విజయం
బవసర మీనాడు ధీరులగు మర్త్యులకున్
ఈ లోకమే ఒక యుద్ధరంగం లాంటిది. మంచి చెడుల మధ్య ఎప్పుడూ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ధైర్యంతో పోరాడే మానవులకు తప్పక విజయం లభిస్తుంది. 
కోటానుకోట్లు నరులొక
మేటి జగన్మాతృ సుతులు మిత్రులని మదిం
బాటింపు మీ సువార్తన్
జాటింపుము జీవితంబు సార్థక్యమగున్
ఈ లోకంలో ఉన్నవారందరూ ఒకే తల్లి బిడ్డలు అనే భావాన్ని ప్రచారం చెయ్యి. నీ జన్మ ధన్యమవుతుంది. అని భూలోకపు ఆత్మ ద్వారా పలికిస్తారు జాషువా. దీనిద్వారా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షిస్తారు. 

ముసాఫర్లు కావ్యం జాషువా కల్పనకు, లోకజ్ఞతకు, విభిన్న మానవ మనస్తత్వ్త చిత్రణకు ఒక అద్భుత ఆవిష్కరణ. ఈ లోకంలో మానవుడు చిరంజీవిగా ఉన్నంతకాలం ముసార్లుఫ కావ్యం కూడా చిరంజీవిగా నిలుస్తుంది. జాషువా వారిని కూడా కవిగా చిరంజీవులుగా నిలబెడుతుంది. 
లెక్కకు మించిన అనర్ఘ రత్నాల వంటి ఖండ కావ్యాలనూ, కవితా కన్యకలనూ అందించిన జాషువా తెలుగు సాహితీ పథంలో అలుపెరుగని ముసాఫర్.

Friday, May 27, 2011

నిదురించే తోటలోకి............

నిదురించే తోటలోకి............

పాటలు రాయడం సులభం కావచ్చు. కానీ సినిమాలకు సన్నివేశపరంగా పాటలు రాయడం అంత సులభం కాదు. సన్నివేశానికీ,పాత్ర మనో భావాలకీ తగ్గట్టుగా, అతికినట్టుగా పాట రాయాలంటే కవి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే చక్కని భావాల గీతాలు పుడతాయి. అటువంటి చక్కని రచనకు అద్భుతమైన సంగీతమూ, గాన మాధుర్యమూ, చిత్రీకరణా కూడితే ఆ పాట ఎన్ని తరాలయినా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. పెదవులపై పారాడుతుంది. తెలుగు సినీ గీతాలలో ఇటువంటి మణిపూసలు ఎన్నో. సుకవులు ఎందరో.

కేవలం ఒకే ఒక్క పాట రాసి చలన చిత్ర రంగంలో గీత రచయితగా గొప్ప స్థానాన్ని పొందిన కీర్తి గుంటూరు శేషేంద్ర శర్మ గారిది. ముత్యాల ముగ్గు చిత్రం కోసం వారు రాసిన 'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది....'అనే గీతం గొప్ప ఆర్త గీతం. అద్భుతమైన సన్నివేశానికి, అద్భుతమైన రచన, అత్యంత అద్బుతమైన చిత్రీకరణ, మహాద్భుతమైన సంగీతం.......కోటి కోకిలలకు ఏక రూపమైన గాత్రధారి సుశీలమ్మ గానం. వెరసి ఇది ఒక విషాద రసరమ్యగీతం.

తేట తెలుగు తోటలో స్వేచ్ఛగా విహరించి ఏర్చి కూర్చి తెచ్చిన పదసుమాలతో కవి అల్లిన గీత మాలికకు అద్భుతమైన భావాన్ని అద్ది ప్రతి పదాన్ని సుశీలమ్మ పలికిన తీరు ...కరకు గుండెనైనా కరిగించి తీరు!.

సన్ని వేశ పరంగా చూస్తే కథానాయిక రాముడిచే పరిత్యజించబడిన సీత. లవకుశల్లాంటి ఇద్దరు పిల్లలతో వాల్మీకి లాంటి ఆశ్రమవాసి రక్షణలో జీవనం సాగిస్తూ ఉంటుంది. 'ఏ నాటికైనా తన రాముడు కనికరిస్తాడా ? అపార్థాలు తొలగి భర్తను కలవగలుగుతుందా ?తండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతున్న పిల్లలను అతని సన్నిధికి చేర్చగలుగుతుందా? ఎప్పటికైనా తామంతా ఒకే కుటుంబంగా జీవించగలుగుతారా? 'ఇవన్నీ కథానాయికను నిరంతరం వేధించే ప్రశ్నలు. వేదనని గుండెల్లోనే దాచుకుంటూ మూగగానే భగవంతుడిని వేడుకుంటూ జీవితాన్ని భారంగా గడుపుతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. కన్ను మూసేలోగా కలలోనైనా క్షణకాలమైనా దర్శనమిస్తాడో లేదోనని ఆరాటపడుతున్న మూర్తి కనిపించాడు.ప్రత్యక్షంగా కాకపోయినా కన్నకూతురితో నవ్వుతూ మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇది ఆమెకు దివ్యదర్శనం. రమ్యమైన అనుభూతి. ఒకసారి ఎదురు వెళ్ళి పలకరిద్దామనిపించినా అడుగు ముందుకు పడదు. తనమీద ద్వేషంతో రగిలిపోతున్న మనిషి పన్నెత్తి పలకరిస్తాడా ?  ఎవరో అనుకొని మాట్లాడుతున్నాడు కానీ తన కూతురే అని తెలిస్తే ఏమౌతాడో ? అతని భావాలు ఎలా ఉంటాయో ? అసహ్యించుకుంటాడో ? ప్రేమతో ఆలింగనం చేసుకుంటాడో!!

ఇలాంటి ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ  మానసికంగా సిద్ధమయే లోపలే పడవ ముందుకి సాగిపోతూ నాయకుడిని తనతో పాటు తీసుకు పోతూ రేవుని బావురుమనిపిస్తుంది.

ఈ చిన్న సంఘటన కథానాయిక మనసుని అతలా కుతలం చేసింది. నిరాశనుంచి పుట్టిన చిరు ఆశ దీపంలా వెలిగి తన జీవితాన్ని వెలిగిస్తుందా లేక నిరాశలోనే తన జీవితం లయిస్తుందా ? జవాబు తెలియని ప్రశ్నలు ఆమెను వేధించసాగాయి. ఏది ఏమైనా ....చిక్కటి చీకటి నిండిన ఆకాశంలో అతని రాక నిండు జాబిల్లి కాకపోయినా మిణుక్కు మిణుక్కుమనే నక్షత్రం లాంటిది. ఏమో! ఎవరు చెప్పగలరు?!  ఆ తార పక్కనే మబ్బుల్లో నిండు చంద్రుడు దాగున్నాడేమో ?ఆ మబ్బు తొలగిపోతే తన జీవితంలోనూ పండువెన్నెల కురుస్తుందేమో! ఏమో!  పీడకలలు తప్ప మామూలు కలలు కూడా కనలేని స్థితిలో ఉన్న ఆమెకు అతని రాక ఒక కమ్మని కల. ఆ కల కన్నీటిని తుడిచి తెలియని ఆశని, ఓదార్పుని ఇచ్చింది. ఆ వెంటనే నది దోచుకు పోతున్న నావ తీరని నిరాశని, నిట్టూర్పునీ కూడా ఇచ్చింది.

ఆశ నిరాశల మధ్య ఉయ్యాల లూగుతూ, వింత అనుభవం ఇచ్చిన ఉద్విగ్న స్థితిలో ఉన్న కథానాయిక నోట కవి పలికించిన భావగీతమే ఈ పాట. అతి కమ్మని పాట లోని ప్రతి మాటా ఓ చక్కని భావ చిత్రంగా ప్రతీకాత్మకంగా పలికించిన ఘనత శేషేంద్రవారిది.

బాపూ రమణల భావవాహినిలో రూపొందించబడ్డ రమ్యమైన సన్నివేశం. చక్కని గోదారి ఒడ్డున, చిన్న పొదరిల్లు. దాని చుట్టూ చక్కని తోట. అటువంటి చోట నిలబడి నది దోచుకుపోతున్న నావను, నావ దోచుకుపోతున్న నాథుడ్నీ చూస్తూ విలపిస్తూ కథానాయిక ఆలపించే గీతం ఇది.

*నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

నిజానికి తోట అనగానే అందమైన చెట్లు,రంగు రంగులుగా విరబూసి గాలికి తలలూపే పూలు, వాలుగా సెలయేరు కళ్ళముందు మెదులుతాయి. కానీ ఈ తోట అన్ని తోటల్లోగా అందమైనదీ సందడితో నిండినదీ కాదు. తోటే కానీ నిదురించే తోట. నిరాశతో నిండిన  నాయిక జీవితాన్ని నిదురించే తోటతో పోల్చడమే ఒక చక్కని బావ చిత్రం. అలాంటి నిదురించే తోటలోకి పాటరావడం (కథానాయకుడి రాక) నిశ్శబ్దాన్ని చీల్చే సవ్వడి చేయడం నిదురించిన ఆశలను మేల్కొలపడమే కదూ. ఆ మధురమైన పాట కన్నీటిని తుడవడమే కాదు ఒక కమ్మని కలనే కానుకగా ఇచ్చింది.



*రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసిందీ

ఆకల నిజంగా ఎంత కమ్మనిదో ! ఆ పాట ఎన్ని అద్భుతాలు చేసిందో. కుటీరాల ముంగిట్లో శుభాల ముగ్గులేసింది. చీకటి నిండిన గూటిలో దీపమై వెలిగింది. ఏ స్వరమూ పలుకలేక మూగబోయిన వేణువులో ఒక కొత్త స్వరం కలిపింది. ఆశలనే ఆకులను దిగులుగా రాల్చేసుకున్న అడవిలో ఒక కొత్త ఆశ వసంతంగా దయచేసింది. కుటీరం, దీనురాలి గూడు, శూన్యమైన వేణువు, ఆకురాలు అడవి ఇవన్నీ  విగతాశ అయిన కథానాయిక నిస్సారమైన జీవితానికి ప్రతీకలైతే రంగవల్లి, దీపము, స్వరం, ఆమని కథానాయకుని ఆగమానికీ, కొత్త ఉత్తేజానికి ప్రతీకలు.

*విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా!
గగనంలో మబ్బుల్లారా!
నది దోచుకుపోతున్న నావను ఆపండీ!
రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ!

కథానాయిక నిలచిన గుమ్మం ఇంటికి శుభసూచకంగా కట్టే మామిడాకులు వేలాడే గుమ్మంకాదు. విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మం అది. అలాంటి నిరాశ నిండిన గుమ్మంలో ఆశల అడుగుల సవ్వడి వినిపించింది.  ఆసవ్వడి విని ఆనందించే లోపలే ఆ ఆడుగులు దూరమై పోయాయి. ఆమె పిలుపు వినబడనంత దూరంలో నావలో ఉన్నాడతను. ఆ నావను నది అతి వేగంగా దోచుకుపోతోంది. ఆ అడుగుల సవ్వడిని శాశ్వతంగా గుమ్మంలోనే నిలబెట్టగలిగే శక్తి ఎవరికుంది.  ఆ వేగాన్ని అందుకునే శక్తి మానవ మాత్రులకు లేదు. అందుకే ఆమె ప్రకృతిని ఆశ్రయించింది. వాయువేగంతో ఎగిరే పక్షులూ, గగనాన గమించే మబ్బులనూ పిలిచి నది దోచుకుపోతున్న నావను ఆపమంటూ నావలేని రేవు బావురుమంటోందంటూ తన ఆవేదనను సందేశంగా వినిపించమంటూ దీనంగా ప్రార్థించింది.

మరి పక్షులూ మబ్బులూ నావను ఆపగలిగాయా?
నాయిక సందేశాన్ని వినిపించ గలిగాయా?
పాట విన్న ప్రతి ఒక్కరిలో నూ రేగే ఆత్మీయ ఉత్కంఠ ఇది.

అవి తప్పక వినిపించే ఉంటాయిలే. నాయిక వేదనను తీరుస్తాయిలే. ప్రకృతి కష్టాలను మానవుడు అర్థం చేసుకోలేడేమోగాని, మానవుడి కష్టాలను ప్రకృతి తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారు అనే చిరు ఆశతో నిండిన విషాదభరితమైన గుండె నుంచి వెలువడిన వేడి నిట్టూర్పుకు వెచ్చటి కన్నీటి పొర జతగూడి ఓదార్పునిస్తుంది.

ఆశనిరాశల మధ్య ఊగులాడే కథానాయిక కల్లోల మానస కాసారంలో ఈదులాడి ఆమెలో కదలాడే ప్రతి భావాన్ని తన భావంగా అనుభూతించి చక్కని భావచిత్రాలతో కరుణరస స్ఫోరకంగా శేషేంద్ర రాసిన గీతమిది.

అత్యంత విషాద మాధుర్యంతో నిండిన గీతాన్ని రాసి ఒక్క పాటతోనే సినీ గీతాభిమానుల హృదయంలో చిరంజీవిగా నిలిచి పోయిన ఘనుడు శేషేంద్ర శర్మ.      
     

Saturday, April 30, 2011

కాకమ్మ కథలు

చిన్ననాటి ముచ్చట్లు తలుచుకున్నప్పుడల్లా పిలవని నేస్తాల్లా ఎగురుకుంటూ వచ్చి చెరో భుజం మీద వాలిపోయి ఆనాటి కబుర్లు వినిపిస్తాయి కాకమ్మా, పిచికమ్మా.
 
అంతరాంతరాంతరాంతరాళం లో అవి నాకు అంత మంచి మిత్రురాళ్ళన్నమాట. కాకమ్మా, పిచుకమ్మా రెండూ జతే అయినా రెండూ సమానమే అయినా  పిచుకమ్మే నాకు కొంచెం ఎక్కువ సమానం . పిచికమ్మది కుడి భుజమైతే, కాకమ్మది ఎడం భుజం అన్నమాట.

పిచుకమ్మంటె ఏదో తెలియని మృదుభావం. ఓ పిల్లతెమ్మెర మృదువుగా మేను నిమిరినప్పటి పరవశం. దాని  కిచకిచల్లోంచి పుట్టిన మృదు మంజీరనాదం చెవుల్లో అమృతం పోస్తున్నట్టుగా ఇప్పటికీ వినిపిస్తూ తీయటి అనుభవం కలిగిస్తూ ....మైమరపిస్తుంది.

ప్చ్...ఇంత అనుబంధం పెంచుకున్నానా...కనీసం అది నన్ను విడిచిపెట్టే వేళ సెలవని అడగనైనా అడుగలేదని ఎంతగానో నిందించాలనిపిస్తుంది. కానీ నా బుజ్జి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా... ఛ ఛ.
అని తగ్గిపోతాను. జనారణ్యంలో బతకలేక అజ్ఞత్రాతారణ్యవాసం చేస్తున్న మిత్రురాలి క్షేమం కోసం రెండు కన్నీటి బిందువులు నిశ్శబ్దంగానే రాలుస్తాను.

కాకిగోల

కావ్...కావ్....కావ్...
అదుగో చూసావా...కాకమ్మ కథలు చెప్తానంటూ మొదలు పెట్టి మళ్ళీ పిచికను తలచుకుంటూ పరవశిస్తావేం..దానిమీద రాసిన కథలూ, కవితలూ చాల్లేదా.. ...ఎంతైనా మీ మనుషులందరికీ పిచికంటేనే ఇష్టంలే. హు నల్లగా ఉన్న బొత్తిగా  నల్లపూసనైపోకుండా ఇంకా మీ కళ్ళ బడుతున్నాననే కదూ ... ఈ చులకన. మళ్ళీ నేను కూడా మీ జనారణ్యం నుండి దూరంగా పారిపోతే గానీ నా ఊసు మీకు పట్టదు....అప్పుడు కానీ నా ఉసురు మీకు కొట్టదు. దగ్గర్లోనే ఉందిలే ఆ రోజు. ఇక్కడ నేనూ మీ లోకులు పలుగాకులతో బతకలేక ఛస్తున్నాను.

ఏదో ఒకనాడు ఇక్కడినుండి ఎగిరిపోతే గాని నా విలువ తెలీదు. అప్పుడు పెడుదురుగాని పిచికమ్మకి పెట్టినట్టే నాకూ ఓ దినం.
అప్పుడు చెబ్దురు గాని నా మీద కథలు...కవితలు...హు.

ఓదార్పు మాట...

అయ్యో కాకమ్మా...
అలా ఎగిరిపోకమ్మా...
అంత అలకేలనమ్మా...
నీమీదే నమ్మా ఈ కథలూ వినవమ్మా.
నీది కాకిగోల ఎంతమాత్రమూ కాదమ్మా
నీ కాకిలీల వినిపిస్తానాగమ్మా..


మనలో మాట
పిచికమ్మలాగే కాకమ్మకి కూడా కోపమొచ్చి దూరంగా ఎగిరిపోతుందన్న భయంతో నాలుగు ఓదార్పు మాటలు చెప్పాను గానీ.  నిజం చెప్పొద్దూ. నాకు కాకమ్మంటే ఇష్టమే కాని, అది భయంతో కూడిన ఇష్టం. కాకి గురించి చిన్నప్పటినుండి విన్న గాథలూ, కన్న కథలూ ఇలాంటి భయాన్ని కలిగించాయి. చిన్నప్పుడు అమ్మావాళ్ళు చెప్పిన కాకీ- పిచికా కథలన్నింటిలోనూ కాకే విలన్. అందుకే అదంటే కాస్త భయంతో కూడిన ఇష్టం. ఇష్టంతో కూడిన భయం.

కాకి రూపు, కాకి అరుపు కాస్త కఠోరంగానే ఉన్నా అది ఇంటిమీద వాలి అరిస్తే మాత్రం చెప్పలేనంత ఇష్టం. ఆ రోజెవరో చుట్టాలొస్తారని...ఎంచక్కా బడి ఎగ్గొట్టచ్చని. రాబోయే చుట్టాలు కాకి ద్వారా టెలిగ్రాం కొట్టినట్టనిపించేదన్నమాట.

ఏకాకి...అదేనండీ ... ఒంటరి కాకి అరిస్తే ఫరవాలేదట. కానీ మేడమీద కాకుల గుంపు చేరి అరిస్తే అరిష్టవట. శకున శాస్త్రం తెలిసిన కొఱవి గోపరాజు  'సింహాసన ద్వాంత్రింశతిక' లో చెప్పాడు  లెండి. అలా చేరనివ్వకుండా, అరవనివ్వకుండా జాగ్రత్త పడండేం.

ఇప్పటి కరువు కాలంలో ఒంటరికాకి అరిచినా అరిష్టమే సుమా.. మన పొట్టలు పోసుకోవడమే కష్టంగా ఉంది. ఇక వచ్చిన చుట్టాలకేం పోస్తాం అంటారేమో కొందరు. 'ఎంగిలి చేస్తో కాకిని తోలని'  అలాంటి పిసినారుల గురించి మనకెందుకు లెద్దురూ... ఏది ఏమైనా  'కాకతాళీయంగా '  నైనా భవిష్యత్తు చెప్పి హెచ్చరించే కాకి ని మెచ్చి 'కాకా' పట్టవలసిందే కదా! ఏమంటారు?

మా కాకిలీల

వేసవి సెలవల్లో శ్రీకాకుళం వెళ్ళింది మొదలు మా కాకి గోల (లీల) మొదలయ్యేది. పిల్లలం, మేమందరం చేరి అరిచే అరుపులకు తోడుగా..
అసలు చిన్నప్పుడు మాకో నమ్మకం కూడా ఉండేది. శ్రీకాకుళంలో కాకులెక్కువ కాబట్టే ఆ ఊరికి ఆ పేరొచ్చిందని. అంటే మరి చూసుకోండి .అన్ని కాకులుండేవన్నమాట.
అసలే పేద్ద పెరడు. ఆ పెరటి నిండా చెట్లు. చెట్లనిండా గూళ్ళు.. గూళ్ళ నిండా కాకులు...వాటి నోళ్ళనిండా కేకలు...
మేం పెరటి లోకి రావడం ఆలస్యం. కావ్...కావ్ మంటూ మా చూట్టూ చేరిపోయేవి. " అబ్బా. మేవంటే ఎంతిష్టమో. ఏడాది దాటినా మమ్మల్ని మరచి పోలేదన్నమాట"  అని మురిసిపోతూ ప్రేమగా ' కాకీ...దా...దా...' అని పిలిచే లోపలో ఓ కాకి ఒక్క ఎగురు ఎగిరి మా చేతుల్లో ఉన్న పండో , ఫలమో లటుక్కున పట్టుకు పోయేది. 

మేం కోపం తోనూ, మా వస్తువు ఎత్తుకుపోతోందన్న గాభరా తోనూ..."ఒసే ఏయ్...ఇటివ్వూ...నాదీ..." అంటూ దాని మీద ఇంతెత్తు ఎగురుతూ వెంటబడేవాళ్ళం. అనుకోకుండానే దుఃఖంతో మా గొంతు జీరబోయి దాని గొంతులా అయిపోయేదనుకుంటా. అది విని ఒళ్ళు మండిపోయేదేమో దానికి ...' నన్ను ఇమిటేట్ చేసేంత గొప్పవాళ్ళా మీరు' అన్న కోపంతో రివ్వున వచ్చి టంగున నెత్తిమీద రెండు మొత్తులు మొత్తి ఎంచక్కా గూడెక్కేసేది, 'దమ్ముంటే నన్ను పట్టుకో నా మాల కాకీ'  అని సవాలు చూపు విసురుతూ.
కావు కావు (రక్షించు ) మంటూ మేం అమ్మమ్మ దగ్గర చేరి జరిగింది చెప్పే వాళ్ళం.

ముందే చెప్పాను కదర్రా. జాగర్తనీ. చచ్చి పోతున్నామనుకో వీటితో వేగలేక . పెరట్లో ఒక్క వస్తువూ ఉండనవ్వవు. మొన్నటికి మొన్న ఓ కాకి ఏం చేసిందో తెలుసునా. మీ తాతగారు స్నానం చేస్తుంటే సబ్బు ముక్క ఎత్తుకు పోయింది. నిన్నటికి నిన్న తోమడానికని పనిమనిషికి వెండిగిన్నె వేస్తే అది పట్టుకు పారిపోయింది. మరి దొరుకుతుందనుకోలేదు స్మీ. గండి కోట వారి పెరట్లో దొరికిందట . వాళ్ళ పనిమనిషి మంచిది కాబట్టి తెచ్చి ఇచ్చింది. ఏం చేస్తాం కనిపించిన వస్తువునల్లా ఎత్తుకుపోవడం వాటి అలవాటు. అందుకే కాకిబుద్ధి అన్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటూ ఓదార్చి చేగోడీలో చక్కిలమో చేతుల్లో పెట్టేది అమ్మమ్మ.
ఇంతకీ సబ్బు ముక్కలతోనూ, వెండి గిన్నెలనూ ఎత్తుకుపోయి కాకి ఏం చేసేదంటారూ. మా అమ్మమ్మని ఏడిపించడానికి కాకపోతేనూ. ఇప్పటికీ తేలని మిలియన్ డాలర్ల ప్రశ్న మాకు.
లేకపోతే ...ఓ పని చేసేదేమో.  ఎంచక్కా నాగావళి ఒడ్డున ఒయ్యారంగా వాలి సుబ్బరంగా లక్స్ సబ్బు కరిగేంతవరకూ రుద్దుకుని......... వెండి గిన్నెలో వెండి గిన్నెడు నీళ్ళు పోసుకుని....ఇంచక్కా రెక్కలార్చుకుని...అవి ఆరాక అవసరం తీరాక 'మీ ఉసురు నాకెందుకని' వెండిగిన్నెని మాత్రం విసురుగా ఎవరి పెరట్లోనో విసిరేసేదేమో.

పాపం. కాకులు ఇలా ఎంత కాల్చుకు తిన్నా అమ్మమ్మకి వాటిమీద అస్సలు కోపం ఉండేది కాదు. మేం తినగా మిగిలిన అన్నమంతా తీసుకెళ్ళి పెరట్లో  ఓమూల గిన్నెలో వేసేది. అవి వచ్చి అన్నం తింటుంటే గాని తృప్తి పడేది కాదు. అమ్మమ్మ అప్పుడు నేర్పిన పాఠం ఇప్పటికీ గుర్తుండి పోయింది. అందుకేనేమో. ఏ కాస్త అన్నం మిగిలినా డస్ట్ బిన్ లో వేయకుండా పెరటి గోడమీద పెట్టి 'కాకమ్మా...రామ్మా!  తినిపోవమ్మా!'  అని మనసులోనే అనుకుంటాం. మా ఇంట్లో నూ చుట్టు పక్కల ఇళ్ళలోనూ ఇంకా పచ్చగా చెట్లూ, వాటిమీద చల్లగా నల్లగా కాకులు ఉండడం వల్ల ఆలా పెట్టిన అన్నం వృథా కావడం లేదు లెండి.

మా అమ్మమ్మా వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ మేం ఎంత మెలకువగా వ్యవహరించినా ఏదో ఓ మూలనుండి  ఏదో ఓ కాకి హఠాత్తుగా ఎగిరొచ్చి మాలో ఎవరో ఒకరికి శృంగభంగం చేసేది. అదే జడలువేసుకునే వాళ్ళంకదా...ఆ జుట్టు పీకి పోయేది.
"భూమికి జానెడు లేని కాకి చేతుల్లో పరాభవం పొందటమా...క్షణంలో తుర్రుమనిపించలేమూ" అని కసిగా  అనుకునే వాళ్ళమే కానీ దాన్ని గట్టిగా తరిమి కొట్టాలన్నా భయపడి చచ్చే వాళ్ళం. ఎందుకంటే మా వాళ్ళు కాకి పగ అంటూ కొన్ని కథలు వినిపిస్తూ ఉండేవారు.
 ఫలానా ఆయన మీద ఓ కాకి పగ పట్టిందట అంటూ... "పాము లాగే కాకీ కూడా పగపడుతుందట. అది పగ పట్టిందంటేనా...ఇంట్లోంచి బయటకొస్తే చాలు తలమీద తన్నీ, ముక్కుతో పొడిచీ చంపుకు తింటుంది..జాగర్తగా ఉండండి" అనేవారు.
మా బాబాయి ఒకసారి బూరుగుచెట్టుమీద కాకి గూడు పెట్టుకోవడం చూసి కిందనుంచి రెండు రాళ్ళు విసిరి కాకిని కొట్టారుట...చిలిపితనానికి.. అంతే..ఆయనని  ఆ బూరుగు చెట్టుమీద ఇల్లు కట్టుకున్న కాకి వీధి మొహం చూడనిచ్చింది కాదు...ఇంట్లోంచి బయటకి రావడం భయం, ఎక్కడినుంచి వచ్చేదో మరి ఎగిగి వచ్చి మొహం మీద, తలమీద కాళ్ళతో తన్ని గాయపరిచేది. కాకి భయానికి ఆయన పది రోజులు ఇంట్లోనే ఉండి పోయారట ఆఫీసుకు వెళ్ళకుండా. తర్వాత చాలాకాలం ఎండకీ , కాదు వానకీ కాదు కాకికి భయపడి  గొడుగేసుకొని ముఖం మూసుకొని ఆఫీసుకి రహస్యంగా వెళ్ళేవారుట...మొత్తం మీద కాకిని ఏమార్చగలిగారు బాబాయి.

అందుకే కాస్త భయంగా, దూరం దూరంగానే మసలే వాళ్ళం కాకులకి.
అసలే ముద్దుగా అది మా నెత్త్తిన మొత్తిన మొత్తులు తిన్న వాళ్ళమేమో...ఆ పాటి భయమూ, గౌరవమూ ఉండకుండా ఎక్కడికి పోతాయీ...

కాకులంటే భయం ఉన్నా ఓ పక్క చెప్పలేని సరదా కూడా ఉండేది. ఒక్కొక్క పుల్లా చేర్చి గూడు కట్టడం చూస్తే చెప్పలేని పులకింతా, ఒకింత ముచ్చటా కలిగేది. అమ్మమ్మ పెట్టిన అన్నం ముద్దను ముక్కుతో పొడుచుకుని తీసుకువెళ్ళి గూట్లో ఇంకా కళ్ళు తెరవక పోయినా నోళ్ళు మాత్రం తెరచుకున్న పిల్ల కాకులకి ముద్దుగా పెట్టే దృశ్యం...గుండె కాన్వాసు లో శాశ్వతంగా లిఖించబడిన  అద్భుత వర్ణ చిత్రం.

కాకిగూడు తలచుకుంటే చాలు ...సింగరాజు లింగరాజు (వరవిక్రయం) గుర్తొస్తాడు. వంటవాడు వంటకోసం కట్టెలిప్పించమంటే 'కాకిగూడు కొట్టి పుల్లలు తీసుకురా '  అంటాడు. 'ఖరనామ సంవత్సరంలో మా ఇంటి వంట అంతా కాకి గూళ్ళతోనే కానిచ్చాం' అంటాడు పరమ పిసినారి సింగరాజు లింగరాజు. 
కాకుల్ని కొట్టే వాళ్ళే కాదు కాకి గూళ్ళని 'కొట్టేసే' వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. పాపం...కాకులు. పగ పడతాయంటే పట్టవూ మరి !


అన్నట్టు కాకిగూడంటే మరో విషయం కూడా గుర్తొస్తోందండోయ్.

మా చిన్నప్పుడు అంటే సెవెన్టీస్ లో రింగులు రింగులుగా, మెడ మీదుగా, భుజాల వరకూ జాలువారుతూ, ఆరేడంగుళాలకి తక్కువ కాకుండా ఎత్తుగా, ఒత్తుగా హిప్పీ క్రాఫ్ పెంచుకోవడం అబ్బాయిల ఫేషన్ గా ఉండేది. మా మూడో మామయ్య క్రాఫ్ అచ్చం అలాగే ఉండేది.

 అది చూసి మా పిన్ని కాకిగూడు అంటూ వెక్కిరించేది. అప్పట్లో మాకో కార్టూను(బాపు గీసినదా?) కూడా చూపించింది. సదరు క్రాఫ్ ఉన్న ఓఅబ్బాయి నెత్తిమీద పక్షి గూడు కట్టుకొని కాపురం చేస్తున్నట్టుగా.
అప్పుడు మాకనిపించేది...నిజంగానే మా మామయ్య క్రాఫ్ గూట్లో ఓ రెండో, మూడో కాకి పిల్లలు దాగున్నాయేమో, ఎగరడం వచ్చిన తర్వాత చటుక్కున ఎగిరొస్తాయేమోనని.

అంత దట్టమైన అందమైన క్రాఫు గల మామయ్యకి ఇప్పుడు ఆ క్రాఫే కాదు అసలు క్రాఫే లేదు తెలుసా? పాపం దాన్ని ' కాకెత్తుకుపోయిం' దోచ్. కొంచెం జాలి తలచి గత వైభవ చిహ్నంగా నాలుగు పాయలు మాత్రం మిగలనిచ్చింది లెండి.
కాకమ్మ గురించి చెప్తుంటే ఎన్నో కబుర్లు అలా మనసులోతుల్లోనుండి తన్నుకొచ్చేస్తున్నాయ్, (తెలివైన కాకి కుండలో కొంచెమే ఉన్న నీళ్ళలో రాళ్ళు వేస్తే నీళ్ళు తన్ను కొచ్చినట్టుగా). 

మా కాకమ్మ అలక తీరేటట్టుగా కొన్ని కథలు చెప్పాను. కానీ ఎన్ని చెప్పినా ఇంకా ఎన్నో చెప్పాలనుంది. ఇంకా వీలైనప్పుడు మరిన్ని చెప్తాను. 
విందుగా....పసందుగా...
మరి మీరూ విందురుగా...

పి.ఎస్: 'నీకేం...ఎన్నైనా చెప్తావ్. కాకమ్మ కథలు. నీ కాకి గోల వినలేక మేం చావాలి' అని మాత్రం అనకండేం బ్లాగర్లూ.
నా కాకమ్మ కథలు చాలా బావున్నాయని, మీరు బాకా పట్టుకొని ' కాకా' సురులై  పొగడకపోయినా ఫరవాలేదు. కానీ, 
తనని పట్టించుకోవడం లేదని కాకమ్మ మనమీద కోపం తెచ్చుకొని, జనారణ్యం లోనుండి నిర్జనారణ్యంలోకి పారి పోకముందే, దాని రోదన, అరణ్య రోదన కాకముందే, దాన్ని కాకెత్తుకుపోకముందే మీకు తోచిన కాకమ్మ కథలు చెప్తానంటే వినడానికి మాత్రం నేను రెడీ. మరిక మీరూ మొదలెట్టండీ.......కాకమ్మ కథలు.

Sunday, April 10, 2011

ఉందిలే మంచి కాలం ........అనబడే హీరోయిన్ల ఓదార్పు యా(మా)త్ర !!

ఉందిలే మంచి కాలం ........అనబడే
హీరోయిన్ల ఓదార్పు యా(మా)త్ర !!
తొండ ముదిరితే ఊసరవెల్లవుతుందట                                                                     
మరి సినిమా హీరోయిన్ ముదిరితే........??

వయసు పెరిగి,
ఒళ్ళు పెరిగి
ముఖంలో గ్లామరూ,
 వెండితెరలో వేషాలూ మాత్రం తరిగిన
 సినిమా హీరోయిన్ లూ......!!
మీరెంత మాత్రమూ చింతించవలదు.
బుల్లి తెర  మీకు తెర నిండుగా బోలెడు అవకాశాలు కల్పిస్తోంది.
నిజానికి వెండి తెరలో నాయిక వేషాలు వేయడం కంటే బుల్లి తెరకు అత్తగారి వేషం వేయడంలో బోలెడు అదనపు సౌకర్యాలు న్నాయి.
అవేమిటో తెలిస్తే బుల్లితెరకే మీ ఓటు వేస్తారు.
కావాలంటే ఆల్రెడీ బుల్లితెరకి షిఫ్టయిపోయిన ఎక్స్ కథానాయికలనడిగి చూడండి మీకే తెలుస్తుంది ఆ సౌలభ్యాలేమిటో!
పోనీలెండి. .......వాళ్ళు సరిగ్గా చెప్పరేమో.
ప్రొఫెషనల్ రైవల్రీ ఒకటేడుస్తుందిగా !!
నేనే చెప్తాన్లెండి. ఎంతైనా కొంతకాలంపాటు మీ అభినయం తోను, అందంతోను మమ్మల్ని అలరించినవారు కదా. మీ పై మాకున్న అభిమానం ఎక్కడికి పోతుందీ  ?
 ఇదిగో చెప్పేస్తున్నా......
 ఒకటీ.................
హీరోయినైతే ఏడాదికి మూడో నాలుగో మహా అయితే ప్ఫదో, పన్నెండో. ఖర్మకాలి వాటిలో ఒకటో రెండో ఫ్లాపయ్యాయనుకోండి అంతే సంగతులు. అఖిలాంధ్ర ప్రేక్షక హృదయ చోరిణి బిరుదు కాస్తా అఖిలాంధ్ర  
ఐరన్ లెగ్గిణి  గా  మీ పేరు సినీ చరిత్రలో తిరగరాయబడుతుంది.
అదే సీరియల్ అత్తగారనుకోండి. ప్రతిరోజూ షూటింగ్ పండగే. ఇక్కడ హిట్టూ ఫ్లాపుల భాగోతాలంతగా ఉండవు. ఒకవేళ ఏమూలో ఉన్నా కూడా ఆ పాప పంకిలం క్యారక్టరార్టిస్టుల పాద పద్మాలకు అంటదు. కాబట్టి ఇల సాటిలేని అత్తగా వెలిగిపోవచ్చు. అందనంత ఎత్తుకు ఎదిగి పోవచ్చు. (అడ్డంగా ఎదిగినా అభ్యంతరం ఉండదు) . హీరోయిన్లుగా ప్రేక్షక హృదయ  సామ్రాజ్యాలను ఒకప్పుడు కొల్లగొట్టిన తారలకు ప్రత్యేక డిమాండ్ కూడా కద్దు.

ఇంకోటీ....
హీరోయిన్లుగా ఒక్క కేజీ బరువు పెరిగినా క్రేజీగా గోల పెట్టేసే అభిమానులు - టీవీ అత్తగా తెరనిండుగా పెరిగినా  ఏవీఁ అనుకోరు.  తీగె పాకం ల్లాటి  సన్నని శరీరాలతో ఊరించిన మీరే -  ఇప్పుడు పాకం పీల్చిన గులాబ్ జామూన్లలా ఊరిపోయినా ప్రేక్షకులు కళ్ళనిండుగా చూస్తూ ఊరుకుంటారు. ఆ పాటి బరువు లేకపోతే పాత్రకు న్యాయం జరగదని సరిపెట్టేసుకుంటారు.
 హీరోయిన్లుగా అరకేజీ బరువు పెరిగితే పాత్ర దక్కక పోయే ప్రమాదమున్నట్టే సీరియల్ అత్తగారు గా అరకేజీలో అరవంతు దగ్గినా పాత్ర దక్కకపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి హీరోయిన్లూ...తస్మాత్ జాగ్రత్త !
ఒకప్పుడు కడుపు మాడ్చుకొని, కష్టానికి ఓర్చుకొని వీరగా చేసిన డైటింగులన్నీ పక్కన పెట్టేయండి.
తిండి కలిగితె పాత్ర కలదోయ్ అన్న మాటని గుర్తుపెట్టుకొని వెజ్జూ, నానువెజ్జూ కలిపి మరీ లాగించెయ్యండి.
మరోటీ....
అత్తగారి పాత్రలు ధరించడంలో మరికొన్ని ఆకర్షణలతో పాటు నటనా సౌలభ్యం కూడా ఉందండోయ్.
1.        1.  హీరోయిన్లుగా కోడళ్ళ పాత్రలు ధరించి అత్తల చేతుల్లో పడిన   
           ఆరళ్ళన్నింటికీ ఎంచక్కా బదులు తీర్చేసుకోవచ్చు.
       2.   హీరోయిన్లుగా ఉన్నప్పుడు నాగకన్య పాత్ర (నగీనా లో శ్రీదేవి లా)  
           మిమ్మల్ని వరించలేదని దిగులుపడుతున్నారా ? ఎంతమాత్రమూ 
           విచారించవలదు. అత్తగారి వేషంలో ఆ దురద తీర్చేసుకోవచ్చు. 
           పాము యాక్షన్ బహు సులభంట. క్లోజప్లో విషపు చూపుని ఓసారి 
           విసిరితే చాలు. మిగతాదంతా కెమేరా మాన్ చూసుకుంటాడు.
        మీరు విషపునాగు అని సూచించడానికి కళ్ళకి  నీలపు కాంటాక్టు   
        లెన్స్ ఎలాగో వాడబడుతుందనుకోండి. ఇంకా స్పెషల్ ఎఫెక్టు 
        కావాలంటే ఆఫ్రికా అడవుల్లో పడగెత్తిన పామునోసారి, మీ 
        మోమునోసారి అలా పదిసార్లు చూపిస్తాడు. కాబట్టి ఆట్టే     
        కష్టపడక్కరేకుండా  మీ కొచ్చిన దాంట్లో ఆరోవంతు యాక్షన్ 
        చేసినా     చాలన్నమాట. 
        మరి పామైతే బుస్సు బుస్సున బుసలు కొట్టొద్దూ. అది మాత్రం 
        సులభమా అనడుగుతారేమో ?
        అబ్బే…… చాలా ఈజీ అండీ. ఒక్కసారి గుండెలనిండా గాఠిగా ఊపిరి 
        పీల్చుకుని అంతే గాఠిగా ఊపిరి విడిస్తే చాలు.
        నిజానికి దీనికోసం కూడా  ఆట్టే కష్టపడక్కర్లేదుట. భారీ మేకప్పు, 
        భారీ    నగలూ, భారీ పట్టుచీరలతో అలంకరించబడిన అతి భారీ 
        కాయంతో  సెల్లూపుకుంటూ పచార్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు.
        కాబట్టి ఆయాసం,  దాంతో పాటు  దాని అప్పగారైన ఆవేశం రెండూ 
       వాటంతటవే జమిలిగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. దీనికి తోడు 
       ఒంట్లో బీపీ కూడా ఉంటే మరీ మంచిది. సన్నివేశం బాగా రక్తి 
       కడుతుంది. జనాలు ఒకటికి రెండు వీరతాళ్ళు వేస్తారు.
3.     హీరోయిన్లుగా పాత్రల కోసం ఎంతో శ్రమించి నవరసాలూ ఒలకబోసి  
       ఉండి ఉంటారు. కానీ ఇప్పుడు వాటిలో  ,
       కరుణ, శాంత, శృంగార రసాలకి  బోల్డంత రెస్టిచ్చి బీభత్స, రౌద్ర, వీర,   
       భయానక రసాలను మాత్రం ధారగా ఒలక బోస్తే చాలు.  ఇందులో 
       ఇంకో అదనపు ఆకర్షణ కూడా ఉందండోయ్. ఒక వేళ ఉత్తమ కథా 
       నాయికగా  నందిఅవార్డు అందుకొని  ఉండకపోయినా ఉత్తమ 
       అత్తగారిగా   టీవీ నంది అవార్డు ఠీవీగా అందుకోవచ్చు.
4.      హీరోయిన్లుగా ఉన్నప్పుడు ఆరుగజాల పట్టుచీరలు కట్టుకొని 
        ఒంటినిండా నగలు పెట్టుకొని  అలంకరించుకుంటే  బావుండునన్న 
        కోరిక కలిగినా దర్శక, నిర్మాత, ప్రేక్షక వర్గాల కోసం త్యాగం చేసి 
        అరగజం  వస్త్రం తోనే సరిపెట్టుకొని ఉండవచ్చును. కానీ సీరియల్ 
        అత్తగారైతే పగలు పది గంటలైనా, రాత్రి  రెండు గంటలయినా ఏ 
        షాటైనా, ఏ ఎపిసోడైనా ఆరు గజాల పట్టు చీరకీ, అరకేజీ   
        ఆభరణాలకీ   తక్కువ కాకుండా ధరించి ఎంచక్కా మీ చిరకాల 
        వాంఛని తీర్చుకోవచ్చు.

        సినీ హీరోయిన్ కీ  టీవీ అత్తగారికీ తేడా
        ఒక్కమాటలో చెప్పాలంటే........
        హీరోయిన్లుగా -
        వలువలు తక్కువ 
        విలువలు ఎక్కువ 
        అత్తగారిగా-
        వలువలు ఎక్కువ      
        విలువలు తక్కువ ....


మరి హీరోయిన్ పాత్రకా....
అత్తగారి పాత్రకా
దేనికి మీరు ఓటు వేసేరూ....
రెండిట్లో ఏది మీకు ప్యారూ.....
(డెఫినెట్ గా అత్తగారి పాత్రకే కదూ......)
సో........................
     వయసులు మళ్ళిన
     ఒళ్ళులు పెరిగిన
     తారల్లారా రారండి
     అత్తగార్లుగ  మారండి.....

Related Posts with Thumbnails