Sunday, October 2, 2011

తెలుగు సాహితీ పథంలో "అలుపెరుగని బాటసారి"



ఆధునిక భావాలతో సంప్రదాయ రీతిలో ఉత్తమ రచనలు చేసినవారిలో గుఱ్ఱం జాషువా ప్రథమ గణ్యులు. ఆధునిక మహా కవులలో విశిష్టస్థానం పొందిన జాషువా లెక్కలేనన్ని సన్మానాలు, ప్రశంసలూ పొందారు.
1895 లో వినుకొండలో వీరయ్య, లింగమాంబలకు జన్మించిన జాషువా విశ్వ నరుడిగా ఎదిగారు. వారిది విశ్వమానవ గోత్రం. ఆనాటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న  అంటరానితనం  అనే పెను భూతాన్ని రూపుమాపడానికి తన వాడి కలాన్నే ఆయుధంగా వాడిన కవి వీరుడు జాషువా.

జాషువా జీవితాన్ని కవిత్వాన్ని విడదీసి చూడలేం. జీవితంలో తాను పొందిన అనుభూతుల యొక్క ఆవేదన యొక్క వ్యక్తీకరణమే అతని కవిత్వంగా రూపొందింది. అస్పృశ్యతా నివారణ, మూఢాచార ఖండన, పేదల పట్ల సానుభూతి, అభ్యుదయ కాంక్ష, జాతీయ దృష్టి జాషువా కవిత్వంలో ప్రధానంగా కనిపించే అంశాలు. అరుంధతీ సుతుడు గా తాను పొందిన ఆవేదనే గబ్బిలమనే కరుణ రసాత్మక కావ్యంగా రూపుదాల్చింది. తన జీవితంలో పొందిన అనుభూతులను, మానావమానాలను, నా కథ (ఆత్మకథ) గా ఆవిష్కరించారు. నాగార్జున సాగర్, ముంటాజ మహల్, బాపూజీ, నేతాజీ  మొదలయినవి వీరి ఇతర ఖండకావ్యాలు. శ్మశాన వాటిక, శిశువు, గిజిగాడు  మొదలయినవి కవితాఖండికలు.

జాషువా వారి పేరు తలచుకోగానే మనకు స్ఫురణకు వచ్చేవి గబ్బిలము, శిశువు, స్మశాన వాటిక మొదలయినవి. ముఖ్యంగా గబ్బిలం కావ్యాన్ని జాషువాని వేరు చేసి చూడలేం. అంతగా ఆ కావ్యంతో ముడి పడిపోయింది వారి జీవితం. జాషువా వారి కావ్యాలలో ముసాఫరులు కావ్యం గురించి తెలిసిన వారు చాలా అరుదు. ఆ పేరు విని ఉండవచ్చు కానీ దాని గురించి చదివినవారు గానీ, పరిచయం ఉన్నవారు గానీ తక్కువ.
జాషువా వయసు మీరిన తరువాత రాసిన కావ్యం. ఇది. నిజానికి ఇది చాలా అద్భుతమైన కల్పనతో కూడిన కథ. రెండు ఆత్మల సంభాషణ ఈ కావ్యం. ఇది కవి స్వకపోల సృష్టి. ఇందులో మాతృక కథ, ఆంధ్రదేశము, నా జననము, యోధుడుఅనే శీర్షికలున్నాయి. ముసాఫరులు అంటే బాటసారులు అని అర్థం.
కథా కాలం నాటికి భారతదేశానికీ చైనాకీ మధ్య సరిహద్దు విషయంలో యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో భారత వీరుడు ప్రాణాలు కోల్పోయి వీరమరణం పొందాడు. స్వర్గానికి ప్రయాణిస్తూ అతని ఆత్మ మేఘ మండలాన్ని దాటి నక్షత్రమండలం లోని (తారానాథాంతిక సీమ) ఒక సత్రం లో విడిది చేసి అలసట తీర్చుకుంటోంది. అదే సమయంలో స్వర్గలోకం నుండి భూలోకానికి ఒక ఆత్మ పయనిస్తూ ఈ సత్రంలోనే విడిది చేసింది. ఇహ పరాలకు ప్రయాణించే రెండు ఆత్మల సమావేశమే ఈ కావ్యంలోని ఇతివృత్తం. ఈ రెండు ఆత్మలు కుశల ప్రశ్నలు వేసుకున్న తరువాత తమ లోకంలోని విశేషాలను తీరుతెన్నులను ముచ్చటించుకుంటాయి. దేవలోకం ఆత్మ వేసిన ప్రశ్నలకు భూలోక వీరుడి ఆత్మ ఇచ్చే జవాబుల ద్వారా జాషువా ప్రపంచ తీరు తెన్నులను, వివిధ మానవ మనస్తత్వాలను అత్యద్భుతంగా ఆవిష్కరిస్తారు.

విశ్వమానవ గోత్రేయ వీరులైన  
కవులకున్ కర్మబంధంబు కట్టబెట్టి
పులుముచుందురు తలమీద కులమురంగు
తొలగి పోవదు లక్ష సబ్బులకు గూడ.
విశ్వనరులుగా భావించబడే కవులకు కూడా కులం  అనే రంగును ఈ లోకపు జనులు పులుముతారుట. ఆ కులం అనే రంగు తొలగి పోవదు లక్ష సబ్బులకు కూడా, అంటారు.

మానవ లోకంలో కులపిచ్చి ఎంత ముదిరిపోయిందో, విశ్వనరులైన కవులను అది ఎంత బాధిస్తుందో దీని ద్వారా వ్యక్తమవుతుంది. కవులు కులమతాలకు అతీతులనే విషయాన్ని మనం గ్రహించాలి.
మానవులకొక ముసాఫరు
 ఖానా ఈ భువనంబు కొంతకాలము తనువుం
బూని  వసించి యనంతర
యానమున కుపక్రమింతురనవతరంబున్.
మానవులకు ఈ లోకం ఒక సత్రం లాంటిదట. కొంతకాలం శరీరాన్ని ధరించి, జీవించి, మరల ప్రయాణానికి ఉపక్రమిస్తారట. చావు పుట్టుకలు శరీరానికే గాని ఆత్మకు కాదని ఈ ప్రయాణం అనంతమనీ కవి తెలియజేస్తారు.
మంచివాడొక్క తెగకు దుర్మార్గుడగును
దుష్టుడొక వర్గమున మహా శిష్టుడగును
ఒక్కడౌనన్న కాదనునొక్కరుండు
బుఱ్ఱలన్నియు నొకమారు వెఱ్ఱివగును

లోకో భిన్నరుచి అన్నట్టుగా ఒక్కొక్కరూ ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఒక వర్గానికి మంచి వాడైన వాడు వేరొక వర్గానికి దుర్మార్గుడు కావచ్చు. అలాగే ఒక వర్గానికి దుర్మార్గుడైన వాడు మరొక వర్గానికి సన్మార్గుడు కావచ్చు. ఒకడు అవునంటే ఒకడు కాదంటాడు. పరస్పర భిన్నమైన అభిప్రాయాలలో బుర్రలన్నియు నొకమారు వెఱ్ఱివగును అంటారు జాషువ. లోక ప్రజలలో ఐకమత్యం కొరవడుతోందని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించకపోవడం వల్లే లోకంలో ఇంత అశాంతి, అంతఃకలహాలు ఉన్నాయని జాషువ అంటారు.
 ధర్మమును సత్యమను పదార్థములు రెండు
 కలవు దొరకవు నీకు నంగళ్ళయందు
నిత్యము లభించు రత్న మాణిక్యమణులు
అనుగమింపవు నిన్ను దేహాంతరమున.
ఈ లోకంలో  ధర్మం, సత్యం అనే రెండు పదార్థాలు, కొనాలంటే అంగట్లో దొరకవు. నిత్యం మనిషితో ఉండే రత్న మాణిక్యాలు మనిషి పోయిన తర్వాత వెంటరావు. 
ఈ పద్యం చదవగానే ఎవరికైనా చటుక్కున పోతన వారి పద్యం కారే రాజుల్ రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే. వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే గుర్తుకు రాక మానదు. భావ స్వారూప్యం ఉండడం తప్పు కాదు కదా. ఒకే భావాన్ని చెప్పినా ఎవరి శైలివారిదే.  ఎవరి గొప్పదనం వారిదే.
అరిషడ్వర్గాలలో లోభ గుణం ఒకటి. లోభి గురించి ఎందరో కవులు ఎన్నో రకాలుగా చెప్పారు. జాషువా ఎలా చెప్తారో చూడండి.
ధనమార్జింతురు దాతురు
తినరేరికి బెట్టరింత తిరిపంబు మహా
ధనికులు కొందరు వారిం
కనుగొనుచు మృత్యువంతికంబున నవ్వున్.
కొందరు ధనం సంపాదిస్తారు. దాస్తారు. కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. ఇలాంటి వారిని చూస్తూ వారి ప్రక్కనే మృత్యువు చేరి నవ్వుతూ ఉంటుంది. ధనము శాశ్వతం కాదని మృత్యువుతో చిరునవ్వు నవ్వించి తేల్చి చెప్పేస్తారు జాషువా. ఎంత గొప్ప భావమో.

ఇంటనున్న ద్రవ్యమెరువు గుట్టను బోలు
వ్యాప్తి జెందెనేని ఫలము నిచ్చు
పారుచున్న నీరు పంటలు పండించు
పారకున్న నీరు ప్రాచి బట్టు
రువు కుప్ప ఒకచోటే ఉంటేకంపు కొడుతుంది. అది పొలంలో చల్లబడినప్పుడే నేల సారవంతమవుతుంది. అలాగే పారని నీరు పాచి పడుతుంది. పారే నీరే పంటల్ని పండిస్తుంది. ఇంట్లో దాచి పెట్టబడిన సొమ్ము ఊరికే పడి ఉన్న ఎరువు కుప్పలాగా, పారని నీరులాగా ఎవరికీ ఉపయోగ పడదు కాబట్టి  దాన గుణాన్ని పెంచుకొని జీవితం సార్థకం చేసుకోమని కవి ఉపదేశం.
ఈ తనువు విడిచి నరుడొక 
భూతంబై తిరుగునని యభూత కథలతో 
భీతిం గొల్పెడు మాంత్రిక 
జాతి యొకటి గల్గు నుర్వి స్వార్థ పరంబై. 
 
అలాగే కొందరు మంత్రగాళ్ళు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని, చనిపోయిన మనిషి  దయ్యమవుతాడని, పట్టి పీడిస్తాడని కట్టుకథలు ప్రచారం చేస్తూ ఉంటారని, అలాంటివాళ్ళ మాటలని నమ్మవద్దంటారు జాషువా. వేదాంతం చెపుతూ తోటివాడికి సహాయం చెయ్యని మానవుల గురించి  పెట్టడింత కబళమున్ అంటూ చురక వేస్తారు. మానవత్వాన్ని పెంచుకోవడం, దయా స్వభావం కలిగి ఉండడం ముఖ్యమని ఇటువంటి మానవతా దృక్ఫథాన్ని పెంచే బోధలే ఉండాలని జాషువా ఉద్దేశం.
పసితనము నందు హృదయము
కుసుమము వలె పరిమళించు గుణగణములు నిం
పెసలారు చుండు నాదశ
ముసలి తనంబునను గల్గ ముక్తి ఘటించున్.
మానవుడు బాల్యంలో చాలా నిష్కపటంగా ఉంటాడు. పువ్వలాగా పరిమళాన్ని వెదజల్లుతుంది అతని హృదయం. రాను రానూ స్వార్థ పరుడైపోతూ ఉంటాడు. బాల్యంలో ఉన్న కల్మష రహితమైన స్థితి వార్థక్యంలో కూడా పొందగలిగితే మోక్షం వస్తుందంటారు జాషువా.

కొమరులకోసమై భరతగో రమణీమణి పిండుచున్న క్షీ
రము పరరాజ ధూర్తులకు ప్రాప్తముగాదిక చీని రాజ్యమే
ఘము హిమశైల భూముల నకారణగర్జలు సల్పసాగె ద
ర్పముగల భారత ప్రళయ వాయుహతిం దుమురై నశించెడిన్

భారతదేశమనే గోవు  పిండుతున్న పాలు భారతీయులకే తప్ప విదేశీయులకు లభించవు. చైనా రాజ్యమనే మేఘం అకారణంగా మంచుకొండల్లో గర్జిస్తోంది. భారతవీరుల ప్రతాపం అనే గాలి వేగానికి  ఆ మేఘం చెల్లాచెదురైపోతుంది. శత్రువు యొక్క గుండెలు చీల్చి  వేడి రక్తాన్ని ఆపోసన పట్టగలిగే వీర సింహాలు భారతావనిలో అగణితంగా ఉన్నాయంటూ భారతవీరుల  ధైర్యసాహసాలను ప్రశంసిస్తారు కవి.
భారత దేశాన్ని గోవుతో పోలుస్తూ ఆ ఆవు పాలు భారతీయులకే దక్కుతాయి అనే సందర్భంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి భరతఖండము చక్కని పాడియావు  అనే పద్యం గుర్తురాక మానదు
ఒక త్యాగమూర్తి ప్రేమకు పాదులొనరించి  
                         స్వీయ రక్తమును వర్షించినాడు
ఒక మహాత్ముండు స్వేచ్ఛకు ప్రాణమర్చించి
                            మై మీద బట్టతో బ్రతికినాడు
ఒక రాచవాడహింసకు సర్వరాజ్యంబు
                           విడనాడి భిక్షకు నడచినాడు
ఒకడు ఖొరాను వ్యాప్తికి దేశదేశాల
                              తలదాచుకొని దీక్ష నిలిపినాడు
వారి దివ్యాత్మ లుభయ ప్రపంచములకు
జ్యోతులై ప్రజ్వలించు నచ్యుతములగుచు
వారి పగవారు మృత్యుగర్భమును జొచ్చి
భస్మమైనారు నామ రూపములు లేక

అనే పద్యంలో ఏసుక్రీస్తు, గాంధీ, బుద్ధుడు, మహమ్మదు ప్రవక్త ల మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తారు కవి.
ఏసుక్రీస్తు స్వీయరక్తాన్ని ధారపోసి ప్రేమకు పాదులు తీసాడు. గాంధీ ఒంటిమీద బట్టతోనే బతికి, స్వేచ్ఛ కోసం ప్రాణాన్ని అర్పించాడు. బుద్ధుడు అహింసకోసం సమస్త రాజ్యాన్ని వదిలిపెట్టాడు. ప్రవక్త ఖురాను వ్యాప్తికి దేశ దేశాలన్నీ తిరిగాడు. ఈ మహనీయుల దివ్యమైన ఆత్మలు ఇహ పర లోకాల్లో జ్యోతులై ప్రకాశిస్తూ ఉండగా వారిని అంతం చేయడానికి ప్రయత్నించిన వారు మాత్రం నామరూపాలు లేకుండా భస్మమైపోయారు. నిస్వార్థ గుణానికి త్యాగానికి ప్రేమకు ఎప్పుడూ శాశ్వతమైన స్థానం ఉంటుందని వాటిని అంతం చెయ్యాలనుకున్నవారే నామరూపాలు లేకుండా అంతరించక తప్పదని కవిభావం. 
భువనంబొక  రణరంగము
కవియుం దినదినము నైహికపు టిచ్చలు మం
చివియుం జెడ్డవి విజయం
బవసర మీనాడు ధీరులగు మర్త్యులకున్
ఈ లోకమే ఒక యుద్ధరంగం లాంటిది. మంచి చెడుల మధ్య ఎప్పుడూ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ధైర్యంతో పోరాడే మానవులకు తప్పక విజయం లభిస్తుంది. 
కోటానుకోట్లు నరులొక
మేటి జగన్మాతృ సుతులు మిత్రులని మదిం
బాటింపు మీ సువార్తన్
జాటింపుము జీవితంబు సార్థక్యమగున్
ఈ లోకంలో ఉన్నవారందరూ ఒకే తల్లి బిడ్డలు అనే భావాన్ని ప్రచారం చెయ్యి. నీ జన్మ ధన్యమవుతుంది. అని భూలోకపు ఆత్మ ద్వారా పలికిస్తారు జాషువా. దీనిద్వారా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షిస్తారు. 

ముసాఫర్లు కావ్యం జాషువా కల్పనకు, లోకజ్ఞతకు, విభిన్న మానవ మనస్తత్వ్త చిత్రణకు ఒక అద్భుత ఆవిష్కరణ. ఈ లోకంలో మానవుడు చిరంజీవిగా ఉన్నంతకాలం ముసార్లుఫ కావ్యం కూడా చిరంజీవిగా నిలుస్తుంది. జాషువా వారిని కూడా కవిగా చిరంజీవులుగా నిలబెడుతుంది. 
లెక్కకు మించిన అనర్ఘ రత్నాల వంటి ఖండ కావ్యాలనూ, కవితా కన్యకలనూ అందించిన జాషువా తెలుగు సాహితీ పథంలో అలుపెరుగని ముసాఫర్.

No comments:

Post a Comment

మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి...

Related Posts with Thumbnails