తల్లి ఒడిలో ప్రేమ క్షీరాన్ని ఆస్వాదిస్తూ అర్థ నిమీలిత నేత్రాలతో పరవశించే పసి బిడ్డనయ్యాను.
నాగావళి గట్టున కోటీశ్వరాగ్రహారపు తొలి మెట్టున,
రావిచెట్టు నీడ పట్టున...
నేను వేసిన తొలి అడుగు
చిన్ననాటి జ్ఞాపకాలకు పట్టిన గొడుగు.
మట్టిలోంచి పుట్టిన మనిషి ఆ మట్టివాసనను తనలో నింపుకుని జీవిస్తూ చివరకు మట్టిలోనే లయిస్తాడు. కానీ ఆ మట్టి వాసన రాకుండా, మట్టి మరకలు కనిపించకుండా నాగరికతా గంధాన్ని పూసుకుని కృత్రిమ వేషాన్ని అభినయిస్తాడు. కనీసం ప్రయత్నిస్తాడు.
కానీ తనకు జన్మనిచ్చిన పుడమితల్లి ముని వాకిట్లో అడుగు పెట్టిన నాడు, ఆ తల్లి పాద ధూళి తన మనసుకంటిన నిముషాన ఆ మట్టి సురభిళ సౌరభం తన చుట్టూ వ్యాపించి జ్ఞాపకాల ఉప్పెనలో ముంచి వేసిన క్షణంలో తిరిగి మట్టి మనిషవుతాడు. ఇక ఎన్నడూ కనబడదనుకున్న తల్లి ఆప్యాయంగా చేతులు చాచి పిలిచిన అనుభూతికి లోనవుతాడు. ఆతల్లి ఒడిలో చేరి పరవశించే పసిబిడ్డ అవుతాడు. తిలక్ మాటల్లో చెప్పాలంటే చచ్చిపోయిన అమ్మ తిరిగి వవ్చినప్పటి ఆనందానుభూతికి లోనవుతాడు. ఆనందానికి అంతకుమించిన అవధి ఉంటుందా. అందుకే వాల్మీకి రామాయణంలో శ్రీ రాముడితో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనిపించాడు.
నన్ను చూసి నా పుడమితల్లి కూరిమి అనే రసంతో తడిసి పులకలిస్తూ వెదజల్లిన మట్టివాసన తగలగానే , ఆ తల్లి పిలుపు వినగానే నాలో ఎగసిన జ్ఞాపకాల ఉప్పెన.......స్వర్గలోకానికి వేసిన వంతెన. అది ఒక అలౌకిక దివ్యానుభూతి....మధురమైన ప్రాచీన స్మృతి. భూతకాలపు సుందర దృశ్యమాలికాగీతి.
నార్నియా సినిమాలో కబోర్డులో దూరి తలుపు వేసుకోగానే నార్నియా వింతలోకంలోకి అడుగు పెట్టినట్టుగా ..... నాగావళి ఒడ్డున అడుగు పెట్టీ పెట్టగానే వర్తమానపు వాకిలి తలుపులు మూసుకుపోయి భూతకాలపుసుందరభావాల తలపులు ముసురుకున్నాయి.
కోటీశ్వరుడి కోటిదీవెనలను భక్తకోటికి ప్రసాదిస్తూ అభయమిస్తున్నట్టుగా ఠీవిగా నిలుచున్న ఆలయ గోపురం(ధ్వజస్తంభం), యుగయుగాలుగా తన నీరు అనే అమృతాన్ని ఊరివారికి పంచుతున్నా ఎండిపోని ఏరు, వయసు పెరిగినా సడలని సౌందర్యానికి ఆటపట్టు అయిన రావిచెట్టూ, వేసవికాలంలో భానుడి ప్రతాప జ్వాలకు తాళలేక దిగులుగా నీరసించి ఓ మూలకి ఒదిగి పడుకున్నా అమ్మే అన్నం పెట్టాలంటూ మారాం చేసే పసిబిడ్డల్లా నీటికోసం మేమంతా చెలమలు తవ్వి ప్రాణాలు తోడేస్తున్నా విసుక్కోకుండా దిగులుగా నవ్వుతూనే తన ప్రేమామృత ధారలందించే త్యాగశీలి – నాగావళి.
అవతలి ఒడ్డున కొండపై వెలసిన వేంకటేశ్వరుణ్ణీ, ఇవతలి ఒడ్డున పాతాళంలో నిలిచిన ఈశ్వరుణ్ణీ కలుపుతూ హరిహరాద్వైతాన్ని చాటే జ్ఞాని లాంటి వంతెనా....
అదే ఊరు......అదే ఏరు
అదే గుడి.....అదే అమ్మ ఒడి
అది నా బాల్యం......అది నాకమూల్యం
నా స్థూల దృష్టికి అందని మార్పులు
సూక్ష్మ దృష్టికి సరికొత్త చేర్పులు
కొత్తదనాన్ని తనలో పొదవుకుంటున్న పాతదనం
పాతదనంలో ఒదిగిపోతున్న కొత్తదనం
ఈ కొత్త పాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులు చిమ్ముతుండగా భూతకాలపు భావసంచలనంలోంచి పూర్తిగా బయటకు రాలేక, వర్తమానపు ఒడిలో చేరలేక, ఆ రెండింటి సంధి వాకిట్లో ఓమూలగా ఒదిగి నిలుచున్నాను. నా చిన్ననాటి జ్ఞాపకాల చిలిపి కళ్ళతో ఈ నాటి కొత్తదనపు పోకిళ్ళను బేరీజు వేసుకున్నాను.
ఉత్సవాల సమయంలో హరిదాసులకు చోటిచ్చినా
మిగిలిన వేళల్లో మమ్మల్ని దాగుడుమూతలు ఆడుకోనిచ్చిన
నాలుగు స్తంభాల మంటపం స్ధానం బోసిపోయింది.
రెండువందలేళ్ళు బతుకుతానని మాటఇచ్చిన మిత్రుడు
అర్ధాంతరంగా అర్థాయుష్కుడిగా నాగావళిలో కలిసిపోయాడు
సంతానాన్ని మాత్రం మిగిల్చిపోయిన నా బుజ్జి కూర్మనాథుడు
మనవళ్ళలో తనను చూసుకొమ్మన్నాడు
నా చేతి అరటి పండు తింటూ గాయం చేసిన బుల్లి కూర్మనాథుడు
గర్భాలయంలో నేలబారుగా ఉండే మా శివలింగం
మా గుండెల గుడిలోనే శాశ్వతంగా బందీ అయిపోయింది
కాశీ నుండి వచ్చిన కొత్త లింగం ఎత్తైన పానవట్టం అధిరోహించింది
క్రొంగొత్త రూపాన్ని సంతరించుకుంది.
ఒకప్పుడు గర్భాలయంలోకి రానిచ్చి సేవలందుకున్న మా శివుడు
విడిచి వెళ్ళామన్న కోపంతో నేమో
పదడుగుల దూరంలోనే నిలబెడుతున్నాడు.
నల్ల కలువ లాంటి నిగ నిగల శరీర కాంతిలో
తెల్లతామరలాంటి వెండి కన్నుల దీప్తితో
స్వామికి ఎడమవైపు కొలువుండే చల్లని తల్లి
కోరిన వరాలు ఇచ్చే కల్ప వల్లి
స్వామికి కుడి ఎడమలుగా శృంగీ, భృంగీ
కంటికెదురుగా కొలువైన లేపాక్షి నందీ,గంటా
మీ దృష్టికి దేవుడు మారినా
అతని దయాదృష్టి మారలేదని చాటాయి
గుడికి ఎడం పక్కగా ఉండే చిన్న గుడిలోని
శివలింగం చెక్కు చెదరకుండా అలాగే ఉంది
పూలురాల్చి పలకరించే నిద్ర గన్నేరు చెట్టుమాత్రం
శాశ్వతంగా నిద్రపోయింది
ఆ పూలలోని మకరందం ఒలికిపోయింది
నిశ్శబ్దంగా ఓ కన్నీటి బిందువు రాలిపోయింది
ప్రియుడి సమాగమం కోసం పరిగెడుతున్న
పదహారేళ్ళ కన్నెపిల్ల నడుంలా వంపులు తిరుగుతూ
వయ్యారంగా పారుతూ
మొదటి మెట్టుమీదనుంచే కనిపించే నాగావళి
వంపులను కోల్పోయిన ప్రౌఢాంగన నడుంలా
విశాలంగా, భారంగా మూలుగుతోంది
ఒకప్పుడు దోసిలి పట్టి అమృతంలా తాగిన నది నీరు
నేడు కాళ్ళు కడుక్కోవడానికి కూడా భయపెడుతున్న తీరు
మీ మలినాలను కలిపి మలినం చేయకండర్రా
అంటూ తల్లి కారుస్తున్న కన్నీరు
'ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో అంటున్న
నా ఆవేదన తీర్చేదెవరు ??
మిమ్మల్నింక మోయలేనురా సవారీ చేయకండిరా
అంటూ మూలుగుతున్న ముసలితాతలా వంగిన వంతెన
తన గత వైభవాన్ని మాత్రం ఘనంగా చాటుతోంది.
అవతలి గట్టున కనిపించే గుడిసెలన్నీ
సమ్మెకట్టి తమ హక్కుల్ని సాధించిన గుర్తుగా
కాస్త దూరంగా, ఒంటరిగా ఉన్న కొండతో దోస్తీ చేస్తున్నట్టుగా
ఒంటి స్తంభం మేడ రూపంలో ఏకమై పోయాయి.
నది మధ్యలో కొత్తగా వెలసిన తథాగతుని దివ్యమంగళ విగ్రహం
క్రీస్తు పూర్వమే అంకురించిన బౌద్ధ మత ప్రాచీనతను చాటుతోంది
మూసుకు పోయిన మానవత్వపు కవాటాలను తెరుస్తోంది
ఒకప్పుడు అడుగు పెట్టడానికే అసహ్యించుకునే చోట
నగర పాలకసంస్థ నాటింది పారిశుధ్యపు బావుటా
రివర్ వ్యూ పార్కులో వెలసిన రాక్షస బల్లులు
చూపరులపై చిందిస్తాయి సంతోషపు జల్లులు
పార్కును రూపొందించిన తీరును
పార్కును రూపొందించిన తీరును
అభినందించకుండా ఉండలేను
కొబ్బరి కాయలమ్మే కనకమ్మ మనవడు కోటిగాడు
నా బుజ్జి కూర్మనాధుడి మూడవతరం బుల్లి కూర్మం
పూజారి హరిబాబు గారి మనవడు కొత్త పూజారి
టీ ఏజంటు తాతగారింట్లో మూడవతరం మేమూ
తరాలు మారినా తరగని మమతలు
ఎన్నటికీ తెగిపోని అనుబంధాల గొలుసు
మృతినైనా మరువలేని మృత్తిక వాసనలు
రాతిరి చీకటి దుప్పటి కప్పుకోవడం
వేకువ వెలుగుల కుంపటి రాజేయడం
ప్రకృతి మాత నైజం
మారిన కాలంతో మార్పులు రావడం సహజం
ఇది అందరం అంగీకరించక తప్పని చేదు నిజం
కొత్తనీరు వచ్చినంత మాత్రాన
పాతనీరు పూర్తిగా కొట్టుకుపోదు
పాత నీరు కలిసినంత మాత్రాన
కొత్తనీరు పాచి పట్టదు
పాత లోని చెడుగుదనాన్ని కొత్తనీరు కడుగుతుంది
కొత్త లోని మంచిదనాన్ని పాతనీరు గ్రహిస్తుంది
ఈ కొత్త పాతల మేలుకలయికే
వింత సౌరును ప్రసరిస్తుంది
బాగుంది
ReplyDeleteఇంత మంచి టపాకి ఒక్క కొత్త పాళీ గారు మాత్రమే స్పందించడం ...
ReplyDeleteఇల్లాలి ముచ్చట్లు సుధ గారు ఈ టపా చూడ లేదు కాబోలు. చూస్తే తప్పకుండా మంచి స్పందనని తెలిపిఉండే వారని అనుకుంటాను.
మీది శ్రీకాకుళమా ? పుట్టిన ఊరుని ఎంత చక్కగా చూపించారండీ రాధ గారూ, అభినందనలు.
చాలా చాలా బాగుందండి ...చాలా బాగా రాసారు
ReplyDeleteమంచి వారు మీరు
ReplyDeleteమనసున్న వారు మీరు
మంచి మనసున్న వారు మీరు
అందుకే నా బ్లాగు చదివారు మీరు
yourpoeticdescriptions aboutTilak,Nagavali and Savitri are beautiful and appreciated by me.Congratulations.Ramanarao.
ReplyDeleteశ్రీ ముద్దు రమణారావు గారు ఈ టపా మెచ్చుకుంటూ నాకు మెయిల్ చేసారు.( మీ మెయిల్ చిరునామా తెలియక)
ReplyDeleteవారి కామెంట్ యిదా, చూడండి: నాగావళి తీరపు సొగసుల గురించి మధుర=రాగాలాపన వంటి నీ వర్ణన చాలా==బాగున్నదని చెప్పడం చాలాతక్కువవుతుంది '.అభినందనలు .రమణారావు.ముద్దు-రాధ జిమెయిల్ అడ్రెసు తెలియదు .ఆమెకినా సందేశం తెలపమని కోరుతున్నాను .
Chala baga rasaru
ReplyDeleteవ్యంగం, చమత్కారం, వెటకారం పశ్చిమ గోదావరి వాళ్ళ సొంతం అని చాల మంది అంటే మీది అదే జిల్లా అనుకున్నాను . ( నాది ఆ జిల్లా కాదు లెండి ) మిది శ్రికాకులమా . వ్యంగం యెంత బాగా రాయగలరో. భావుకతతో అంతకు మిచి బాగా రాయగలరు. చాల బాగా రాశారు.
ReplyDelete