Thursday, March 17, 2011

ఆయనకిద్దరు..... !! ఇంకో ఆయనకి..... ??


ఆయనకిద్దరు..... !!
ఇంకో ఆయనకి..... ??

అనగనగా ఒక రాజుగారు. ఆయనకిద్దరు భార్యలు. ఒకరు మంచి. ఒకరు చెడ్డ. (రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదే కదా).
 
 రాజు గారికి మంచి భార్య అంటే కొంచెం ప్రేమ ఎక్కువ. చెడ్డ భార్యకి మంచి భార్యను చూస్తే  కొంచెం  కోపం ఎక్కువ.

మం.భా ని చంపడానికి, రాజుగారికి ఆమెపై ద్వేషాన్ని కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది చె.భా. కానీ ఎంచేతనో అవి ఫలించవు. ఇలా ఉండగా ఓ మంచి (? ) ముహూర్తాన మం.భా ఓ మంచి బిడ్డను కంటుంది. అది చె. భా. కి మరీ కంటగింపవుతుంది. అంతే. తన డబ్బూ, పలుకుబడీ ఉపయోగించి శకునిలాంటి సోదరుడి తోనో, మంధర లాంటి పనిమనిషి తోనో మంచి బిడ్డను కిడ్నాప్ చేయిస్తుంది. ఆ బిడ్డను చంపడానికి ఆమె చేయించిన ప్రయత్నాలు కూడా ( దైవానుగ్రహం మంచి పట్ల ఉండడం చేత కాబోలు) అవి వ్యర్థమైపోతాయి. అయితే చె.భా చేసే దుష్ట యత్నాలేవీ రాజు గారికి తెలీవు. చివరాఖరికి తెలిసాక చె.భా ని రాజు శిక్షించాలనుకుంటాడు కానీ మ.భా విశాల హృదయంతో చె.భా కి క్షమా భిక్ష పెడుతుంది. ఇక అంతా శుభమే. కథ కంచికీ...మనమింటికీ (మింటికీ మంటికీ ఏకధారగా).............

అబ్బబ్బబ్బ....విసుగైత్తిపోతోంది. చిన్నప్పట్నించీ వింటున్నాం...కంటున్నాం - జానపదకథలు...ఇంకా ఎన్ని సార్లు వింటాం??  ఎన్నిసార్లు  కంటాం??
అయినా ఈ కలభాషిణి సీరియస్ గా సీరియల్ కథలు చెప్తోంది కదా - ఈ మధ్య ! అవి మానేసి జానపదం మొదలెట్టిందేం? తేరగా, తీరిగ్గా దొరికామనా...అనుకుంటున్నారా – నా బ్లాగు బాధితులూ....!!

సారీ అండీ...

నేనింతవరకూ చెప్పింది జానపదం కాదండీ. అచ్చ తెలుగు(?)టీవీ సీరియల్ కథ.

కాస్త కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేసి (ఆగండాగండి.... మీరు కాదు...) షర్టూ ప్యాంటూ చీరలూ చోళీలూ తగిలించి సెల్లూ గిల్లూ మోతలతో ఆ జానపద పాత్రలని అలంకరించుకోండి అత్యాధునికంగా. ఇట్టే తెలుగు సీరియల్ పాత్రలు కళ్ళకు కట్టేస్తాయి.

అయితే తమరింతవరకు చెప్పింది సీరియల్ కథా....?

కానీ ఈ 21 వ శతాబ్దంలో కూడా- ఆయనకి ఇద్దరేమిటీ?  అదీ.. ఒకే ఇంట్లో కలిసి ఉండడ మేమిటీ ? ఈ కత్తులూ, కఠార్లూ నూరుకోవడమేమిటీ ? జనాలివి చూస్తూ ఊరుకోవడమేమిటీ...?

చిరకాలం సాగిన ఈ రాచరికాలూ, అన్యాయాలూ, అబలలపై దాడులూ ఇంకనా... ఇకపై చెల్లవు అంటూ శ్రీ శ్రీ ఆవహించి పళ్ళు నూరుతున్నారా...
ఒద్దు సుమండీ.......పళ్ళు నూరితే అరిగి పళ్ళపొడిగా మారే ప్రమాదముంది.( అసలే అసలు సిసలు రూపాలకి నకిలీ పళ్ళపేస్టులు దొరుకుతున్న రోజులివి)
హు...ఒకరు బతికుండగానే, కనీసం విడాకులైనా లేకుండానే మరొకర్ని చేసుకోవడమా...ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడమా... దీనికి ఇంటిల్లిపాదీ (ప్రేక్షకులతో సహా) ఆమోద ముద్ర వేయడమా?

 అసలు చట్టం అనేది ఉందా? ఉంటే ఏం చేస్తోందసలు? అంటూ ఎడం అరచేతిలో పిడికిలి బిగించి కొట్టుకుంటూ ఆవేశ పడుతున్నారా...
అబ్బే.... ఎంత మాత్రమూ లాభం లేదండీ.

చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ...అనే  సినిమా పాటతోనో-
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే నేటి రాజకీయనాయకుల మాటతోనో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవలసిందే. సుబ్బరంగా సూటూ బూటూ వేసుకు తిరుగుతున్న వాళ్ళక్కూడా షుగర్ వ్యాధులొచ్చే చెడ్డ రోజులివి సుమండీ.

నేటి సీరియల్ కథల్లో చాలా వరకు (ముప్పాతిక మువ్వీసం) చట్టాల పరిథిలోగాని, సాంఘిక విలువల చట్రాల పరిథి లోకి గాని ఒదగవు. వాటికంటూ ప్రత్యేక చట్టాల్ని, విలువల్ని, సృష్టించుకొని అటానమస్ గా వెలిగిపోతున్న సీరియల్ రాజాలవి.

టాప్ రేటింగ్ సీరియల్ దగ్గరనుంచి అతి సాధారణ సీరియల్ వరకూ ఇంచుమించు అన్నిటిలోనూ ఇదే పోకడ. 

ఒకరికి ఇద్దరైన వేడుకేలే......!! అని పల్లెటూరు బావలా పాడుకుంటూ (మనకి ఆ పాట రాకపోతే వాళ్ళే పాడేస్తారు లెండి) సరి పెట్టేసుకోమంటారు,  సీరియల్ నిర్మాతాదులు.

ఈ కిడ్నాపులూ, చంపుకోవడాలూ, ఇద్దరు భార్యల భాగోతాలు ఇలాంటివి మన సమాజంలో క్వాచిత్కంగా తప్ప చూడమే. అలాంటిది ఈ కంపు ప్రతి ఇంట్లోను కామనే అన్నట్టుగా చూపిస్తూ ఉంటే అఖిలాంధ్ర స్త్రీ ప్రేక్షకులు ఎలా సమర్థిస్తున్నారసలు.... బామ్మల దగ్గరనుంచి  భామల  వరకూ ఎలా ఆదరిస్తున్నారు ?  ఈ ఘోర కలిని ఎలా సహిస్తున్నారు…. ? ఎలా భరిస్తున్నారు.....? హు...హు...!!

అదిగో - మళ్ళీ ఆవేశ పడుతున్నారు చూసారా... ….వద్దే వద్దు సుమండీ...!!
ఆవేశం బీపీ దాయకం. అసలే ఇరవైకే అరవైలోలా బీపీ లొచ్చే కలికాలపు రోజులివి.

మరి ఇలా వింటుంటేనే బీపీలు తెప్పించే ఈ సీరియల్ కథలు ఇంతమంది ఆదరణకి ఎలా నోచుకుంటున్నాయి?

ఎలా ఆకర్షించగలుగుతున్నాయి ?

భారతం, భాగవతంలోని శృంగార కథలు గారెలు తిన్నట్టుగా ఉంటాయని జాషువా (ముసాఫర్లు లో) వర్ణిస్తాడు. ఈ కథలు అఖిలాంధ్ర  స్త్రీలోకానికి  గారెలు తిన్నట్టుగా  అతిమధురంగా ఎలా తోస్తున్నాయి!   ఒక్కరోజు ఎపిసోడ్ మిస్సయితే  ఒక వాయి గారెలు మిస్సయినంత బాధ  ఎందుకు కలుగుతోంది?

బాగా ఆలోచించిన మీదట నాకు తోచిన కారణం ఒకటే.
రామాయణం విని ఏక పత్నీ వ్రతుడైన రాముణ్ణి పూజించాం.
భాగవతం విని బహు పత్నీవ్రతుడైన కృష్ణుణ్ణి  ఆరాధించాం.
ఆ ఇద్దర్నీ మహా పురుషులుగా, ఆ యుగపు ధర్మాన్ని అనుసరించిన వారిగా వారిని సమర్థించాం.

సరిగ్గా ఇప్పుడూ అదే  విశాల నేత్రాలతో తిలకిస్తూ, విశాల హృదయాలతో,  ఈ సీరియల్ పాత్రలను ఆదరిస్తున్నాం. 

కానీ అవి గత కాలపు కథలు. అప్పటి యుగధర్మాల గురించి విన్నవారమే కాని కన్నవారము కాము కాబట్టి ఆ కథలను సమర్థించవచ్చునేమో.
కానీ ఈ సీరియల్లో కథలు నేటి కథలు. మన చుట్టూ ఉన్న మనుషుల గురించి అల్లిన కథలు. ఈ యుగపు ధర్మాలూ, చట్టాలూ అన్నీ మనం కన్న వారం మాత్రమే కాదు. అనుసరిస్తున్నవారం.

మరి అలాటిది ఈ యుగ సాంఘిక ధర్మానికీ, చట్టానికీ విరుద్ధంగా నడుస్తున్న  ఈ కథలను తప్పనుకోకుండా తప్పనిసరిగా చూసి ఆరాధించడం తప్పో ఒప్పో... !!
 మరి ఆ తప్పొప్పులను నిర్ణయించే భగవంతుడే చెప్పాలి.
మానవుడు సంఘజీవి.సంఘంలో జీవించలేని వాడు పశువైనా కావాలి. లేదా పరమాత్ముడైనా కావాలి అంటాడు అరిస్టాటిల్.

ఈ మాటలను సీరియల్ పాత్రలకు అన్వయిస్తే వారు ఏ కేటగిరీ కిందకు వస్తారో ప్రేక్షక విజ్ఞులే నిర్ణయించాలి.

మరి మీరేమంటారు బ్లాగర్జీ...... ?

అఖిలాంధ్ర  సీరియల్ ప్రేక్షకులూ..

7 comments:

  1. అదే Aristotle "man is a social animal" అని కూడా అన్నాడు కదండి. అందుకని మీ ప్రశ్నకు అక్కడే సమాధానం దొరుకుతుంది..:) నేనందుకే ఏదన్నా సినిమా లేక న్యూస్ చూడ్డానికో తప్ప టీవీ జోలికే పోనండి. స్టార్ ప్లస్ మొదలు ఇతర భారతీయ భాషా ఛానల్స్ నుంచీ మన తెలుగులోని ఏటీవీ ఛానల్ వరకైన ఉన్నది ఒకటే కథ, దానిలో రెండే రకాలు...ఒకరు ఏడిపించేవారు, మరొకరు ఏడిచేవారు. బాధ పడేవారు పడుతూనే ఉంటారు(చూసే మనకి టివీ బద్దలుకొట్టాలని అనిపిస్తుంది కానీ పడేవాళ్ళకి ఏమీ అనిపించదు పాపం), కుట్రలు పన్ని బాధలు పెట్టే దుష్టులు అలా నెగ్గుతూనే ఉంటారు సీరియల్ ఆఖరి భాగం దాకా(అంటే ఓ రెండు మూడేళ్ళదాకా).

    దీనికి మందు ఒకటే. నచ్చనివారందరం టీవీలు కట్టేసుకోవటం, పిల్లల్ని వాటి బారిన పడకుండా కాపాడుకోవటం. అంతే !! టివీ చూడకపోతే ఈ సంగతులెలా తెలిసాయంటారా? ఎవరింటికి వెళ్ళినా, మరొకరు మనింటికి వచ్చినా తప్పనిసరిగా కంట పడే సన్నివేశాలను బట్టి ...:)

    Good post.

    ReplyDelete
  2. తృష్ణా...
    థాంక్స్ ఫర్ ద్ కామెంట్....
    టీవీ సీరియల్స్ గురించి రాస్తే...నువ్వుకూడా చూస్తున్నావన్నమాట అంటారు.
    చూడను బాబో అంటే...చూడకుండా మరి ఎలా రాస్తున్నావ్...అని ఎదురు దాడి చేస్తారు...
    అన్నం అంతా పట్టిచూడాలా... మెతుకు చాలదూ...
    అర్థం చేసుకోరూ....ఊ....

    ReplyDelete
  3. బలే అడిగారులెండి...అర్థం పర్థం లేని అంశాలను చూపిస్తుంటే అందరూ ఎలా ఆదరిస్తున్నారో నాకూ అర్థం కాదు. ...నేనందుకే ఆ సీరియళ్ళ జోలికి వెళ్ళను. ఒకసారి ఓ పన్నెండు పదమూడేళ్ళ క్రితం ఒకటి చూసాను...అందులో ఆ హీరో కి మూడు పెళ్ళిళ్ళవుతాయి. ముగ్గురూ భార్యలు కొట్టుకోవడం, భర్త కోసం పోటీ పడడం...అబ్బబ్బబ్బబ్బా కంపరమెత్తిపోయింది నాకైతే. ఆ రోజుల్లో అది సూపరు డూపరు హిట్ సీరియల్...దాని పేరు నిన్నే పెళ్ళాడతా అనుకుంటాను.

    ReplyDelete
  4. టీవీ కని పెట్టిన వాడికి నా జోహార్లు. ఎందు కంటే, టీ.వీ తోపాటు రిమోటు కూడా మరిచి పోకుండా కనిపెట్టి ఇచ్చినందుకు. చాలా మంది బుర్రలతో పాటు దాన్ని కూడా ఉపయోగించడం మరిచి పోవడమే పెద్ద విషాదం.

    చాలా బాగా రాసారండీ. మీ వ్యంగ్య శైలి ఆకట్టు కుంటోంది. బీ.పీలు తెచ్చు కోవద్దంటూ అక్కడక్కడా మీరే ఆవేశ పడుతున్నారేంటండీ?

    ReplyDelete
  5. బాబోయ్! నాకివేమీ తెలీవు!! పారిపోతున్నా త్వరగా!

    ReplyDelete
  6. టీవీ సీరియల్స్ .... తెలుగు. తమిళం, మలయాళం, కన్నడం, హిందీ .... భాషా భేదం లేకుండా ప్రతీ భాషలోనూ ప్రజానీకాన్ని ముఖ్యంగా మహిళా లోకాన్ని ఎంటర్ టైన్ చేయడానికి పూనుకున్న టీవీ ఛానల్స్ ... వాళ్ళేం చూపించినా చూడ్డానికి సిద్ధంగా ఉన్న జనం... అసలు టీవీలు రాక మునుపు ఎలా ఉండేదో .... ఆ రోజులు తిరిగి వస్తే బాగుణ్ణు ...
    సుమబాల

    ReplyDelete
  7. పూర్వపు సినిమాల్లో love triangleనాటకీయతకోసం ఉన్నా ,చివరికి భర్తా భార్యా ఇద్దరే మిగిలేవారుఇప్పటి సినిమాలు,టీ.వీ.సీరియల్స్ కన్నా అవి అభ్యుదయకరంగా ఉండేవి.పౌరాణిక,చారిత్రక కథల్లో తప్ప ,(అవి జరిగిపోయినవి ,మార్చరానివి కనుక ) సాంఘిక
    కథల్లో నేడు బహుభార్యత్వాన్ని చూపించ కూడదు. =కమనీయం

    ReplyDelete

మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి...

Related Posts with Thumbnails