Friday, August 13, 2010

వదల బొమ్మాళీ....వదల.

ఈమధ్య బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇది. అరుంధతి సినిమా రిలీజయ్యాక అందరి నోటా ఇదే మాట. అయితే చాలామందికి ఈ బొమ్మాళి పేరిట శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్రామాలున్నాయని తెలియకపోవచ్చు. వినడానికి తమాషాగా అనిపించినా ఇది నిజం. వాటి పేర్లు కోట బొమ్మాళి, సంత బొమ్మాళి . ఇవి ప్రత్యేక మండలాలు కూడా.

కోట ఉన్న ఊరు కాబట్టి కోటబొమ్మాళి, సంత జరిగే ఊరు కాబట్టి సంత బొమ్మాళి అయి ఉంటుందని అని ఎవరైనా ఊహించవచ్చు. కానీ అసలు బొమ్మాళీ అంటే?
అరుంధతి లో బొమ్మాళీకి దీనికి ఏమేనా సంబంధం ఉందా అనుకుంటున్నారా. అబ్బే. బొత్తిగా సంబంధం లేదు. సినిమాలో అందమైన బొమ్మలాంటి అమ్మాయి అనే అర్ధంలో రచయిత కాయిన్ చేసిన మాట అది.
కానీ ఈ బొమ్మాళీ కథ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది.

కోట బొమ్మాళి అసలు పేరు వనమాలి కోట. టెక్కలి వంశ రాజుల్లో ఒకడైన వనమాలి తన పేరిట వనమాలి కోట అనే గ్రామాన్ని నిర్మించాడు. అది కాలక్రమంలో కోట వనమాలి అయింది. ఒరియా భాషలో వకారం బకారం అవుతుంది కాబట్టి వనమాలి బనమాలి గామారి ఉచ్చారణ సౌలభ్యం కోసం బొమ్మాళి అయింది.

కళింగ దేశ చరిత్ర ( రాళ్ళబండి సుబ్బారావు, 1930 ) గ్రంథంలో టెక్కలి రాజ వంశస్థులయిన శ్రీ లక్ష్మీనారాయణ హరిచందన జగద్దేవు రచించిన టెక్కలి కాదంబ రాజుల వంశేతిహాసము అనే వ్యాసంలో ఈ వివరాలు పొందు పరచబడ్డాయి.ఆ వ్యాసం ఆధారంగా వనమాలి చరిత్ర చూడండి.

పద్మనాభుడు అనే టెక్కలి రాజుకు వీరభద్రుడు, చంద్రశేఖరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరభద్రుడు వీరభద్రుడై ప్రస్తుతం కోట బొమ్మాళి అని పిలవబడే కోటబొమ్మాళి సముద్ర తీర ప్రదేశాన్ని ఆక్రమించి పాలించాడు. అప్పటి ఉత్కళ రాజు వీరభద్రుడి విజయ క్రీడలకు శ్లాఘిస్తూ బోడోజన్మ అనే బిరుదు ఇచ్చి ఆ ప్రాంతానికే కాక జుల్మూరి కోటకుకూడా అధికారిగా చేసాడు.. చంద్రశేఖరుడు వారసత్వంగా వచ్చిన టెక్కలి రాజ్యానికి రాజయ్యాడు. 
ఇతను తన సోదరపుత్రుడైన వనమాలిని టెక్కలిలో కాలు మోపకుండా
చేసాడు. వనమాలి తన తండ్రి వశపరచుకున్న ప్రదేశంలో తన పేరిట ఒక గ్రామాన్ని నిర్మించాడు. అది వనమాలి కోట అని పిలవబడుతూ  కాలక్రమంలో కోట వనమాలి అయింది. వకారం ఉత్కళ (ఒరియా) భాషలో బకారం అవుతుంది కాబట్టి వనమాలి బనమాలి అయి ఉచ్చారణ సౌలభ్యంకోసం బొమ్మాళి అయింది.

చంద్రశేఖరుడు వనమాలిని తన జోలికి రాకుండా బొమ్మాళి రాజ్యానికి, తన రాజ్యానికి మధ్య సరిహద్దులలో ఒక గ్రామంలో త్రిలింగ దేశపు సర్దారును కాపలా పెట్టారు. ఆ గ్రామం ఇప్పుడు తిర్లంగి (త్రిలింగ) అని వ్యవహరించబడుతోంది. ఆ తర్వాత ముసల్మానులు విప్లవకారులై కోట బొమ్మాళిని ఆక్రమించారు. ఈ మహమ్మదీయులే పాత టెక్కలిని స్వాధీన పరచుకుని తురకల కోటని కట్టి నివసించారు. కోటబొమ్మాళికి సమీపంలో అగ్బరుపూరు ( నేటి అక్కవరం ) గ్రామాన్ని కూడా నిర్మించి నివసించారు. చంద్రశేఖర జగద్దేవుడు మహమ్మదీయులను తరిమికొట్టి పర్వత మధ్యలో దుర్భేధ్యంగా చింతామణి కోటను కట్టించాడు.

టెక్కలి రాజయిన వనమాలి పేరిట ఈ రెండు గ్రామాలే కాకుండా కంచిలి మండల పరిధిలో బొనమాలి పేరుతో మరొక గ్రామం కూడా ఉంది. ఒరియా వారిలో బనమాలి (వనమాలి-విష్ణుమూర్తి) పేరు వ్యక్తినామంగా విరివిగా కనిపిస్తుంది.

ఇదండీ బొమ్మాళి కథ. బావుంది కదూ.

5 comments:

  1. బొమ్మాళీ పదం ఎంతగా పాప్యలర్ అయిందో మీ టపా కూడా అంతగా ప్రసిద్ధి చెందుగాక !

    కోట బొమ్మాళి , సంత బొమ్మాళి , బనమాలి ... ఈ ఊర్ల పేర్లు నేనెరిగినవే. మొదటి రెండింటినీ చూసాను కూడా. బనమాలి గురించి ఇప్పుడే వినడం.

    మీ పరిశోధన అద్భుతం. అభిందనలు.
    ఇక మీ బ్లాగును చూడడం వదల బొమ్మాళీ, వదల.

    ReplyDelete
  2. చాలా బాగుంది 'కలభాషిణి ' గారు. మీకు స్వాతాంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. రాధారాణి,
    మీ వదల బొమ్మాళి వదల ఆసక్తికరంగా వుంది.
    మీ ప్రయత్నం బహుధా ప్రశంసనీయం.
    మున్ముందు మరిన్ని విజ్ఞానదాయకమైన శీర్షికలకోసం ఎదురుచూస్తాను.
    అభినందనలు.

    ReplyDelete
  4. అవునా....నిజమేనా....చాలా ఇంటెరెస్టింగ్

    ReplyDelete
  5. akka..innirojulaki nee blogs anni chadivagaliganu..chala chala bavunnayi.ammato chadivinchaava..savi3 meeda baga raasavu.photos anni bavunnayi.sikkolu gurinchi baga vachindi.mari i am very proud of u keep it up..inka enno manchi topics meeda marinni blogs raasi mammallni alaristaavani eduruchoostunnanu..kals

    ReplyDelete

మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి...

Related Posts with Thumbnails