నింగీ-నేలా-నేనూ అను (ఓఎన్నారై ఆత్మకథ)
డా. ప్రయాగ మురళీకృష్ణ
డా. ప్రయాగ మురళీకృష్ణ
జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని ఉన్నత పీఠాన్ని అధిరోహించి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొంద గలిగిన వ్యక్తుల జీవితాలు తోటి వారికే కాదు తరతరాలకూ ఆదర్శనీయం.అటువంటి గొప్ప వ్యక్తులు తమ జీవిత చరిత్ర లను గ్రంథస్థం చేయడంవల్ల భావితరాల వారికి స్ఫూర్తి ప్రదాతలు కాగలుగుతారు. ఓటమిని కూడా గెలుపుగా మార్చుకోగల ధీరత్వాన్నీ, చాకచక్యాన్నీ పదిమందికీ నేర్పించిన వారౌతారు. అందుకే గాంధీ నెహ్రూ వంటి మహనీయుల చరిత్రలు నేటికీ నిత్య నూతనంగా, ఆదర్శనీయంగా విరాజిల్లుతున్నాయి. మహామహులే కాదు జీవితంలో ఒక స్థాయిని అందుకో గలిగిన ప్రతి ఒక్కరి జీవితం లోనూ తెలుసుకోదగ్గ విశేషాలు చాలానే ఉంటాయి. అయితే హంగుకోసం కొత్తరంగులు పులమకుండా జరిగింది జరిగినట్టుగా చిత్రించబడినవీ, సమకాలీన సమాజచిత్రపటాన్ని అవిష్కరించగలిగినవీ అయిన జీవిత చరిత్రలకు మాత్రమే ప్రత్యేకమైన శాశ్వతమైన స్థానం ఉంటుంది. అటువంటి రచనలు మాత్రమే నిత్యనూతనంగా ప్రకాశిస్తూ భావితరాలకు ఆదర్శనీయంగానూ, పఠనీయ గ్రంథాలుగానూ నిలువగలుగుతాయి.
విదేశాల్లో తెలుగు జెండాను ఎగురవేసి వైద్యరంగ వికాసానికే కాక తెలుగు సంస్కృతి వికాసానికి కూడా దోహద పడిన సుప్రసిధ్ధవైద్యులు డా. ప్రయాగ మురళీ మోహనకృష్ణగారు తన జీవిత చరిత్రను గ్రంథస్థం చేయడం బహుదా అభినందనీయం.
ప్రయాగ వారి స్వీయ చరిత్ర చక్కటి కథనాత్మకశైలిలో సాగింది. దీనిని చదువుతున్నప్పుడు పాఠకులకు ఎక్కడా స్వీయచరిత్ర చదువుతున్నట్టు అనిపించదు. ఉత్తమ పురుషలో సాగిన ఒక చక్కటి నవల చదువుతున్న అనుభూతి కలుగుతుంది. రచనలో ప్రయాగవారు ఉద్దేశించి ప్రత్యేక శిల్పాన్ని పాటించకపోయినప్పటికీ దానంతటదే వచ్చి ఒదిగిపోయింది. అందువల్లే ఇందులో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు.
శ్రీకాకుళం జిల్లా మధ్యతరగతికి చెందిన బ్రాహ్మణ కుటుంబాల్లోని జీవద్భాషని రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబీకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలను, అనుబంధాలను మనోహరంగా చిత్రించారు. మానవీయ విలువలు జారిపోతూ మానవ సంబంధాలు మాసిపోతున్న నేటి
సమాజానికి ఆ మాధుర్యాన్ని రుచి చూపించారు. తల్లితోనూ తల్లి సమానురాలైన వదినతోనూ ఉన్న అనుబంధాన్నిఆయన వర్ణిస్తున్నప్పుడు ఎవరిగుండె అయినా ఆర్ద్ర మవక మానదు. మానవ సంబంధాలలో ఉండే గొప్పతనం అది తామూ తమ కుటుంబీకులూ నేడు ఉన్నత స్థానాల్లో ఉండడానికి తమ తాత ముత్తాతలు చేసిన పుణ్యకార్యాలే కారణమని వారి ఆశీర్వాదబలమే తమని ఈ స్థితికి చేర్చాయని ప్రయాగవారు పేర్కొనడం తమ పూర్వీకులపై వారికి గల గౌరవ భావానికీ తన నిగర్వతకూ వినమ్రతకూ నిదర్శనం. మౌనంగానే ఎదగడం ఎంత ఎదిగినా ఒదగడం ప్రయాగవారి వినయశీలతకు తార్కాణం.
స్వస్థలమైన గొటివాడ పల్లె వాతావరణాన్నీ, ఆనాటి కట్టుబాట్లనూ, జీవితాలనూ, అనుబంధాలనూ ప్రయాగవారు చాలా అందంగా సుమనోహరంగా వివరించారు. బృందావనంలో మురళీమోహనుడు వేణుగానాన్ని ఆలపించినంత అలవోకగా, అతిరమణీయంగా, మధురాతిమధురంగా మురళీ మోహన కృష్ణ గారి రచన సాగింది.
ఎందుకూ పనికిరాడని అందరితోనూ అనిపించుకున్న వ్యక్తి అతికష్టంమీద అత్తెసరు మార్కులతో పాసవుతున్న మనిషి పంతంపట్టి మెడిసిన్ సీటు సాధించడమే కాకుండా నిర్విఘ్నంగా చదువును పూర్తి చేయడం నిజంగా అద్భుతం. మెడిసిన్ సీటు ప్రయాగ వారి జీవనయానంలో అతి గొప్ప మలుపు. కృషితో నాస్తి దుర్భిక్షం. అనే ఆర్య వాక్యానికి చక్కటి ఉదాహరణ ఇది. ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఏదో ఒక శక్తి దాగి ఉంటుందని, దానిని వెలికి తీయగలిగినప్పుడు తప్పకుండా అద్భుతమైన ప్రగతి సాధించగలుగుతాడని ప్రయాగవారి జీవితం నిరూపిస్తుంది.
కేవలం డాక్టరు పట్టా పొందడం తోనే ప్రయాగవారి ప్రస్థానం ఆగి పోలేదు. అ క్కడి నుండే అసలు ప్రస్థానం మొదలైంది.అనస్థీసియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడమే కాకుండా ఆ రంగంలో విశేషమైన కృషి చేసారు. వారు ఆవిష్కరించిన నూతన వైద్యవిధానాలతో అంతర్జాతీయ ఖ్యాతిని పొంద గలిగారు. ట్రినిడాడ్ దేశంలో ఉన్నప్పుడు వారు చేసిన సేవకు ఫలితంగా “ మ్యాన్ ఆఫ్ ద ఇయర్” బహుమతి పొందారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగిన అరుదైన విజయం.
ప్రయాగ వారి కీర్తి దేశ దేశాలా విస్తరించినా వేళ్ళు మాత్రం మాతృభూమి లోనే నాటుకున్నాయి. అందువల్లనే వారు ఏదేశంలో ఉన్నా మాతృదేశపు మృత్తిక వాసనలు ఆయనను వీడలేదు, తెలుగు వాడితనాన్నీఆయన మరచిపోలేదు. విదేశాల్లో కూడా తెలుగు సంస్కృతి మొలకలు నాటగలిగారు. ఆయన ట్రినిడాడ్ దేశంలో నివసించేటప్పుడు సత్య సాయి భజన సమావేశాలు ఏర్పరచి అక్కడి వారిలో కలిగించిన చైతన్యం గురించి చదువుతున్నప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది.
విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాషనీ, సంస్కృతినీ మరచిపోకుండా పిల్లలను మరువనివ్వకుండా చక్కటి సంప్రదాయ వాసనలతో పెంచిన ఘనత ప్రయాగ దంపతులది. తనభార్య రాజ్యలక్ష్మి చీరకట్టుగురించి సందర్భానుసారంగా ప్రయాగ వారు పేర్కొన్న విషయాలు రాజ్య లక్ష్మి గారి సంస్కారాన్ని, సంప్రదాయ నిబద్ధతనీ నిరూపిస్తాయి. తల్లిదండ్రులు సంస్కారవంతులూ, సంప్రదాయానుసారులూ కాబట్టే పిల్లలకూ అవి అలవడ్డాయి..అందుకే హిందూదేశపు దేవతా విగ్రహాలను నిరసిస్తున్న ఉపాధ్యాయురాలికి వీరి కుమార్తె శ్రావణి చక్కటి ఉపదేశాన్ని ఇవ్వగలిగింది. చిన్న వయసులో తమ మతంపైన, సంస్కృతి పైన అంత అవగాహన, అభిమానం కలిగిఉండడం నిజంగా అభినందనీయం. “ జైలాండ్ అండ్ పోస్టెన్” అనే డేనిష్ పత్రికకు ప్రయాగ వారి కుమార్తెలు ఇచ్చిన ఇంటర్వ్యూద్వారా సంప్రదాయానికీ, కట్టుబాట్లకూ భారతీయ సంస్కృతికీ వారు ఇచ్చిన విలువ అవగతమవుతుంది.
మెడిసిన్ చదువుతుండగా ప్రయాగ వారికి కలిగిన ఆధ్యాత్మిక పరిణామం, అన్నిటినీ త్యజించి హరిద్వార్ వెళ్ళిపోవడం, అక్కడ గురూపదేశం పొందాక మామూలు స్థితికి రావడం వంటి విషయాలు వారిలోని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రయాగ వారిలో అంతర్లీనంగా జీవుని వేదన దాగి ఉన్నదనిపిస్తుంది. ఇది వారి వ్యక్తిత్వంలోనే విలక్షణంగా తోచే అంశం. బహుశా ఈ లక్షణమే వారిని ప్రత్యేక మూర్తిమత్వం గలవారిగా తీర్చిదిద్దిందేమో ? సంప్రదాయబద్ధులుగా మలచిందేమో ?
జీవితపులోతులు తరచి , మూసి ఉన్న మనసుల తలుపులు తెరచి చూసి కనుగొన్న జీవిత సత్యాలను ప్రయాగ వారు ఆవిష్కరించిన విధం శ్లాఘనీయం. ముందుతరాలకు స్ఫూర్తిదాయకం.
ఒకతరంనాటి జీవితాన్నీ, భాషనీ, సంస్కృతినీ అన్నిటినీ మించి మానవీయవిలువలనూ తెలుసుకోదలచుకున్న ప్రతి ఒక్కరూ చదివితీరవలసిన ఉత్తమ గ్రంథం ఇది.
ఒక నింగీ...
ఒక నేలా...
ఒక ప్రయాగ !
(ఈ పుస్తకానికి ముందు మాటలు శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారూ, కీ.శే. అవసరాల రామ కృష్ణారావు గారూ వ్రాసేరు, ఈ పుస్తకం నవంబరు 24వ తేదీన విశాఖపట్టణంలో ఆంధ్రా యూనివర్శిటీ ప్లాటినమ్ జూబిలీ హాలులో ఆవిష్కరింబడింది. దీనిని ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించారు)
నింగీ...నేలా...నేనూ...