Sunday, April 10, 2011

ఉందిలే మంచి కాలం ........అనబడే హీరోయిన్ల ఓదార్పు యా(మా)త్ర !!

ఉందిలే మంచి కాలం ........అనబడే
హీరోయిన్ల ఓదార్పు యా(మా)త్ర !!
తొండ ముదిరితే ఊసరవెల్లవుతుందట                                                                     
మరి సినిమా హీరోయిన్ ముదిరితే........??

వయసు పెరిగి,
ఒళ్ళు పెరిగి
ముఖంలో గ్లామరూ,
 వెండితెరలో వేషాలూ మాత్రం తరిగిన
 సినిమా హీరోయిన్ లూ......!!
మీరెంత మాత్రమూ చింతించవలదు.
బుల్లి తెర  మీకు తెర నిండుగా బోలెడు అవకాశాలు కల్పిస్తోంది.
నిజానికి వెండి తెరలో నాయిక వేషాలు వేయడం కంటే బుల్లి తెరకు అత్తగారి వేషం వేయడంలో బోలెడు అదనపు సౌకర్యాలు న్నాయి.
అవేమిటో తెలిస్తే బుల్లితెరకే మీ ఓటు వేస్తారు.
కావాలంటే ఆల్రెడీ బుల్లితెరకి షిఫ్టయిపోయిన ఎక్స్ కథానాయికలనడిగి చూడండి మీకే తెలుస్తుంది ఆ సౌలభ్యాలేమిటో!
పోనీలెండి. .......వాళ్ళు సరిగ్గా చెప్పరేమో.
ప్రొఫెషనల్ రైవల్రీ ఒకటేడుస్తుందిగా !!
నేనే చెప్తాన్లెండి. ఎంతైనా కొంతకాలంపాటు మీ అభినయం తోను, అందంతోను మమ్మల్ని అలరించినవారు కదా. మీ పై మాకున్న అభిమానం ఎక్కడికి పోతుందీ  ?
 ఇదిగో చెప్పేస్తున్నా......
 ఒకటీ.................
హీరోయినైతే ఏడాదికి మూడో నాలుగో మహా అయితే ప్ఫదో, పన్నెండో. ఖర్మకాలి వాటిలో ఒకటో రెండో ఫ్లాపయ్యాయనుకోండి అంతే సంగతులు. ‘అఖిలాంధ్ర ప్రేక్షక హృదయ చోరిణి ‘ బిరుదు కాస్తా ‘ అఖిలాంధ్ర  
ఐరన్ లెగ్గిణి  ‘ గా  మీ పేరు సినీ చరిత్రలో తిరగరాయబడుతుంది.
అదే సీరియల్ అత్తగారనుకోండి. ప్రతిరోజూ షూటింగ్ పండగే. ఇక్కడ హిట్టూ ఫ్లాపుల భాగోతాలంతగా ఉండవు. ఒకవేళ ఏమూలో ఉన్నా కూడా ఆ పాప పంకిలం క్యారక్టరార్టిస్టుల పాద పద్మాలకు అంటదు. కాబట్టి ‘ఇల సాటిలేని అత్త ‘గా వెలిగిపోవచ్చు. అందనంత ఎత్తుకు ఎదిగి పోవచ్చు. (అడ్డంగా ఎదిగినా అభ్యంతరం ఉండదు) . హీరోయిన్లుగా ప్రేక్షక హృదయ  సామ్రాజ్యాలను ఒకప్పుడు కొల్లగొట్టిన తారలకు ప్రత్యేక డిమాండ్ కూడా కద్దు.

ఇంకోటీ....
హీరోయిన్లుగా ఒక్క కేజీ బరువు పెరిగినా క్రేజీగా గోల పెట్టేసే అభిమానులు - టీవీ అత్తగా తెరనిండుగా పెరిగినా  ఏవీఁ అనుకోరు.  తీగె పాకం ల్లాటి  సన్నని శరీరాలతో ఊరించిన మీరే -  ఇప్పుడు పాకం పీల్చిన గులాబ్ జామూన్లలా ఊరిపోయినా ప్రేక్షకులు కళ్ళనిండుగా చూస్తూ ఊరుకుంటారు. ఆ పాటి బరువు లేకపోతే పాత్రకు న్యాయం జరగదని సరిపెట్టేసుకుంటారు.
 హీరోయిన్లుగా అరకేజీ బరువు పెరిగితే పాత్ర దక్కక పోయే ప్రమాదమున్నట్టే “ సీరియల్ అత్తగారు” గా అరకేజీలో అరవంతు దగ్గినా పాత్ర దక్కకపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి హీరోయిన్లూ...తస్మాత్ జాగ్రత్త !
ఒకప్పుడు కడుపు మాడ్చుకొని, కష్టానికి ఓర్చుకొని వీరగా చేసిన డైటింగులన్నీ పక్కన పెట్టేయండి.
‘తిండి కలిగితె పాత్ర కలదోయ్ ‘ అన్న మాటని గుర్తుపెట్టుకొని వెజ్జూ, నానువెజ్జూ కలిపి మరీ లాగించెయ్యండి.
మరోటీ....
అత్తగారి పాత్రలు ధరించడంలో మరికొన్ని ఆకర్షణలతో పాటు నటనా సౌలభ్యం కూడా ఉందండోయ్.
1.        1.  హీరోయిన్లుగా కోడళ్ళ పాత్రలు ధరించి అత్తల చేతుల్లో పడిన   
           ఆరళ్ళన్నింటికీ ఎంచక్కా బదులు తీర్చేసుకోవచ్చు.
       2.   హీరోయిన్లుగా ఉన్నప్పుడు నాగకన్య పాత్ర (నగీనా లో శ్రీదేవి లా)  
           మిమ్మల్ని వరించలేదని దిగులుపడుతున్నారా ? ఎంతమాత్రమూ 
           విచారించవలదు. అత్తగారి వేషంలో ఆ దురద తీర్చేసుకోవచ్చు. 
           పాము యాక్షన్ బహు సులభంట. క్లోజప్లో విషపు చూపుని ఓసారి 
           విసిరితే చాలు. మిగతాదంతా కెమేరా మాన్ చూసుకుంటాడు.
        మీరు విషపునాగు అని సూచించడానికి కళ్ళకి  నీలపు కాంటాక్టు   
        లెన్స్ ఎలాగో వాడబడుతుందనుకోండి. ఇంకా స్పెషల్ ఎఫెక్టు 
        కావాలంటే ఆఫ్రికా అడవుల్లో పడగెత్తిన పామునోసారి, మీ 
        మోమునోసారి అలా పదిసార్లు చూపిస్తాడు. కాబట్టి ఆట్టే     
        కష్టపడక్కరేకుండా  మీ కొచ్చిన దాంట్లో ఆరోవంతు యాక్షన్ 
        చేసినా     చాలన్నమాట. 
        మరి పామైతే బుస్సు బుస్సున బుసలు కొట్టొద్దూ. అది మాత్రం 
        సులభమా అనడుగుతారేమో ?
        అబ్బే…… చాలా ఈజీ అండీ. ఒక్కసారి గుండెలనిండా గాఠిగా ఊపిరి 
        పీల్చుకుని అంతే గాఠిగా ఊపిరి విడిస్తే చాలు.
        నిజానికి దీనికోసం కూడా  ఆట్టే కష్టపడక్కర్లేదుట. భారీ మేకప్పు, 
        భారీ    నగలూ, భారీ పట్టుచీరలతో అలంకరించబడిన అతి భారీ 
        కాయంతో  సెల్లూపుకుంటూ పచార్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు.
        కాబట్టి ఆయాసం,  దాంతో పాటు  దాని అప్పగారైన ఆవేశం రెండూ 
       వాటంతటవే జమిలిగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. దీనికి తోడు 
       ఒంట్లో బీపీ కూడా ఉంటే మరీ మంచిది. సన్నివేశం బాగా రక్తి 
       కడుతుంది. జనాలు ఒకటికి రెండు వీరతాళ్ళు వేస్తారు.
3.     హీరోయిన్లుగా పాత్రల కోసం ఎంతో శ్రమించి నవరసాలూ ఒలకబోసి  
       ఉండి ఉంటారు. కానీ ఇప్పుడు వాటిలో  ,
       కరుణ, శాంత, శృంగార రసాలకి  బోల్డంత రెస్టిచ్చి బీభత్స, రౌద్ర, వీర,   
       భయానక రసాలను మాత్రం ధారగా ఒలక బోస్తే చాలు.  ఇందులో 
       ఇంకో అదనపు ఆకర్షణ కూడా ఉందండోయ్. ఒక వేళ ఉత్తమ కథా 
       నాయికగా  నందిఅవార్డు అందుకొని  ఉండకపోయినా ఉత్తమ 
       అత్తగారిగా   టీవీ నంది అవార్డు ఠీవీగా అందుకోవచ్చు.
4.      హీరోయిన్లుగా ఉన్నప్పుడు ఆరుగజాల పట్టుచీరలు కట్టుకొని 
        ఒంటినిండా నగలు పెట్టుకొని  అలంకరించుకుంటే  బావుండునన్న 
        కోరిక కలిగినా దర్శక, నిర్మాత, ప్రేక్షక వర్గాల కోసం త్యాగం చేసి 
        అరగజం  వస్త్రం తోనే సరిపెట్టుకొని ఉండవచ్చును. కానీ సీరియల్ 
        అత్తగారైతే పగలు పది గంటలైనా, రాత్రి  రెండు గంటలయినా ఏ 
        షాటైనా, ఏ ఎపిసోడైనా ఆరు గజాల పట్టు చీరకీ, అరకేజీ   
        ఆభరణాలకీ   తక్కువ కాకుండా ధరించి ఎంచక్కా మీ చిరకాల 
        వాంఛని తీర్చుకోవచ్చు.

        సినీ హీరోయిన్ కీ  టీవీ అత్తగారికీ తేడా –
        ఒక్కమాటలో చెప్పాలంటే........
        హీరోయిన్లుగా -
        వలువలు తక్కువ 
        విలువలు ఎక్కువ 
        అత్తగారిగా-
        వలువలు ఎక్కువ      
        విలువలు తక్కువ ....


మరి హీరోయిన్ పాత్రకా....
అత్తగారి పాత్రకా
దేనికి మీరు ఓటు వేసేరూ....
రెండిట్లో ఏది మీకు ప్యారూ.....
(డెఫినెట్ గా అత్తగారి పాత్రకే కదూ......)
సో........................
     వయసులు మళ్ళిన
     ఒళ్ళులు పెరిగిన
     తారల్లారా రారండి
     అత్తగార్లుగ  మారండి.....

Thursday, March 17, 2011

ఆయనకిద్దరు..... !! ఇంకో ఆయనకి..... ??


ఆయనకిద్దరు..... !!
ఇంకో ఆయనకి..... ??

అనగనగా ఒక రాజుగారు. ఆయనకిద్దరు భార్యలు. ఒకరు మంచి. ఒకరు చెడ్డ. (రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదే కదా).
 
 రాజు గారికి మంచి భార్య అంటే కొంచెం ప్రేమ ఎక్కువ. చెడ్డ భార్యకి మంచి భార్యను చూస్తే  కొంచెం  కోపం ఎక్కువ.

మం.భా ని చంపడానికి, రాజుగారికి ఆమెపై ద్వేషాన్ని కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది చె.భా. కానీ ఎంచేతనో అవి ఫలించవు. ఇలా ఉండగా ఓ మంచి (? ) ముహూర్తాన మం.భా ఓ మంచి బిడ్డను కంటుంది. అది చె. భా. కి మరీ కంటగింపవుతుంది. అంతే. తన డబ్బూ, పలుకుబడీ ఉపయోగించి శకునిలాంటి సోదరుడి తోనో, మంధర లాంటి పనిమనిషి తోనో మంచి బిడ్డను కిడ్నాప్ చేయిస్తుంది. ఆ బిడ్డను చంపడానికి ఆమె చేయించిన ప్రయత్నాలు కూడా ( దైవానుగ్రహం మంచి పట్ల ఉండడం చేత కాబోలు) అవి వ్యర్థమైపోతాయి. అయితే చె.భా చేసే దుష్ట యత్నాలేవీ రాజు గారికి తెలీవు. చివరాఖరికి తెలిసాక చె.భా ని రాజు శిక్షించాలనుకుంటాడు కానీ మ.భా విశాల హృదయంతో చె.భా కి క్షమా భిక్ష పెడుతుంది. ఇక అంతా శుభమే. కథ కంచికీ...మనమింటికీ (మింటికీ మంటికీ ఏకధారగా).............

అబ్బబ్బబ్బ....విసుగైత్తిపోతోంది. చిన్నప్పట్నించీ వింటున్నాం...కంటున్నాం - జానపదకథలు...ఇంకా ఎన్ని సార్లు వింటాం??  ఎన్నిసార్లు  కంటాం??
అయినా ఈ కలభాషిణి సీరియస్ గా సీరియల్ కథలు చెప్తోంది కదా - ఈ మధ్య ! అవి మానేసి జానపదం మొదలెట్టిందేం? తేరగా, తీరిగ్గా దొరికామనా...అనుకుంటున్నారా – నా బ్లాగు బాధితులూ....!!

సారీ అండీ...! 

నేనింతవరకూ చెప్పింది జానపదం కాదండీ. అచ్చ తెలుగు(?)టీవీ సీరియల్ కథ.

కాస్త కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేసి (ఆగండాగండి.... మీరు కాదు...) షర్టూ ప్యాంటూ చీరలూ చోళీలూ తగిలించి సెల్లూ గిల్లూ మోతలతో ఆ జానపద పాత్రలని అలంకరించుకోండి అత్యాధునికంగా. ఇట్టే తెలుగు సీరియల్ పాత్రలు కళ్ళకు కట్టేస్తాయి.

అయితే తమరింతవరకు చెప్పింది సీరియల్ కథా....?

కానీ ఈ 21 వ శతాబ్దంలో కూడా- ఆయనకి ఇద్దరేమిటీ?  అదీ.. ఒకే ఇంట్లో కలిసి ఉండడ మేమిటీ ? ఈ కత్తులూ, కఠార్లూ నూరుకోవడమేమిటీ ? జనాలివి చూస్తూ ఊరుకోవడమేమిటీ...?

‘చిరకాలం సాగిన ఈ రాచరికాలూ, అన్యాయాలూ, అబలలపై దాడులూ ఇంకనా... ఇకపై చెల్లవు’ అంటూ శ్రీ శ్రీ ఆవహించి పళ్ళు నూరుతున్నారా...
ఒద్దు సుమండీ.......పళ్ళు నూరితే అరిగి పళ్ళపొడిగా మారే ప్రమాదముంది.( అసలే అసలు సిసలు రూపాలకి నకిలీ పళ్ళపేస్టులు దొరుకుతున్న రోజులివి)
హు...ఒకరు బతికుండగానే, కనీసం విడాకులైనా లేకుండానే మరొకర్ని చేసుకోవడమా...ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడమా... దీనికి ఇంటిల్లిపాదీ (ప్రేక్షకులతో సహా) ఆమోద ముద్ర వేయడమా?

 అసలు చట్టం అనేది ఉందా? ఉంటే ఏం చేస్తోందసలు? అంటూ ఎడం అరచేతిలో పిడికిలి బిగించి కొట్టుకుంటూ ఆవేశ పడుతున్నారా...
అబ్బే.... ఎంత మాత్రమూ లాభం లేదండీ.

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ...అనే  సినిమా పాటతోనో-
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే నేటి రాజకీయనాయకుల మాటతోనో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవలసిందే. సుబ్బరంగా సూటూ బూటూ వేసుకు తిరుగుతున్న వాళ్ళక్కూడా షుగర్ వ్యాధులొచ్చే చెడ్డ రోజులివి సుమండీ.

నేటి సీరియల్ కథల్లో చాలా వరకు (ముప్పాతిక మువ్వీసం) చట్టాల పరిథిలోగాని, సాంఘిక విలువల చట్రాల పరిథి లోకి గాని ఒదగవు. వాటికంటూ ప్రత్యేక చట్టాల్ని, విలువల్ని, సృష్టించుకొని అటానమస్ గా వెలిగిపోతున్న సీరియల్ రాజాలవి.

టాప్ రేటింగ్ సీరియల్ దగ్గరనుంచి అతి సాధారణ సీరియల్ వరకూ ఇంచుమించు అన్నిటిలోనూ ఇదే పోకడ. 

ఒకరికి ఇద్దరైన వేడుకేలే......!! అని పల్లెటూరు బావలా పాడుకుంటూ (మనకి ఆ పాట రాకపోతే వాళ్ళే పాడేస్తారు లెండి) సరి పెట్టేసుకోమంటారు,  సీరియల్ నిర్మాతాదులు.

ఈ కిడ్నాపులూ, చంపుకోవడాలూ, ఇద్దరు భార్యల భాగోతాలు ఇలాంటివి మన సమాజంలో క్వాచిత్కంగా తప్ప చూడమే. అలాంటిది ‘ఈ కంపు ప్రతి ఇంట్లోను కామనే’ అన్నట్టుగా చూపిస్తూ ఉంటే అఖిలాంధ్ర స్త్రీ ప్రేక్షకులు ఎలా సమర్థిస్తున్నారసలు.... బామ్మల దగ్గరనుంచి  భామల  వరకూ ఎలా ఆదరిస్తున్నారు ?  ఈ ఘోర కలిని ఎలా సహిస్తున్నారు…. ? ఎలా భరిస్తున్నారు.....? హు...హు...!!

అదిగో - మళ్ళీ ఆవేశ పడుతున్నారు చూసారా... ….వద్దే వద్దు సుమండీ...!!
ఆవేశం బీపీ దాయకం. అసలే ఇరవైకే అరవైలోలా బీపీ లొచ్చే కలికాలపు రోజులివి.

మరి ఇలా వింటుంటేనే బీపీలు తెప్పించే ఈ సీరియల్ కథలు ఇంతమంది ఆదరణకి ఎలా నోచుకుంటున్నాయి?

ఎలా ఆకర్షించగలుగుతున్నాయి ?

“ భారతం, భాగవతంలోని శృంగార కథలు గారెలు తిన్నట్టుగా ఉంటాయని జాషువా (ముసాఫర్లు లో) వర్ణిస్తాడు. ఈ కథలు అఖిలాంధ్ర  స్త్రీలోకానికి  గారెలు తిన్నట్టుగా  అతిమధురంగా ఎలా తోస్తున్నాయి!   ఒక్కరోజు ఎపిసోడ్ మిస్సయితే  ఒక వాయి గారెలు మిస్సయినంత బాధ  ఎందుకు కలుగుతోంది?

బాగా ఆలోచించిన మీదట నాకు తోచిన కారణం ఒకటే.
రామాయణం విని ఏక పత్నీ వ్రతుడైన రాముణ్ణి పూజించాం.
భాగవతం విని బహు పత్నీవ్రతుడైన కృష్ణుణ్ణి  ఆరాధించాం.
ఆ ఇద్దర్నీ మహా పురుషులుగా, ఆ యుగపు ధర్మాన్ని అనుసరించిన వారిగా వారిని సమర్థించాం.

సరిగ్గా ఇప్పుడూ అదే  విశాల నేత్రాలతో తిలకిస్తూ, విశాల హృదయాలతో,  ఈ సీరియల్ పాత్రలను ఆదరిస్తున్నాం. 

కానీ అవి గత కాలపు కథలు. అప్పటి యుగధర్మాల గురించి విన్నవారమే కాని కన్నవారము కాము కాబట్టి ఆ కథలను సమర్థించవచ్చునేమో.
కానీ ఈ సీరియల్లో కథలు నేటి కథలు. మన చుట్టూ ఉన్న మనుషుల గురించి అల్లిన కథలు. ఈ యుగపు ధర్మాలూ, చట్టాలూ అన్నీ మనం కన్న వారం మాత్రమే కాదు. అనుసరిస్తున్నవారం.

మరి అలాటిది ఈ యుగ సాంఘిక ధర్మానికీ, చట్టానికీ విరుద్ధంగా నడుస్తున్న  ఈ కథలను తప్పనుకోకుండా తప్పనిసరిగా చూసి ఆరాధించడం తప్పో ఒప్పో... !!
 మరి ఆ తప్పొప్పులను నిర్ణయించే భగవంతుడే చెప్పాలి.
మానవుడు సంఘజీవి. ‘సంఘంలో జీవించలేని వాడు పశువైనా కావాలి. లేదా పరమాత్ముడైనా కావాలి’ అంటాడు అరిస్టాటిల్.

ఈ మాటలను సీరియల్ పాత్రలకు అన్వయిస్తే వారు ఏ కేటగిరీ కిందకు వస్తారో … ప్రేక్షక విజ్ఞులే నిర్ణయించాలి.

మరి మీరేమంటారు బ్లాగర్జీ...... ?

అఖిలాంధ్ర  సీరియల్ ప్రేక్షకులూ..

Tuesday, March 8, 2011

నాణానికి అటూ - ఇటూ




ప్రకృతివి నీవు

పురుషాహంకార సమాజానికి నిలువెత్తు ఆకృతివి నీవు

వెలిగే చుక్కవు నీవు
స్వేచ్ఛ అనే రెక్కలు తెగిన పక్షివి నీవు

సృష్టికి మూలం నీవు        
నీ అస్తిత్వాన్ని చాటితే గర్భంలోనే లయించే పిండం నీవు

ఆకాశంలో సగం నీవు
శూన్యంలో సగాన్ని పొంది శూన్యంగానే మిగిలిపోయే జీవివి నీవు

మమతలు పంచే అమ్మవు నీవు
అంగట్లో అమ్ముడు పోయే అందాల బొమ్మవు నీవు

తరాల నడుమ వారధి నీవు
తరతరాలుగా కన్నీళ్ళు కార్చినా ఎండిపోని అంబుధి నీవు.

Tuesday, March 1, 2011

పేగు కాలిన వాసన( ఎ.ఎన్.జగన్నాథ శర్మ) కథా సంపుటి - పరిచయం



గత అయిదుసంవత్సరాలుగా ప్రతిఏటా ఒక ఉత్తమ కథల సంపుటికి మాడభూషి రంగాచార్య ట్రస్టు, రచయితకి 5000 రూ. నగదు బహుమతి,మెమెంటోతో  పురస్కారం అందచేస్తోంది. 2011సంవత్సారానికి గాను మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం -శ్రీ  ఎ.ఎన్.జగన్నాథశర్మ గారి పేగుకాలిన వాసన కథా సంపుటికి లభించింది. ఫిబ్రవరి 25,2011 న జరిగిన సభలో శ్రీ శర్మగారు ఈ పురస్కారం అందుకున్నారు.



కథా సంపుటి రచన  ఎ.ఎన్. జగన్నాథ శర్మ
ప్రతులకు:
పాలపిట్ట ప్రచురణలు 
16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట,
హైదరాబాద్- 500 036
వెల       125.


 పేగుకాలిన వాసన కథా సంపుటి - పరిచయం

కొన్ని కథలు ఆహ్లాదాన్నిస్తాయి. కొన్ని కథలు ఆవేశాన్ని రగిలిస్తాయి. మరికొన్ని కథలు తీరని మన కలలకీ, ఆశలకీ రెక్కలు తొడిగి ఊహాలోకంలో విహరింప చేస్తాయి. అతి తక్కువ కథలు మాత్రమే మన కళ్ళకు వాస్తవికత అనే కళ్ళజోడు తొడిగి, అంతవరకు మనం చూడని, చూడలేని జీవితపు మూలల్ని(మూలాల్ని) స్పష్టాతి స్పష్టంగా చూపుతాయి. ఆలోచింపచేస్తాయి. అటువంటి కథలకు సాహితీ లోకంలో ఎప్పటికీ శాశ్వతత్వం ఉంటుంది.

 ఎ.ఎన్. జగన్నాథ శర్మ  పేగు కాలిన వాసన కథలు ఈ కోవకు చెందినవి. దిగువ మధ్య తరగతి జీవితాల్లోని వివిధ కోణాలను చిత్రించిన ఈ కథలను చదివినప్పుడు మనం నివసిస్తున్న సమాజం పై కసీ, ఛిద్రమైన జీవితాల పట్ల జాలీ, వారి కోసం ఏదో చెయ్యాలనే తాపత్రయం, ఏదీ చెయ్యలేని నిస్సహాయతా కలగలిసిపోయి ఒకానొక అచేతన స్థితికి చేరుకుంటుంది మనసు. ఈ కథలను  చదువుతున్నప్పుడు మనం ఏ అనుభూతిని పొందుతామో సరిగ్గా అదే అనుభూతితో రచయిత రాసిన కథలివి. అందుకే ఈ కథలను చదువుతున్నప్పుడు మనం పీల్చేది పేగు కాలిన వాసన ని మాత్రమే కాదు. ఛిద్ర జీవితాలకోసం అలమటించే రచయిత గుండె కాలిన వాసన కూడా.

దిగువ మధ్య తరగతి జీవితాల్లోని విషాదాన్ని, వేదనను, దారిద్ర్యాన్ని, బలవంతుల దౌర్జన్యాలనీ, పరపీడన పరాయణత్వాన్ని, పిడికెడు అన్నం కోసం దిగజార్చుకుంటున్న విలువల్నీ రచయిత కరుణ రసాత్మకంగా చిత్రించారు. ఈ కథలన్నీ వాస్తవ జీవితాన్ని చిత్రించినవే అయినా ఆ వాస్తవ జీవితాల్లోని వ్యథార్త జీవిత యాథార్థ దృశ్యాలన్నీ మనల్ని భయపెడతాయి. వెంటాడి వేధిస్తాయి. వేదన రగిలిస్తాయి. ఆలోచించడం తప్ప మరేమీ చేయలేని మన చేతకానితనాన్ని, శూన్య హస్తాలనీ వెక్కిరిస్తూనే ముందుకు తీసుకుపోతాయి. మళ్ళీ మళ్ళీ చదివేలా చేస్తాయి.

ఈ సంపుటి లోని చాలా కథలు మధ్య తరగతి జీవితాలకు అద్దం పట్టిన కొడవటిగంటి కుంటుంబరావు, కాళీ పట్నం రామారావు, తిలక్ వంటి రచయితలను గుర్తు చేస్తాయి. అంత మాత్రాన ఈ కథలు వాటికి అనుకరణలూ, అనుసరణలూ కావు. ఈ సారూప్యతకి కారణం వీరందరి కథా భూమిక ఒకటే కావడం. వీరందరూ మధ్యతరగతి జీవితాలు అనే నేలపై వాస్తవికత అనే విత్తనాలు నాటి కథల పంటలు  పండించిన రచయితలు. నేల ఒకటే అయినా పండే పంటలు భిన్నమే కదా. వాటిని ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే రుచీ భిన్నమైనదే. అలాగే ఈ రచయితల ఇతివృత్తమూ, కథన శైలీ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ ఏదో అంతస్సూత్రం మాత్రం వీటిని ఒకే చోట బంధించేలా చేస్తుంది.

పేగుకాలిన వాసన సంపుటి లోని చాలా కథల్లో మధ్య తరగతి జీవితాలను, కోరికలను చిన్నా భిన్నం చేసే ఆకలీ, దానికి మూలమైన దారిద్ర్యం భిన్న రూపాల్లో విలయతాండవం చేస్తుంది. మధ్యతరగతి మనుషులు ఏ విలువలనైతే నమ్ముకుని, ఊపిరనుకుని బతుకుతారో చివరికి ఆ విలువలనే జానెడు పొట్టకోసం అమ్ముకునే, లేదా చేజార్చుకునే పరిస్థితిని నిప్పుబొమ్మ, తెగిపడిన పావురం రెక్కలు అనే కథలు నిరూపిస్తాయి. నిప్పుబొమ్మ  లోని ఆమె (పేరులేదు) మరిదికి అమ్ముడు పోవడాన్ని కొంతవరకైనా సమర్థించగలమేమో కాని తెగిపడిన పావురం రెక్క లో కొన్ని అవసరాలకు భార్యనే పావుగా వాడుకునే శంకరాన్ని సమర్థించలేం. రచయిత కూడా సమర్థించలేదు. అనేక రకాలుగా అనేకులు బతుకుతుంటారు. వారిలో శంకరం ఒకడు. అంతే అని వ్యాఖ్యానించి శంకరం వంటి వ్యక్తులుంటారని తెలియజేస్తారు. ఈ కథలో వనజాక్షి పాత్రమీద కూడా మనకి ప్రత్యేకమైన సానుభూతి కలగదు. ఇంటరు వరకూ చదువుకున్న అమ్మాయి ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు కదా. భర్తకు లొంగవలసిన అవసరం ఏమిటి అన్పించక మానదు. అయితే రచయిత  శంకరం పాత్ర గురించి చెప్పిన మాటలు ఈమెకి కూడా అన్వయించుకుంటే సరిపోతుంది.

మధ్యతరగతి చావు, చేతులు తెగిన హృదయం, శవం వంటి కథలు మరణాన్ని, మానవత్వపు విలువల్నీ కూడా శాసిస్తూ తన చుట్టూ తిప్పుకోగలిగే ధనరాకాసిని నిలువెత్తునా చూపించి భయపెడతాయి.

గాంధీ, గాజు పెంకులు – కథలు చికితిపోయిన నాటక రంగాన్నీ, రంగస్థల నటుల జీవితాల్నీ అద్దం పడతాయి. గాంధీలో నాయకుడికి పేరు లేదు. వేషాలు వేయడం ఇతని కులవృత్తి. పొట్టకూటి కోసం
గాంధీ వేషం కట్టినా నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవడం లేదు. పైగా జాతీయ నాయకుడి వేషం కట్టినందుకు  నాల్రోజులు జైలుకూడు తినవలసి వచ్చింది కూడానూ. కళలకి మూల విరాట్ అయిన శివుడి లాగే జీవనగరళాన్ని గొంతులోనే నిలుపుకొని , శ్మశానం లోనే నివసిస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలుగొందిన నాటకరంగం వెండితెర వెలుగుల్లో ఎలా వెల వెల పోయిందో , ఆ రంగాన్ని నమ్ముకున్న కళాకారుల జీవితాల్లో కళ ఎలా తప్పిపోయిందో  నాయకుడి పాత్ర ద్వారా రచయిత తెలియజేస్తారు ఈ కథలో ఆఖరి వాక్యాలు కథకి ముగింపు కావచ్చునేమో కానీ పాఠకుల బుద్ధి వికసనకు అవే బీజం వేస్తాయి.

రేపటినుండి గాంధీ వేషం కట్టను. నా మనవరాలు పెద్దమనిషయింది. ఈ మూడు మూర్ల గావంచా గుడ్డ దానికి ఇచ్చేసి నేను గోచీ కట్టుకొని మరో వేషం వేస్తాను.....వేమన వేషం.

రంగస్థల కళాకారుల జీవితాల్లోని చీకటి కోణాన్ని అత్యద్భుతంగా చిత్రించిన వాక్యాలివి. ఆర్థికంగా చితికిపోయి ఆసరా కోసం ఆశగా ఎదురుచూసే కళాకారులకు సన్మానాలు చేసి శాలువలూ, కప్పులూ ఇచ్చే బదులు బతకడానికి తోవచూపించి ఆదుకోవడం ఉత్తమమనే సందేశాన్నిస్తుంది గాజుపెంకులు కథ.

చుక్కెదురు, మళ్ళీ ఖాళీ ఆకాశం, అన్నదాతా సుఖీభవ కథలలో కూడా ఆకలీ, దారిద్ర్యమూ  పెద్ద పీట వేసుక్కూర్చుంటాయ్. వివిధ వృత్తులను నమ్ముకున్నా పొట్ట గడవని చితికిన బ్రతుకులు అవన్నీ. సహస్ర వృత్తుల సహస్ర చిహ్నాల్ అని శ్రీశ్రీ చెప్పినట్టుగా శ్రమ శక్తికే  కాకుండా ఆకలీ, దారిద్ర్యానికి చిహ్నాలుగా మారడం ఖేదదాయకం.

పై కథలకు భిన్నంగా మార్నింగ్ గ్లోరీ, పయనించే ఓ చిలుకా, గుండె తోటలో నీలి గోరింట, ఓనమాలు, నొసటి సూరీడు నాన్నంటే, గూడు బండిలో నాన్న, ఉద్ధరిణి మొదలైనవి వేటికవే ప్రత్యేకమైన ఇతి వృత్తంతోనూ, కథల శైలి తోనూ రూపుదిద్దుకొని పాఠకుల గుండె తోటలో నీలి గోరింటలు పూయిస్తాయి.
ఈ కథా సంపుటికంతటికీ తల మానికమైన కథ – పేగు కాలిన వాసన. ఈ కథను రచయిత ఉత్తమ పురుషలో చెప్పారు. వర్షం నాటి రాత్రి జట్కాబండిలో మనని కూచో పెట్టి రచయితే జట్కావాలాగా మారి అలవోకగా కథను ముందుకు నడిపిస్తారు. జట్కాబండి అంత వడిగాను, లయబద్ధంగానూ సాగిపోతుందీ కథ.

పసితనం నుండీ దరిద్రంతో సహవాసం చేసిన ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలనే కోరికతో కుటుంబ బంధాలను తెంపుకుని దూరంగా పారిపోయి జట్కా తోలుకుంటూ ఒంటరిగా బ్రతుకుతుంటాడు. ఒక వర్షం కురిసిన రాత్రి అతని జట్కాలో బొటన వేలు లేని తన తండ్రి లాంటి వ్యక్తి  ఎక్కినపుడు అతని మనసులో రేగిన ఆలోచనలే ఈ కథకు రూపం ఇచ్చాయి.  ఒక్కసారిగా అతనికి గతమంతా కదలినట్టవుతుంది. ఏదో ఒక అవసరం కోసం తండ్రి తన వేళ్ళను యంత్రానికి బలి ఇవ్వడం, అమ్మ అనారోగ్యం, అక్క ఆప్యాయతా, తన బాల్యం అన్నీ కళ్ళముందు మెదలడంతో  వారిని ఎలా అయినా చూడాలనే  కోరిక  బలంగా వేళ్ళూను కుంటుంది. దరిద్రాన్ని అసహ్యించుకునో లేక భయపడో పారిపోయిన అతను ఈ పదేళ్ళనూ సాధించినదేమీ లేదు. మరికొంత దరిద్రాన్ని తప్ప.
నా అన్న వారిని చేజేతులా దూరం చేసుకొని దారిద్ర్య సాగరాన్ని ఒంటరిగా ఈదలేక ఉక్కిరి బిక్కిరి అవడం తప్ప . అందుకే చివరికి అనుకుంటాడతను

దేనికి దూరంగా పారిపోదలచానో అది నాకు సాధ్యం కాలేదు. ఎల్లెడలా ఒకే దృశ్యం ఒకే జీవితం. రాకాసి లోయ అంతటా వ్యాపించి ఉంది. క్రూర మృగాలు, మారణాయుధాలు, మంత్ర తంత్రాలు నాలాంటి కుటుంబీకుల కోసమే పొంచి ఉన్నాయనిపించింది. నా వాళ్ళను నేను రక్షించుకోవాలి. అందుకు సన్నధ్ధం కావాలి.
ఆకలీ దరిద్రం ఎక్కడ లేవు. దరిద్రాన్ని చూసి భయపడడం కన్నా దరిద్రం మరోకటి లేదు. జీవితాన్ని ధైర్యంగా  ఎదుర్కోవాలి గానీ బంధాలను తెంచుకుని పారి పోవడం అనుచితం.... అనే గొప్ప స్ఫూర్తిని ఈ కథ అందిస్తుంది. అద్భుతమైన కథన శైలీ, నిర్మాణ శిల్పమూ ఉన్న విలువైన కథ యిది.

సుమారు 500 కథలు రాసి లబ్ధ ప్రతిష్ఠులయిన ఎ.ఎన్. జగన్నాథ శర్మ గారి కథానిర్మాణ శైలి గురించి గానీ, పదప్రయోగం, వాక్య విన్యాసం వంటి విషయాలను గురించి చెప్పడం సూర్యుడి ముందు దివిటీ పట్టడం లాంటిది. ఉత్తరాంధ్ర గర్వించ దగ్గ అతికొద్ది గొప్ప కథకుల్లో వారు ఒకరు. ఉత్తరాంధ్ర మాండలికపు నాడిని అతి వాడిగా పట్టుకోగలిగిన రచయితగా ఈ సంపుటిలోని శవం కథ ద్వారా మరోసారి నిరూపించుకోగలిగేరు. జాబిల్లి నుండి వెన్నెల జాలువారినంత అలవోకగా కథక చంద్రుడి కలం నుండి కథా చంద్రికలు జాలువారతాయి. వెన్నెల్లో ఉండే స్వచ్ఛతా, సారళ్యమూ, సౌందర్యమూ వీరి కథల్లో నిబిడీ కృతమై ఉంటాయి. కానీ ఈ వెన్నెల మనసుకి మత్తెక్కించి జోలపాడి నిద్రపుచ్చే వెన్నెల కాదు. నిద్రాణమై ఉన్న  జగతిని జాగృత పరిచే వెన్నెల. జీవితపు  చీకటి కోణాలను కూడా దర్శించి ఆ చీకట్లను తొలగించడానికి ప్రయత్నించే పదునైన వెన్నెల. గుండెలను చీల్చే కత్తి వాదర లాంటి 
వెన్నెల.
ఈ కథా చంద్రికలను సాహితీ ప్రియులందరూ ఆస్వాదించి తీరవలసిందే. మంచి మనసున్న ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీరవలసిందే.

Thursday, January 6, 2011

వంటింటి విష(య)ములు



కన్యాశుల్కం (సినిమా)లో  గిరీశం వెంకటేశాన్నడుగుతాడు ,బుచ్చమ్మని చూస్తూ.
“ఈ ప్రపంచకంలో ఏముండునూ?” అని.
‘విడోస్’ అని వెంకటేశంతో చెప్పించాలని అతని ఉద్దేశం.
కానీ వెంకటేశం ‘చేగోడీలు’ అంటాడు ఇంతలేసి కళ్ళతో ఎదురుగా కనిపించిన వస్తువుని ఆశగా చూసి.
ఒకవేళ మీరూ గిరీశంలాగే మీ పిల్లల్ని “వంటింట్లో ఏముండునూ” అని అడిగేరనుకుందాం.
పోపుల డబ్బా, గ్యాస్ పొయ్యి, గ్రైండరూ అని చెప్తారని మీ ఉద్దేశం. కానీ అమ్మ జడతోనో, బామ్మ ఒళ్ళోనో  ఆడుకుంటూ, ఠీవిగా టీవీ సీరియల్స్ చూసే పిల్లలైతే ఏం చెప్తారో మీకు తెలుసా?
చిన్న క్విజ్. చెప్పుకోండి చూద్దాం.
‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్టు సీరియల్స్ చూసే పిల్లల తల్లులైతే ఠక్కున చెప్పేస్తార్లెండి.
కానీ సీరియల్స్ చూడని, లేదా చూడలేని, లేదా చూడకూడదని భీష్మించుకున్న అభాగినుల కోసం
ఆ సమాధానం చెప్పేస్తున్నా.
చెప్పకుండా సస్పెన్సుతో చంపడానికి నేనేమైనా సీరియల్ కిల్లర్ నా.

‘పాయిజన్ అండీ బాబూ. స్పెల్లింగ్ తో సహా రాసుంటుందండీ.... ఒట్టు!!(ఒకటోసారి)
ఏవిటీ...పాయిజన్ అనగానే పక్కలో పాయిజన్ సీసా పగిలినట్టనిపిస్తోందా?!
లేక ఈ కలభాషిణికి మరీ తోస్తున్నట్టులేదు. హాయిగా కలలు కంటూ కూర్చోకుండా ఈ కలవరింతలూ, కట్టుకథలూ ఏవిటీ అనిపిస్తోందా.
ఇది కట్టుకథ మాత్రం కాదండీ.
ఒట్టు (రెండోసారి)కావాలంటే మీరూ చూడండి సీ.....రియల్.
అన్నింటా కాకపోయినా నాల్గింట మూడొంతుల సీరియల్స్ లో ఉప్పు, పంచదార వంటి వంటావసర వస్తువులతో పాటు దర్జాగా ఓ అందమైన గాజు సీసాలో తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుందది.
సరే. దాన్ని పక్కన పెడదాం.
మరో చిన్న క్విజ్ పెట్టనా?
మీరు కాఫీ గానీ, టీ గానీ, అథవా పాలో, పాయసవో గానీ తయారు చేస్తే ఏం కలుపుతారు?
పంచదార....
ఏడిసినట్టుంది. ఇది కూడా క్విజ్జేనా అని విసుక్కుంటే మీరు పప్పులో కాలేసినట్టే.


పోనీ మరో ఛాన్సిస్తాను. ఆలోచించండి చూద్దాం.
ఏముందీ ?
మొగుడు మరీ ముద్దొచ్చి సరసాలాడాలనిపిస్తేనో లేదా మేనబావతో మేలమాడాలనిపిస్తేనో,
ఇంటికి కొత్తల్లుడొస్తేనో పంచదారకి బదులుగా సరదాగా ఉప్పో, మిరప్పొడో కలుపుతాం అనచ్చు.
అలా అంటే కూడా మళ్ళీ తప్పులో కాలేసినట్టే.

మీకు తెలుసునో లేదో గానీ సీరియల్స్ లో మాత్రం అత్తలకి, కోడళ్ళమీద గానీ, కోడళ్ళకి తోడికోడళ్ళమీద గానీ కోపం వస్తే ఎంచక్కా పంచదార  బదులుగా పక్కనే ఉన్న పాయిజన్ ని కలిపేస్తారు. ఒట్టు(ముచ్చటగా మూడోసారి)
ఆ తర్వాత విషం కలిపిన పదార్ధాన్ని బలిపశువుతో తాగించడానికి తేనెపూసిన కత్తుల్లా,
క్లోజప్ లో పువ్వుల నవ్వులు రువ్వుతూ వంటింటి గుమ్మంలోంచి అవతలికి అడుగు పెడతారు.

అయితే ఇలా గుమ్మం దాటిన వాళ్ళు బలిపశువుల గుమ్మం చేరడానికి ఒక్కోసారి ఒక రోజుగానీ లేదా ఒక వారం గానీ పట్టచ్చు.
ఆ విషయం అది డైలీ సీరియలా లేక వీక్లీ సీరియలా అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.
అయ్యో!! ఈ విష పదార్థాన్ని అవతలి వాళ్ళు తాగితే ఏమై పోతారో, అసలు తాగారో లేదో అన్నది మాత్రం తేలకుండా హారిబుల్ సస్పెన్స్ లో ఉండిపోతుంది, కొంతకాలం పాటు.
ఆ రహస్యం తెలిసినా నేను విప్పనండీ....ఎందుకంటే ప్రస్తుతం ఈ చర్చ వంటింటి విష(య)ములకే పరిమితం కాబట్టి.

ఎంతైనా లావుపాటి పిన్నిగార్లు కదండీ. ఈ గుమ్మం నుండి ఆ గుమ్మం చేరడానికి ఆ పాటి సమయం పట్టదుటండీ. మీరూ, మీ ఆత్రమూనూ అని ఆ సదరు సీరియల్ దారులు ప్రేక్షకులకి కితకితలు పెట్టి ఊరుకో పెట్టేస్తారు.
భారీ సీరియల్సూ, అతి భారీ తారాగణమూనా....మజాకానా...
సాధారణంగా ఇలాంటి సీరియళ్ళలో అసలు బలిపశువుని బలి కానీయకుండా మరో బలిపశువు తప్పకుండా అడ్డుకుంటుంది. (అచ్చం మన నిజం సినిమాల్లోలాగే).
అది ఇంటి కుక్కో (కుక్క అండీ...వంటవాడు కాదు) లేక మింటి పిల్లో.
(ఎవరూ పెంచక పోయినా సరిగ్గా బలి కావడానికే వచ్చిన బలి దేవతలా మింటినుండి గెంతి వస్తుంది ఇది). కొండొకచో తరతరాలుగా ఆ ఇంటినే నమ్ముకుని ఉండే విశ్వాసం గల కుక్కల్లాంటి రామయ్యో లేక సీతమ్మో.

ఇంతకీ మన బలిపశువుని రక్షించడానికి వచ్చిన మరొక బలిపశువు ఏది??
లేక ఎవరు??
ఇంటి కుక్కా ….
మింటి పిల్లా…….
రామయ్యా....
సీతమ్మా....
క్రూరమృగాల్లాంటి లేడీ కిల్లర్స్ నుండి లేడి పిల్లలాంటి లేడీ ఎలా తప్పించుకుంది?ఇలా ఎన్నిసార్లు తప్పించుకుంది? తప్పించుకొని ఆ కిల్లర్స్ కి ఎలా బుద్ధి చెప్పింది?!
చూసారా .... కథ వింటుంటేనే క్లైమాక్స్ తెలుసుకోవాలని ఎంత ఆసక్తి కలుగుతోందో మీలో.
మరి ఇక చూస్తే... ఇంకేమైపోతారో.
ఏమైపోతారూ? సీ(రియల్)రియస్ ప్రేక్షకులైపోతారు
కానీ... ఈ విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఒకటో రెండో ....
అమ్మా... ఆశ !! వారాలో నెలలో అనుకుంటున్నారేమో.
సంవత్సరాలండీ బాబూ.
అక్షరాలా... సం....వత్సరాలు... నిరీక్షించవలసి ఉంటుంది- సహనంతో.
సహనం స్త్రీకి ఆభరణం అన్నారు కదండీ. ఈ ఆభరణాన్నే నమ్మి మన సీరియల్ స్పాన్సరర్లు, డైరెక్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఇంకా సహన వంతులైతే పైన అక్షరాల్లో చెప్పబడిన ఒకటో, రెండోను అంకెల్లో పక్క పక్కనే రాసి చూసి 12 సంవత్సరాలుగా సాగదీయవచ్చు.
ఆ తర్వాత 12 సంవత్సరాల నిడివి గల సుదీర్ఘ సీరియల్ చూసిన ఉత్తమ ప్రేక్షకురాలిగా “సహనశ్రీ” కిరీటం కూడా పొందవచ్చు.
విష్యూ గుడ్ లక్.
శుభం భూయాత్.
హెచ్చరిక/ సవాల్.
సోదరీ!!
చదువరీ!!
నీవు పరిపూర్ణ స్త్రీ వియా? ఒక్క ఎపిసోడూ మిస్సవకుండా టీవీ సీరియల్ చూసే సహనం నీలో ఉన్నదా? ఒకవేళ ఉండిననూ కూడా సీరియల్ చూడని యడల….విక్రమార్కురాలి వలె నీ శిరస్సు  వెయ్యి వ్రక్కలగును గాక!!
(ఒక వేళ చూసినా అవుతుందనుకోండి. అది వేరే సంగతి మాత్రం కాదు. అదే అసలు సంగతి).
Related Posts with Thumbnails