Thursday, January 6, 2011

వంటింటి విష(య)ములు



కన్యాశుల్కం (సినిమా)లో  గిరీశం వెంకటేశాన్నడుగుతాడు ,బుచ్చమ్మని చూస్తూ.
ఈ ప్రపంచకంలో ఏముండునూ?” అని.
విడోస్ అని వెంకటేశంతో చెప్పించాలని అతని ఉద్దేశం.
కానీ వెంకటేశం చేగోడీలు అంటాడు ఇంతలేసి కళ్ళతో ఎదురుగా కనిపించిన వస్తువుని ఆశగా చూసి.
ఒకవేళ మీరూ గిరీశంలాగే మీ పిల్లల్ని వంటింట్లో ఏముండునూ అని అడిగేరనుకుందాం.
పోపుల డబ్బా, గ్యాస్ పొయ్యి, గ్రైండరూ అని చెప్తారని మీ ఉద్దేశం. కానీ అమ్మ జడతోనో, బామ్మ ఒళ్ళోనో  ఆడుకుంటూ, ఠీవిగా టీవీ సీరియల్స్ చూసే పిల్లలైతే ఏం చెప్తారో మీకు తెలుసా?
చిన్న క్విజ్. చెప్పుకోండి చూద్దాం.
యథా రాజా తథా ప్రజా అన్నట్టు సీరియల్స్ చూసే పిల్లల తల్లులైతే ఠక్కున చెప్పేస్తార్లెండి.
కానీ సీరియల్స్ చూడని, లేదా చూడలేని, లేదా చూడకూడదని భీష్మించుకున్న అభాగినుల కోసం
ఆ సమాధానం చెప్పేస్తున్నా.
చెప్పకుండా సస్పెన్సుతో చంపడానికి నేనేమైనా సీరియల్ కిల్లర్ నా.

పాయిజన్ అండీ బాబూ. స్పెల్లింగ్ తో సహా రాసుంటుందండీ.... ఒట్టు!!(ఒకటోసారి)
ఏవిటీ...పాయిజన్ అనగానే పక్కలో పాయిజన్ సీసా పగిలినట్టనిపిస్తోందా?!
లేక ఈ కలభాషిణికి మరీ తోస్తున్నట్టులేదు. హాయిగా కలలు కంటూ కూర్చోకుండా ఈ కలవరింతలూ, కట్టుకథలూ ఏవిటీ అనిపిస్తోందా.
ఇది కట్టుకథ మాత్రం కాదండీ.
ఒట్టు (రెండోసారి)కావాలంటే మీరూ చూడండి సీ.....రియల్.
అన్నింటా కాకపోయినా నాల్గింట మూడొంతుల సీరియల్స్ లో ఉప్పు, పంచదార వంటి వంటావసర వస్తువులతో పాటు దర్జాగా ఓ అందమైన గాజు సీసాలో తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుందది.
సరే. దాన్ని పక్కన పెడదాం.
మరో చిన్న క్విజ్ పెట్టనా?
మీరు కాఫీ గానీ, టీ గానీ, అథవా పాలో, పాయసవో గానీ తయారు చేస్తే ఏం కలుపుతారు?
పంచదార....
ఏడిసినట్టుంది. ఇది కూడా క్విజ్జేనా అని విసుక్కుంటే మీరు పప్పులో కాలేసినట్టే.


పోనీ మరో ఛాన్సిస్తాను. ఆలోచించండి చూద్దాం.
ఏముందీ ?
మొగుడు మరీ ముద్దొచ్చి సరసాలాడాలనిపిస్తేనో లేదా మేనబావతో మేలమాడాలనిపిస్తేనో,
ఇంటికి కొత్తల్లుడొస్తేనో పంచదారకి బదులుగా సరదాగా ఉప్పో, మిరప్పొడో కలుపుతాం అనచ్చు.
అలా అంటే కూడా మళ్ళీ తప్పులో కాలేసినట్టే.

మీకు తెలుసునో లేదో గానీ సీరియల్స్ లో మాత్రం అత్తలకి, కోడళ్ళమీద గానీ, కోడళ్ళకి తోడికోడళ్ళమీద గానీ కోపం వస్తే ఎంచక్కా పంచదార  బదులుగా పక్కనే ఉన్న పాయిజన్ ని కలిపేస్తారు. ఒట్టు(ముచ్చటగా మూడోసారి)
ఆ తర్వాత విషం కలిపిన పదార్ధాన్ని బలిపశువుతో తాగించడానికి తేనెపూసిన కత్తుల్లా,
క్లోజప్ లో పువ్వుల నవ్వులు రువ్వుతూ వంటింటి గుమ్మంలోంచి అవతలికి అడుగు పెడతారు.

అయితే ఇలా గుమ్మం దాటిన వాళ్ళు బలిపశువుల గుమ్మం చేరడానికి ఒక్కోసారి ఒక రోజుగానీ లేదా ఒక వారం గానీ పట్టచ్చు.
ఆ విషయం అది డైలీ సీరియలా లేక వీక్లీ సీరియలా అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.
అయ్యో!! ఈ విష పదార్థాన్ని అవతలి వాళ్ళు తాగితే ఏమై పోతారో, అసలు తాగారో లేదో అన్నది మాత్రం తేలకుండా హారిబుల్ సస్పెన్స్ లో ఉండిపోతుంది, కొంతకాలం పాటు.
ఆ రహస్యం తెలిసినా నేను విప్పనండీ....ఎందుకంటే ప్రస్తుతం ఈ చర్చ వంటింటి విష(య)ములకే పరిమితం కాబట్టి.

ఎంతైనా లావుపాటి పిన్నిగార్లు కదండీ. ఈ గుమ్మం నుండి ఆ గుమ్మం చేరడానికి ఆ పాటి సమయం పట్టదుటండీ. మీరూ, మీ ఆత్రమూనూ అని ఆ సదరు సీరియల్ దారులు ప్రేక్షకులకి కితకితలు పెట్టి ఊరుకో పెట్టేస్తారు.
భారీ సీరియల్సూ, అతి భారీ తారాగణమూనా....మజాకానా...
సాధారణంగా ఇలాంటి సీరియళ్ళలో అసలు బలిపశువుని బలి కానీయకుండా మరో బలిపశువు తప్పకుండా అడ్డుకుంటుంది. (అచ్చం మన నిజం సినిమాల్లోలాగే).
అది ఇంటి కుక్కో (కుక్క అండీ...వంటవాడు కాదు) లేక మింటి పిల్లో.
(ఎవరూ పెంచక పోయినా సరిగ్గా బలి కావడానికే వచ్చిన బలి దేవతలా మింటినుండి గెంతి వస్తుంది ఇది). కొండొకచో తరతరాలుగా ఆ ఇంటినే నమ్ముకుని ఉండే విశ్వాసం గల కుక్కల్లాంటి రామయ్యో లేక సీతమ్మో.

ఇంతకీ మన బలిపశువుని రక్షించడానికి వచ్చిన మరొక బలిపశువు ఏది??
లేక ఎవరు??
ఇంటి కుక్కా ….
మింటి పిల్లా…….
రామయ్యా....
సీతమ్మా....
క్రూరమృగాల్లాంటి లేడీ కిల్లర్స్ నుండి లేడి పిల్లలాంటి లేడీ ఎలా తప్పించుకుంది?ఇలా ఎన్నిసార్లు తప్పించుకుంది? తప్పించుకొని ఆ కిల్లర్స్ కి ఎలా బుద్ధి చెప్పింది?!
చూసారా .... కథ వింటుంటేనే క్లైమాక్స్ తెలుసుకోవాలని ఎంత ఆసక్తి కలుగుతోందో మీలో.
మరి ఇక చూస్తే... ఇంకేమైపోతారో.
ఏమైపోతారూ? సీ(రియల్)రియస్ ప్రేక్షకులైపోతారు
కానీ... ఈ విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఒకటో రెండో ....
అమ్మా... ఆశ !! వారాలో నెలలో అనుకుంటున్నారేమో.
సంవత్సరాలండీ బాబూ.
అక్షరాలా... సం....వత్సరాలు... నిరీక్షించవలసి ఉంటుంది- సహనంతో.
సహనం స్త్రీకి ఆభరణం అన్నారు కదండీ. ఈ ఆభరణాన్నే నమ్మి మన సీరియల్ స్పాన్సరర్లు, డైరెక్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఇంకా సహన వంతులైతే పైన అక్షరాల్లో చెప్పబడిన ఒకటో, రెండోను అంకెల్లో పక్క పక్కనే రాసి చూసి 12 సంవత్సరాలుగా సాగదీయవచ్చు.
ఆ తర్వాత 12 సంవత్సరాల నిడివి గల సుదీర్ఘ సీరియల్ చూసిన ఉత్తమ ప్రేక్షకురాలిగా సహనశ్రీ కిరీటం కూడా పొందవచ్చు.
విష్యూ గుడ్ లక్.
శుభం భూయాత్.
హెచ్చరిక/ సవాల్.
సోదరీ!!
చదువరీ!!
నీవు పరిపూర్ణ స్త్రీ వియా? ఒక్క ఎపిసోడూ మిస్సవకుండా టీవీ సీరియల్ చూసే సహనం నీలో ఉన్నదా? ఒకవేళ ఉండిననూ కూడా సీరియల్ చూడని యడల….విక్రమార్కురాలి వలె నీ శిరస్సు  వెయ్యి వ్రక్కలగును గాక!!
(ఒక వేళ చూసినా అవుతుందనుకోండి. అది వేరే సంగతి మాత్రం కాదు. అదే అసలు సంగతి).
Related Posts with Thumbnails