ఉందిలే మంచి కాలం ........అనబడే
హీరోయిన్ల ఓదార్పు యా(మా)త్ర !!
తొండ ముదిరితే ఊసరవెల్లవుతుందట
మరి సినిమా హీరోయిన్ ముదిరితే........??
వయసు పెరిగి,
ఒళ్ళు పెరిగి
ముఖంలో గ్లామరూ,
వెండితెరలో వేషాలూ మాత్రం తరిగిన
సినిమా హీరోయిన్ లూ......!!
మీరెంత మాత్రమూ చింతించవలదు.
బుల్లి తెర మీకు తెర నిండుగా బోలెడు అవకాశాలు కల్పిస్తోంది.
నిజానికి వెండి తెరలో నాయిక వేషాలు వేయడం కంటే బుల్లి తెరకు అత్తగారి వేషం వేయడంలో బోలెడు అదనపు సౌకర్యాలు న్నాయి.
అవేమిటో తెలిస్తే బుల్లితెరకే మీ ఓటు వేస్తారు.
కావాలంటే ఆల్రెడీ బుల్లితెరకి షిఫ్టయిపోయిన ఎక్స్ కథానాయికలనడిగి చూడండి మీకే తెలుస్తుంది ఆ సౌలభ్యాలేమిటో!
పోనీలెండి. .......వాళ్ళు సరిగ్గా చెప్పరేమో.
ప్రొఫెషనల్ రైవల్రీ ఒకటేడుస్తుందిగా !!
నేనే చెప్తాన్లెండి. ఎంతైనా కొంతకాలంపాటు మీ అభినయం తోను, అందంతోను మమ్మల్ని అలరించినవారు కదా. మీ పై మాకున్న అభిమానం ఎక్కడికి పోతుందీ ?
ఇదిగో చెప్పేస్తున్నా......
ఒకటీ.................
హీరోయినైతే ఏడాదికి మూడో నాలుగో మహా అయితే ప్ఫదో, పన్నెండో. ఖర్మకాలి వాటిలో ఒకటో రెండో ఫ్లాపయ్యాయనుకోండి అంతే సంగతులు. ‘అఖిలాంధ్ర ప్రేక్షక హృదయ చోరిణి ‘ బిరుదు కాస్తా ‘ అఖిలాంధ్ర
ఐరన్ లెగ్గిణి ‘ గా మీ పేరు సినీ చరిత్రలో తిరగరాయబడుతుంది.
అదే సీరియల్ అత్తగారనుకోండి. ప్రతిరోజూ షూటింగ్ పండగే. ఇక్కడ హిట్టూ ఫ్లాపుల భాగోతాలంతగా ఉండవు. ఒకవేళ ఏమూలో ఉన్నా కూడా ఆ పాప పంకిలం క్యారక్టరార్టిస్టుల పాద పద్మాలకు అంటదు. కాబట్టి ‘ఇల సాటిలేని అత్త ‘గా వెలిగిపోవచ్చు. అందనంత ఎత్తుకు ఎదిగి పోవచ్చు. (అడ్డంగా ఎదిగినా అభ్యంతరం ఉండదు) . హీరోయిన్లుగా ప్రేక్షక హృదయ సామ్రాజ్యాలను ఒకప్పుడు కొల్లగొట్టిన తారలకు ప్రత్యేక డిమాండ్ కూడా కద్దు.
ఇంకోటీ....
హీరోయిన్లుగా ఒక్క కేజీ బరువు పెరిగినా క్రేజీగా గోల పెట్టేసే అభిమానులు - టీవీ అత్తగా తెరనిండుగా పెరిగినా ఏవీఁ అనుకోరు. తీగె పాకం ల్లాటి సన్నని శరీరాలతో ఊరించిన మీరే - ఇప్పుడు పాకం పీల్చిన గులాబ్ జామూన్లలా ఊరిపోయినా ప్రేక్షకులు కళ్ళనిండుగా చూస్తూ ఊరుకుంటారు. ఆ పాటి బరువు లేకపోతే పాత్రకు న్యాయం జరగదని సరిపెట్టేసుకుంటారు.
హీరోయిన్లుగా అరకేజీ బరువు పెరిగితే పాత్ర దక్కక పోయే ప్రమాదమున్నట్టే “ సీరియల్ అత్తగారు” గా అరకేజీలో అరవంతు దగ్గినా పాత్ర దక్కకపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి హీరోయిన్లూ...తస్మాత్ జాగ్రత్త !
ఒకప్పుడు కడుపు మాడ్చుకొని, కష్టానికి ఓర్చుకొని వీరగా చేసిన డైటింగులన్నీ పక్కన పెట్టేయండి.
‘తిండి కలిగితె పాత్ర కలదోయ్ ‘ అన్న మాటని గుర్తుపెట్టుకొని వెజ్జూ, నానువెజ్జూ కలిపి మరీ లాగించెయ్యండి.
మరోటీ....
అత్తగారి పాత్రలు ధరించడంలో మరికొన్ని ఆకర్షణలతో పాటు నటనా సౌలభ్యం కూడా ఉందండోయ్.
1. 1. హీరోయిన్లుగా కోడళ్ళ పాత్రలు ధరించి అత్తల చేతుల్లో పడిన
ఆరళ్ళన్నింటికీ ఎంచక్కా బదులు తీర్చేసుకోవచ్చు.
2. హీరోయిన్లుగా ఉన్నప్పుడు నాగకన్య పాత్ర (నగీనా లో శ్రీదేవి లా)
మిమ్మల్ని వరించలేదని దిగులుపడుతున్నారా ? ఎంతమాత్రమూ
విచారించవలదు. అత్తగారి వేషంలో ఆ దురద తీర్చేసుకోవచ్చు.
పాము యాక్షన్ బహు సులభంట. క్లోజప్లో విషపు చూపుని ఓసారి
విసిరితే చాలు. మిగతాదంతా కెమేరా మాన్ చూసుకుంటాడు.
మీరు విషపునాగు అని సూచించడానికి కళ్ళకి నీలపు కాంటాక్టు
లెన్స్ ఎలాగో వాడబడుతుందనుకోండి. ఇంకా స్పెషల్ ఎఫెక్టు
కావాలంటే ఆఫ్రికా అడవుల్లో పడగెత్తిన పామునోసారి, మీ
మోమునోసారి అలా పదిసార్లు చూపిస్తాడు. కాబట్టి ఆట్టే
కష్టపడక్కరేకుండా మీ కొచ్చిన దాంట్లో ఆరోవంతు యాక్షన్
చేసినా చాలన్నమాట.
మరి పామైతే బుస్సు బుస్సున బుసలు కొట్టొద్దూ. అది మాత్రం
సులభమా అనడుగుతారేమో ?
అబ్బే…… చాలా ఈజీ అండీ. ఒక్కసారి గుండెలనిండా గాఠిగా ఊపిరి
పీల్చుకుని అంతే గాఠిగా ఊపిరి విడిస్తే చాలు.
నిజానికి దీనికోసం కూడా ఆట్టే కష్టపడక్కర్లేదుట. భారీ మేకప్పు,
భారీ నగలూ, భారీ పట్టుచీరలతో అలంకరించబడిన అతి భారీ
కాయంతో సెల్లూపుకుంటూ పచార్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు.
కాబట్టి ఆయాసం, దాంతో పాటు దాని అప్పగారైన ఆవేశం రెండూ
వాటంతటవే జమిలిగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. దీనికి తోడు
ఒంట్లో బీపీ కూడా ఉంటే మరీ మంచిది. సన్నివేశం బాగా రక్తి
కడుతుంది. జనాలు ఒకటికి రెండు వీరతాళ్ళు వేస్తారు.
3. హీరోయిన్లుగా పాత్రల కోసం ఎంతో శ్రమించి నవరసాలూ ఒలకబోసి
ఉండి ఉంటారు. కానీ ఇప్పుడు వాటిలో ,
కరుణ, శాంత, శృంగార రసాలకి బోల్డంత రెస్టిచ్చి బీభత్స, రౌద్ర, వీర,
భయానక రసాలను మాత్రం ధారగా ఒలక బోస్తే చాలు. ఇందులో
ఇంకో అదనపు ఆకర్షణ కూడా ఉందండోయ్. ఒక వేళ ఉత్తమ కథా
నాయికగా నందిఅవార్డు అందుకొని ఉండకపోయినా ఉత్తమ
అత్తగారిగా టీవీ నంది అవార్డు ఠీవీగా అందుకోవచ్చు.
4. హీరోయిన్లుగా ఉన్నప్పుడు ఆరుగజాల పట్టుచీరలు కట్టుకొని
ఒంటినిండా నగలు పెట్టుకొని అలంకరించుకుంటే బావుండునన్న
కోరిక కలిగినా దర్శక, నిర్మాత, ప్రేక్షక వర్గాల కోసం త్యాగం చేసి
అరగజం వస్త్రం తోనే సరిపెట్టుకొని ఉండవచ్చును. కానీ సీరియల్
అత్తగారైతే పగలు పది గంటలైనా, రాత్రి రెండు గంటలయినా ఏ
షాటైనా, ఏ ఎపిసోడైనా ఆరు గజాల పట్టు చీరకీ, అరకేజీ
ఆభరణాలకీ తక్కువ కాకుండా ధరించి ఎంచక్కా మీ చిరకాల
వాంఛని తీర్చుకోవచ్చు.
సినీ హీరోయిన్ కీ టీవీ అత్తగారికీ తేడా –
ఒక్కమాటలో చెప్పాలంటే........
హీరోయిన్లుగా -
వలువలు తక్కువ
విలువలు ఎక్కువ
అత్తగారిగా-
వలువలు ఎక్కువ
విలువలు తక్కువ ....
మరి హీరోయిన్ పాత్రకా....
అత్తగారి పాత్రకా
దేనికి మీరు ఓటు వేసేరూ....
రెండిట్లో ఏది మీకు ప్యారూ.....
(డెఫినెట్ గా అత్తగారి పాత్రకే కదూ......)
సో........................
వయసులు మళ్ళిన
ఒళ్ళులు పెరిగిన
తారల్లారా రారండి
అత్తగార్లుగ మారండి.....
భలే భలే శెబాష్
ReplyDeleteహీఓయిన్ ముదిరి సీరియల్ అత్తగారవుతుందన్నమాట! :)
అబ్బ ఏం సెటైర్ వేసారండీ...నవ్వలేక చచ్చాననుకోండి. బలే పసందుగా రాసారు. ప్రతీ వాక్యానికి నవ్వొచ్చింది. కాకపొతే ఒకే ఒక్క చోట మాత్రం నా నవ్వుకి స్పీడ్ బ్రేక్ పడింది. "హీరోయిన్లుగా - వలువలు తక్కువ, విలువలు ఎక్కువ". ఏ విలువలండీ, అవెక్కడున్నాయి హీరోయిన్లకి? పాటలకి, ఎక్స్‌పోజింగ్ కి తప్ప సినిమాల్లో వాళ్లకి పెద్ద విలువేది?
ReplyDeletewell said...:)
ReplyDeleteసౌమ్యగారూ, నవ్వినందుకు థాంక్సండీ.
ReplyDeleteవలువలు - విలువలు.. రైమింగ్ కోసం ఆ పదం వాడాను నా ఉద్దేశంలో ఇక్కడ విలువలు అంటే డబ్బు అని. అంతే.
hi mottaniki bullitera meeda paddavu viruchukuni...eppudoo ee balaji tele films vallooo nee meeda paruvu nashtam daava vestaremo endukaina manchidki gopi bava salaha teesuko sabhaso!!!
ReplyDeletetv lo patralu kuda leka pote yenchakka rajkiyallo cheri povachu
ReplyDelete