Saturday, April 30, 2011

కాకమ్మ కథలు

చిన్ననాటి ముచ్చట్లు తలుచుకున్నప్పుడల్లా పిలవని నేస్తాల్లా ఎగురుకుంటూ వచ్చి చెరో భుజం మీద వాలిపోయి ఆనాటి కబుర్లు వినిపిస్తాయి కాకమ్మా, పిచికమ్మా.
 
అంతరాంతరాంతరాంతరాళం లో అవి నాకు అంత మంచి మిత్రురాళ్ళన్నమాట. కాకమ్మా, పిచుకమ్మా రెండూ జతే అయినా రెండూ సమానమే అయినా  పిచుకమ్మే నాకు కొంచెం ఎక్కువ సమానం . పిచికమ్మది కుడి భుజమైతే, కాకమ్మది ఎడం భుజం అన్నమాట.

పిచుకమ్మంటె ఏదో తెలియని మృదుభావం. ఓ పిల్లతెమ్మెర మృదువుగా మేను నిమిరినప్పటి పరవశం. దాని  కిచకిచల్లోంచి పుట్టిన మృదు మంజీరనాదం చెవుల్లో అమృతం పోస్తున్నట్టుగా ఇప్పటికీ వినిపిస్తూ తీయటి అనుభవం కలిగిస్తూ ....మైమరపిస్తుంది.

ప్చ్...ఇంత అనుబంధం పెంచుకున్నానా...కనీసం అది నన్ను విడిచిపెట్టే వేళ సెలవని అడగనైనా అడుగలేదని ఎంతగానో నిందించాలనిపిస్తుంది. కానీ నా బుజ్జి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా... ఛ ఛ.
అని తగ్గిపోతాను. జనారణ్యంలో బతకలేక అజ్ఞత్రాతారణ్యవాసం చేస్తున్న మిత్రురాలి క్షేమం కోసం రెండు కన్నీటి బిందువులు నిశ్శబ్దంగానే రాలుస్తాను.

కాకిగోల

కావ్...కావ్....కావ్...
అదుగో చూసావా...కాకమ్మ కథలు చెప్తానంటూ మొదలు పెట్టి మళ్ళీ పిచికను తలచుకుంటూ పరవశిస్తావేం..దానిమీద రాసిన కథలూ, కవితలూ చాల్లేదా.. ...ఎంతైనా మీ మనుషులందరికీ పిచికంటేనే ఇష్టంలే. హు నల్లగా ఉన్న బొత్తిగా  నల్లపూసనైపోకుండా ఇంకా మీ కళ్ళ బడుతున్నాననే కదూ ... ఈ చులకన. మళ్ళీ నేను కూడా మీ జనారణ్యం నుండి దూరంగా పారిపోతే గానీ నా ఊసు మీకు పట్టదు....అప్పుడు కానీ నా ఉసురు మీకు కొట్టదు. దగ్గర్లోనే ఉందిలే ఆ రోజు. ఇక్కడ నేనూ మీ లోకులు పలుగాకులతో బతకలేక ఛస్తున్నాను.

ఏదో ఒకనాడు ఇక్కడినుండి ఎగిరిపోతే గాని నా విలువ తెలీదు. అప్పుడు పెడుదురుగాని పిచికమ్మకి పెట్టినట్టే నాకూ ఓ దినం.
అప్పుడు చెబ్దురు గాని నా మీద కథలు...కవితలు...హు.

ఓదార్పు మాట...

అయ్యో కాకమ్మా...
అలా ఎగిరిపోకమ్మా...
అంత అలకేలనమ్మా...
నీమీదే నమ్మా ఈ కథలూ వినవమ్మా.
నీది కాకిగోల ఎంతమాత్రమూ కాదమ్మా
నీ కాకిలీల వినిపిస్తానాగమ్మా..


మనలో మాట
పిచికమ్మలాగే కాకమ్మకి కూడా కోపమొచ్చి దూరంగా ఎగిరిపోతుందన్న భయంతో నాలుగు ఓదార్పు మాటలు చెప్పాను గానీ.  నిజం చెప్పొద్దూ. నాకు కాకమ్మంటే ఇష్టమే కాని, అది భయంతో కూడిన ఇష్టం. కాకి గురించి చిన్నప్పటినుండి విన్న గాథలూ, కన్న కథలూ ఇలాంటి భయాన్ని కలిగించాయి. చిన్నప్పుడు అమ్మావాళ్ళు చెప్పిన కాకీ- పిచికా కథలన్నింటిలోనూ కాకే విలన్. అందుకే అదంటే కాస్త భయంతో కూడిన ఇష్టం. ఇష్టంతో కూడిన భయం.

కాకి రూపు, కాకి అరుపు కాస్త కఠోరంగానే ఉన్నా అది ఇంటిమీద వాలి అరిస్తే మాత్రం చెప్పలేనంత ఇష్టం. ఆ రోజెవరో చుట్టాలొస్తారని...ఎంచక్కా బడి ఎగ్గొట్టచ్చని. రాబోయే చుట్టాలు కాకి ద్వారా టెలిగ్రాం కొట్టినట్టనిపించేదన్నమాట.

ఏకాకి...అదేనండీ ... ఒంటరి కాకి అరిస్తే ఫరవాలేదట. కానీ మేడమీద కాకుల గుంపు చేరి అరిస్తే అరిష్టవట. శకున శాస్త్రం తెలిసిన కొఱవి గోపరాజు  'సింహాసన ద్వాంత్రింశతిక' లో చెప్పాడు  లెండి. అలా చేరనివ్వకుండా, అరవనివ్వకుండా జాగ్రత్త పడండేం.

ఇప్పటి కరువు కాలంలో ఒంటరికాకి అరిచినా అరిష్టమే సుమా.. మన పొట్టలు పోసుకోవడమే కష్టంగా ఉంది. ఇక వచ్చిన చుట్టాలకేం పోస్తాం అంటారేమో కొందరు. 'ఎంగిలి చేస్తో కాకిని తోలని'  అలాంటి పిసినారుల గురించి మనకెందుకు లెద్దురూ... ఏది ఏమైనా  'కాకతాళీయంగా '  నైనా భవిష్యత్తు చెప్పి హెచ్చరించే కాకి ని మెచ్చి 'కాకా' పట్టవలసిందే కదా! ఏమంటారు?

మా కాకిలీల

వేసవి సెలవల్లో శ్రీకాకుళం వెళ్ళింది మొదలు మా కాకి గోల (లీల) మొదలయ్యేది. పిల్లలం, మేమందరం చేరి అరిచే అరుపులకు తోడుగా..
అసలు చిన్నప్పుడు మాకో నమ్మకం కూడా ఉండేది. శ్రీకాకుళంలో కాకులెక్కువ కాబట్టే ఆ ఊరికి ఆ పేరొచ్చిందని. అంటే మరి చూసుకోండి .అన్ని కాకులుండేవన్నమాట.
అసలే పేద్ద పెరడు. ఆ పెరటి నిండా చెట్లు. చెట్లనిండా గూళ్ళు.. గూళ్ళ నిండా కాకులు...వాటి నోళ్ళనిండా కేకలు...
మేం పెరటి లోకి రావడం ఆలస్యం. కావ్...కావ్ మంటూ మా చూట్టూ చేరిపోయేవి. " అబ్బా. మేవంటే ఎంతిష్టమో. ఏడాది దాటినా మమ్మల్ని మరచి పోలేదన్నమాట"  అని మురిసిపోతూ ప్రేమగా ' కాకీ...దా...దా...' అని పిలిచే లోపలో ఓ కాకి ఒక్క ఎగురు ఎగిరి మా చేతుల్లో ఉన్న పండో , ఫలమో లటుక్కున పట్టుకు పోయేది. 

మేం కోపం తోనూ, మా వస్తువు ఎత్తుకుపోతోందన్న గాభరా తోనూ..."ఒసే ఏయ్...ఇటివ్వూ...నాదీ..." అంటూ దాని మీద ఇంతెత్తు ఎగురుతూ వెంటబడేవాళ్ళం. అనుకోకుండానే దుఃఖంతో మా గొంతు జీరబోయి దాని గొంతులా అయిపోయేదనుకుంటా. అది విని ఒళ్ళు మండిపోయేదేమో దానికి ...' నన్ను ఇమిటేట్ చేసేంత గొప్పవాళ్ళా మీరు' అన్న కోపంతో రివ్వున వచ్చి టంగున నెత్తిమీద రెండు మొత్తులు మొత్తి ఎంచక్కా గూడెక్కేసేది, 'దమ్ముంటే నన్ను పట్టుకో నా మాల కాకీ'  అని సవాలు చూపు విసురుతూ.
కావు కావు (రక్షించు ) మంటూ మేం అమ్మమ్మ దగ్గర చేరి జరిగింది చెప్పే వాళ్ళం.

ముందే చెప్పాను కదర్రా. జాగర్తనీ. చచ్చి పోతున్నామనుకో వీటితో వేగలేక . పెరట్లో ఒక్క వస్తువూ ఉండనవ్వవు. మొన్నటికి మొన్న ఓ కాకి ఏం చేసిందో తెలుసునా. మీ తాతగారు స్నానం చేస్తుంటే సబ్బు ముక్క ఎత్తుకు పోయింది. నిన్నటికి నిన్న తోమడానికని పనిమనిషికి వెండిగిన్నె వేస్తే అది పట్టుకు పారిపోయింది. మరి దొరుకుతుందనుకోలేదు స్మీ. గండి కోట వారి పెరట్లో దొరికిందట . వాళ్ళ పనిమనిషి మంచిది కాబట్టి తెచ్చి ఇచ్చింది. ఏం చేస్తాం కనిపించిన వస్తువునల్లా ఎత్తుకుపోవడం వాటి అలవాటు. అందుకే కాకిబుద్ధి అన్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటూ ఓదార్చి చేగోడీలో చక్కిలమో చేతుల్లో పెట్టేది అమ్మమ్మ.
ఇంతకీ సబ్బు ముక్కలతోనూ, వెండి గిన్నెలనూ ఎత్తుకుపోయి కాకి ఏం చేసేదంటారూ. మా అమ్మమ్మని ఏడిపించడానికి కాకపోతేనూ. ఇప్పటికీ తేలని మిలియన్ డాలర్ల ప్రశ్న మాకు.
లేకపోతే ...ఓ పని చేసేదేమో.  ఎంచక్కా నాగావళి ఒడ్డున ఒయ్యారంగా వాలి సుబ్బరంగా లక్స్ సబ్బు కరిగేంతవరకూ రుద్దుకుని......... వెండి గిన్నెలో వెండి గిన్నెడు నీళ్ళు పోసుకుని....ఇంచక్కా రెక్కలార్చుకుని...అవి ఆరాక అవసరం తీరాక 'మీ ఉసురు నాకెందుకని' వెండిగిన్నెని మాత్రం విసురుగా ఎవరి పెరట్లోనో విసిరేసేదేమో.

పాపం. కాకులు ఇలా ఎంత కాల్చుకు తిన్నా అమ్మమ్మకి వాటిమీద అస్సలు కోపం ఉండేది కాదు. మేం తినగా మిగిలిన అన్నమంతా తీసుకెళ్ళి పెరట్లో  ఓమూల గిన్నెలో వేసేది. అవి వచ్చి అన్నం తింటుంటే గాని తృప్తి పడేది కాదు. అమ్మమ్మ అప్పుడు నేర్పిన పాఠం ఇప్పటికీ గుర్తుండి పోయింది. అందుకేనేమో. ఏ కాస్త అన్నం మిగిలినా డస్ట్ బిన్ లో వేయకుండా పెరటి గోడమీద పెట్టి 'కాకమ్మా...రామ్మా!  తినిపోవమ్మా!'  అని మనసులోనే అనుకుంటాం. మా ఇంట్లో నూ చుట్టు పక్కల ఇళ్ళలోనూ ఇంకా పచ్చగా చెట్లూ, వాటిమీద చల్లగా నల్లగా కాకులు ఉండడం వల్ల ఆలా పెట్టిన అన్నం వృథా కావడం లేదు లెండి.

మా అమ్మమ్మా వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ మేం ఎంత మెలకువగా వ్యవహరించినా ఏదో ఓ మూలనుండి  ఏదో ఓ కాకి హఠాత్తుగా ఎగిరొచ్చి మాలో ఎవరో ఒకరికి శృంగభంగం చేసేది. అదే జడలువేసుకునే వాళ్ళంకదా...ఆ జుట్టు పీకి పోయేది.
"భూమికి జానెడు లేని కాకి చేతుల్లో పరాభవం పొందటమా...క్షణంలో తుర్రుమనిపించలేమూ" అని కసిగా  అనుకునే వాళ్ళమే కానీ దాన్ని గట్టిగా తరిమి కొట్టాలన్నా భయపడి చచ్చే వాళ్ళం. ఎందుకంటే మా వాళ్ళు కాకి పగ అంటూ కొన్ని కథలు వినిపిస్తూ ఉండేవారు.
 ఫలానా ఆయన మీద ఓ కాకి పగ పట్టిందట అంటూ... "పాము లాగే కాకీ కూడా పగపడుతుందట. అది పగ పట్టిందంటేనా...ఇంట్లోంచి బయటకొస్తే చాలు తలమీద తన్నీ, ముక్కుతో పొడిచీ చంపుకు తింటుంది..జాగర్తగా ఉండండి" అనేవారు.
మా బాబాయి ఒకసారి బూరుగుచెట్టుమీద కాకి గూడు పెట్టుకోవడం చూసి కిందనుంచి రెండు రాళ్ళు విసిరి కాకిని కొట్టారుట...చిలిపితనానికి.. అంతే..ఆయనని  ఆ బూరుగు చెట్టుమీద ఇల్లు కట్టుకున్న కాకి వీధి మొహం చూడనిచ్చింది కాదు...ఇంట్లోంచి బయటకి రావడం భయం, ఎక్కడినుంచి వచ్చేదో మరి ఎగిగి వచ్చి మొహం మీద, తలమీద కాళ్ళతో తన్ని గాయపరిచేది. కాకి భయానికి ఆయన పది రోజులు ఇంట్లోనే ఉండి పోయారట ఆఫీసుకు వెళ్ళకుండా. తర్వాత చాలాకాలం ఎండకీ , కాదు వానకీ కాదు కాకికి భయపడి  గొడుగేసుకొని ముఖం మూసుకొని ఆఫీసుకి రహస్యంగా వెళ్ళేవారుట...మొత్తం మీద కాకిని ఏమార్చగలిగారు బాబాయి.

అందుకే కాస్త భయంగా, దూరం దూరంగానే మసలే వాళ్ళం కాకులకి.
అసలే ముద్దుగా అది మా నెత్త్తిన మొత్తిన మొత్తులు తిన్న వాళ్ళమేమో...ఆ పాటి భయమూ, గౌరవమూ ఉండకుండా ఎక్కడికి పోతాయీ...

కాకులంటే భయం ఉన్నా ఓ పక్క చెప్పలేని సరదా కూడా ఉండేది. ఒక్కొక్క పుల్లా చేర్చి గూడు కట్టడం చూస్తే చెప్పలేని పులకింతా, ఒకింత ముచ్చటా కలిగేది. అమ్మమ్మ పెట్టిన అన్నం ముద్దను ముక్కుతో పొడుచుకుని తీసుకువెళ్ళి గూట్లో ఇంకా కళ్ళు తెరవక పోయినా నోళ్ళు మాత్రం తెరచుకున్న పిల్ల కాకులకి ముద్దుగా పెట్టే దృశ్యం...గుండె కాన్వాసు లో శాశ్వతంగా లిఖించబడిన  అద్భుత వర్ణ చిత్రం.

కాకిగూడు తలచుకుంటే చాలు ...సింగరాజు లింగరాజు (వరవిక్రయం) గుర్తొస్తాడు. వంటవాడు వంటకోసం కట్టెలిప్పించమంటే 'కాకిగూడు కొట్టి పుల్లలు తీసుకురా '  అంటాడు. 'ఖరనామ సంవత్సరంలో మా ఇంటి వంట అంతా కాకి గూళ్ళతోనే కానిచ్చాం' అంటాడు పరమ పిసినారి సింగరాజు లింగరాజు. 
కాకుల్ని కొట్టే వాళ్ళే కాదు కాకి గూళ్ళని 'కొట్టేసే' వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. పాపం...కాకులు. పగ పడతాయంటే పట్టవూ మరి !


అన్నట్టు కాకిగూడంటే మరో విషయం కూడా గుర్తొస్తోందండోయ్.

మా చిన్నప్పుడు అంటే సెవెన్టీస్ లో రింగులు రింగులుగా, మెడ మీదుగా, భుజాల వరకూ జాలువారుతూ, ఆరేడంగుళాలకి తక్కువ కాకుండా ఎత్తుగా, ఒత్తుగా హిప్పీ క్రాఫ్ పెంచుకోవడం అబ్బాయిల ఫేషన్ గా ఉండేది. మా మూడో మామయ్య క్రాఫ్ అచ్చం అలాగే ఉండేది.

 అది చూసి మా పిన్ని కాకిగూడు అంటూ వెక్కిరించేది. అప్పట్లో మాకో కార్టూను(బాపు గీసినదా?) కూడా చూపించింది. సదరు క్రాఫ్ ఉన్న ఓఅబ్బాయి నెత్తిమీద పక్షి గూడు కట్టుకొని కాపురం చేస్తున్నట్టుగా.
అప్పుడు మాకనిపించేది...నిజంగానే మా మామయ్య క్రాఫ్ గూట్లో ఓ రెండో, మూడో కాకి పిల్లలు దాగున్నాయేమో, ఎగరడం వచ్చిన తర్వాత చటుక్కున ఎగిరొస్తాయేమోనని.

అంత దట్టమైన అందమైన క్రాఫు గల మామయ్యకి ఇప్పుడు ఆ క్రాఫే కాదు అసలు క్రాఫే లేదు తెలుసా? పాపం దాన్ని ' కాకెత్తుకుపోయిం' దోచ్. కొంచెం జాలి తలచి గత వైభవ చిహ్నంగా నాలుగు పాయలు మాత్రం మిగలనిచ్చింది లెండి.
కాకమ్మ గురించి చెప్తుంటే ఎన్నో కబుర్లు అలా మనసులోతుల్లోనుండి తన్నుకొచ్చేస్తున్నాయ్, (తెలివైన కాకి కుండలో కొంచెమే ఉన్న నీళ్ళలో రాళ్ళు వేస్తే నీళ్ళు తన్ను కొచ్చినట్టుగా). 

మా కాకమ్మ అలక తీరేటట్టుగా కొన్ని కథలు చెప్పాను. కానీ ఎన్ని చెప్పినా ఇంకా ఎన్నో చెప్పాలనుంది. ఇంకా వీలైనప్పుడు మరిన్ని చెప్తాను. 
విందుగా....పసందుగా...
మరి మీరూ విందురుగా...

పి.ఎస్: 'నీకేం...ఎన్నైనా చెప్తావ్. కాకమ్మ కథలు. నీ కాకి గోల వినలేక మేం చావాలి' అని మాత్రం అనకండేం బ్లాగర్లూ.
నా కాకమ్మ కథలు చాలా బావున్నాయని, మీరు బాకా పట్టుకొని ' కాకా' సురులై  పొగడకపోయినా ఫరవాలేదు. కానీ, 
తనని పట్టించుకోవడం లేదని కాకమ్మ మనమీద కోపం తెచ్చుకొని, జనారణ్యం లోనుండి నిర్జనారణ్యంలోకి పారి పోకముందే, దాని రోదన, అరణ్య రోదన కాకముందే, దాన్ని కాకెత్తుకుపోకముందే మీకు తోచిన కాకమ్మ కథలు చెప్తానంటే వినడానికి మాత్రం నేను రెడీ. మరిక మీరూ మొదలెట్టండీ.......కాకమ్మ కథలు.

Sunday, April 10, 2011

ఉందిలే మంచి కాలం ........అనబడే హీరోయిన్ల ఓదార్పు యా(మా)త్ర !!

ఉందిలే మంచి కాలం ........అనబడే
హీరోయిన్ల ఓదార్పు యా(మా)త్ర !!
తొండ ముదిరితే ఊసరవెల్లవుతుందట                                                                     
మరి సినిమా హీరోయిన్ ముదిరితే........??

వయసు పెరిగి,
ఒళ్ళు పెరిగి
ముఖంలో గ్లామరూ,
 వెండితెరలో వేషాలూ మాత్రం తరిగిన
 సినిమా హీరోయిన్ లూ......!!
మీరెంత మాత్రమూ చింతించవలదు.
బుల్లి తెర  మీకు తెర నిండుగా బోలెడు అవకాశాలు కల్పిస్తోంది.
నిజానికి వెండి తెరలో నాయిక వేషాలు వేయడం కంటే బుల్లి తెరకు అత్తగారి వేషం వేయడంలో బోలెడు అదనపు సౌకర్యాలు న్నాయి.
అవేమిటో తెలిస్తే బుల్లితెరకే మీ ఓటు వేస్తారు.
కావాలంటే ఆల్రెడీ బుల్లితెరకి షిఫ్టయిపోయిన ఎక్స్ కథానాయికలనడిగి చూడండి మీకే తెలుస్తుంది ఆ సౌలభ్యాలేమిటో!
పోనీలెండి. .......వాళ్ళు సరిగ్గా చెప్పరేమో.
ప్రొఫెషనల్ రైవల్రీ ఒకటేడుస్తుందిగా !!
నేనే చెప్తాన్లెండి. ఎంతైనా కొంతకాలంపాటు మీ అభినయం తోను, అందంతోను మమ్మల్ని అలరించినవారు కదా. మీ పై మాకున్న అభిమానం ఎక్కడికి పోతుందీ  ?
 ఇదిగో చెప్పేస్తున్నా......
 ఒకటీ.................
హీరోయినైతే ఏడాదికి మూడో నాలుగో మహా అయితే ప్ఫదో, పన్నెండో. ఖర్మకాలి వాటిలో ఒకటో రెండో ఫ్లాపయ్యాయనుకోండి అంతే సంగతులు. అఖిలాంధ్ర ప్రేక్షక హృదయ చోరిణి బిరుదు కాస్తా అఖిలాంధ్ర  
ఐరన్ లెగ్గిణి  గా  మీ పేరు సినీ చరిత్రలో తిరగరాయబడుతుంది.
అదే సీరియల్ అత్తగారనుకోండి. ప్రతిరోజూ షూటింగ్ పండగే. ఇక్కడ హిట్టూ ఫ్లాపుల భాగోతాలంతగా ఉండవు. ఒకవేళ ఏమూలో ఉన్నా కూడా ఆ పాప పంకిలం క్యారక్టరార్టిస్టుల పాద పద్మాలకు అంటదు. కాబట్టి ఇల సాటిలేని అత్తగా వెలిగిపోవచ్చు. అందనంత ఎత్తుకు ఎదిగి పోవచ్చు. (అడ్డంగా ఎదిగినా అభ్యంతరం ఉండదు) . హీరోయిన్లుగా ప్రేక్షక హృదయ  సామ్రాజ్యాలను ఒకప్పుడు కొల్లగొట్టిన తారలకు ప్రత్యేక డిమాండ్ కూడా కద్దు.

ఇంకోటీ....
హీరోయిన్లుగా ఒక్క కేజీ బరువు పెరిగినా క్రేజీగా గోల పెట్టేసే అభిమానులు - టీవీ అత్తగా తెరనిండుగా పెరిగినా  ఏవీఁ అనుకోరు.  తీగె పాకం ల్లాటి  సన్నని శరీరాలతో ఊరించిన మీరే -  ఇప్పుడు పాకం పీల్చిన గులాబ్ జామూన్లలా ఊరిపోయినా ప్రేక్షకులు కళ్ళనిండుగా చూస్తూ ఊరుకుంటారు. ఆ పాటి బరువు లేకపోతే పాత్రకు న్యాయం జరగదని సరిపెట్టేసుకుంటారు.
 హీరోయిన్లుగా అరకేజీ బరువు పెరిగితే పాత్ర దక్కక పోయే ప్రమాదమున్నట్టే సీరియల్ అత్తగారు గా అరకేజీలో అరవంతు దగ్గినా పాత్ర దక్కకపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి హీరోయిన్లూ...తస్మాత్ జాగ్రత్త !
ఒకప్పుడు కడుపు మాడ్చుకొని, కష్టానికి ఓర్చుకొని వీరగా చేసిన డైటింగులన్నీ పక్కన పెట్టేయండి.
తిండి కలిగితె పాత్ర కలదోయ్ అన్న మాటని గుర్తుపెట్టుకొని వెజ్జూ, నానువెజ్జూ కలిపి మరీ లాగించెయ్యండి.
మరోటీ....
అత్తగారి పాత్రలు ధరించడంలో మరికొన్ని ఆకర్షణలతో పాటు నటనా సౌలభ్యం కూడా ఉందండోయ్.
1.        1.  హీరోయిన్లుగా కోడళ్ళ పాత్రలు ధరించి అత్తల చేతుల్లో పడిన   
           ఆరళ్ళన్నింటికీ ఎంచక్కా బదులు తీర్చేసుకోవచ్చు.
       2.   హీరోయిన్లుగా ఉన్నప్పుడు నాగకన్య పాత్ర (నగీనా లో శ్రీదేవి లా)  
           మిమ్మల్ని వరించలేదని దిగులుపడుతున్నారా ? ఎంతమాత్రమూ 
           విచారించవలదు. అత్తగారి వేషంలో ఆ దురద తీర్చేసుకోవచ్చు. 
           పాము యాక్షన్ బహు సులభంట. క్లోజప్లో విషపు చూపుని ఓసారి 
           విసిరితే చాలు. మిగతాదంతా కెమేరా మాన్ చూసుకుంటాడు.
        మీరు విషపునాగు అని సూచించడానికి కళ్ళకి  నీలపు కాంటాక్టు   
        లెన్స్ ఎలాగో వాడబడుతుందనుకోండి. ఇంకా స్పెషల్ ఎఫెక్టు 
        కావాలంటే ఆఫ్రికా అడవుల్లో పడగెత్తిన పామునోసారి, మీ 
        మోమునోసారి అలా పదిసార్లు చూపిస్తాడు. కాబట్టి ఆట్టే     
        కష్టపడక్కరేకుండా  మీ కొచ్చిన దాంట్లో ఆరోవంతు యాక్షన్ 
        చేసినా     చాలన్నమాట. 
        మరి పామైతే బుస్సు బుస్సున బుసలు కొట్టొద్దూ. అది మాత్రం 
        సులభమా అనడుగుతారేమో ?
        అబ్బే…… చాలా ఈజీ అండీ. ఒక్కసారి గుండెలనిండా గాఠిగా ఊపిరి 
        పీల్చుకుని అంతే గాఠిగా ఊపిరి విడిస్తే చాలు.
        నిజానికి దీనికోసం కూడా  ఆట్టే కష్టపడక్కర్లేదుట. భారీ మేకప్పు, 
        భారీ    నగలూ, భారీ పట్టుచీరలతో అలంకరించబడిన అతి భారీ 
        కాయంతో  సెల్లూపుకుంటూ పచార్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు.
        కాబట్టి ఆయాసం,  దాంతో పాటు  దాని అప్పగారైన ఆవేశం రెండూ 
       వాటంతటవే జమిలిగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. దీనికి తోడు 
       ఒంట్లో బీపీ కూడా ఉంటే మరీ మంచిది. సన్నివేశం బాగా రక్తి 
       కడుతుంది. జనాలు ఒకటికి రెండు వీరతాళ్ళు వేస్తారు.
3.     హీరోయిన్లుగా పాత్రల కోసం ఎంతో శ్రమించి నవరసాలూ ఒలకబోసి  
       ఉండి ఉంటారు. కానీ ఇప్పుడు వాటిలో  ,
       కరుణ, శాంత, శృంగార రసాలకి  బోల్డంత రెస్టిచ్చి బీభత్స, రౌద్ర, వీర,   
       భయానక రసాలను మాత్రం ధారగా ఒలక బోస్తే చాలు.  ఇందులో 
       ఇంకో అదనపు ఆకర్షణ కూడా ఉందండోయ్. ఒక వేళ ఉత్తమ కథా 
       నాయికగా  నందిఅవార్డు అందుకొని  ఉండకపోయినా ఉత్తమ 
       అత్తగారిగా   టీవీ నంది అవార్డు ఠీవీగా అందుకోవచ్చు.
4.      హీరోయిన్లుగా ఉన్నప్పుడు ఆరుగజాల పట్టుచీరలు కట్టుకొని 
        ఒంటినిండా నగలు పెట్టుకొని  అలంకరించుకుంటే  బావుండునన్న 
        కోరిక కలిగినా దర్శక, నిర్మాత, ప్రేక్షక వర్గాల కోసం త్యాగం చేసి 
        అరగజం  వస్త్రం తోనే సరిపెట్టుకొని ఉండవచ్చును. కానీ సీరియల్ 
        అత్తగారైతే పగలు పది గంటలైనా, రాత్రి  రెండు గంటలయినా ఏ 
        షాటైనా, ఏ ఎపిసోడైనా ఆరు గజాల పట్టు చీరకీ, అరకేజీ   
        ఆభరణాలకీ   తక్కువ కాకుండా ధరించి ఎంచక్కా మీ చిరకాల 
        వాంఛని తీర్చుకోవచ్చు.

        సినీ హీరోయిన్ కీ  టీవీ అత్తగారికీ తేడా
        ఒక్కమాటలో చెప్పాలంటే........
        హీరోయిన్లుగా -
        వలువలు తక్కువ 
        విలువలు ఎక్కువ 
        అత్తగారిగా-
        వలువలు ఎక్కువ      
        విలువలు తక్కువ ....


మరి హీరోయిన్ పాత్రకా....
అత్తగారి పాత్రకా
దేనికి మీరు ఓటు వేసేరూ....
రెండిట్లో ఏది మీకు ప్యారూ.....
(డెఫినెట్ గా అత్తగారి పాత్రకే కదూ......)
సో........................
     వయసులు మళ్ళిన
     ఒళ్ళులు పెరిగిన
     తారల్లారా రారండి
     అత్తగార్లుగ  మారండి.....

Related Posts with Thumbnails