Saturday, December 25, 2010

ఆమె !!

                                                    
చందమామలో సూర్యతేజాన్ని రంగరించి
కలువరేకులకు మెరుపుకాంతి నలది
కలువల మధ్య సంపెంగను పూయించి
సంపెంగకి సాయంగా అరవిచ్చిన గులాబీని అరువిచ్చి
ఆ గులాబీ మీద మంచు ముత్యం లాగా
మంచి నవ్వును మెరిపిస్తే
అది తేనెల వాననూ వెన్నెల సోననూ కురిపిస్తే
ఇన్ని అందాలను సన్నజాజి మోయలేదేమోనని బ్రహ్మ బెంగపడి
పూచిన గున్నమామిడిమీద ఆ ముఖ చంద్రుణ్ణి మెరిపిస్తే......  
     
                    *        *                *              *            *

ముద్దమందారం లోని ముగ్థత్వం
గులాబీ లోని గుబాళింపూ
మల్లెలోని మృదుత్వం
సన్నజాజి సన్నని సౌరభం కలగలిపి ఒంటికి తైలం పూసి
మంచితనం అనే మంచి గంధంతో నలుగు పెట్టి
సహజత్వాన్నీ సజీవత్వాన్నీ వలువలుగా నేసి
మానవత్వపు మేలి ముసుగు తొడిగితే.............     ....................ఆమె ?

                    *        *            *               *           *

ఆమె..................
వెండితెరకే వెలుగునిచ్చిన  వెండివెన్నెల కొమ్మ
రసిక హృదయాలను దోచిన రంగారు బంగారు బొమ్మ
కరుణ రసావిష్కరణంలో కరగించే కలికి రెమ్మ
సరస శృంగార దీప్తిని వెలిగించే  సావిత్రమ్మ
          
ఆమె -

సినీ వినీలాకాశంలో వెలిగే జాబిల్లి
కళామతల్లి సిగలో విరిసిన సిరిమల్లి
నటనకే భాష్యం చెప్పిన మహా తల్లి
తెలుగు సినీవాకిట దిద్దిన ముద్దుల రంగవల్లి

                 *           *              *                      *


ఆమె -
సోగకన్నుల ఆ వాలు చూపు
తెలుగు ప్రేక్షక హృదయాల నూపు
ముచ్చటైన ఆ మూతి ముడుపు
మరునికే మరి మరి మరులు గొలుపు
ముని పంట పెదవి నొక్కే తీరు
పడుచు గుండెలను చీల్చే మంచు కఠారు
జాణతనము, చానతనము కలబోసిన చిలిపితనము
కనుల పండువగా రూపు కట్టే నిండైన తెలుగు ధనము

                 *          *            *            *            *
ఆమె -
నటనలు తెలియని నటీమణి
నటనలోనే జీవించిన విదుషీ మణి
జీవన పాత్రను పోషించ లేని అలివేణి
నలభైలోనే అరవై నిండిన అసంపూర్తి పాత్రధారిణి

                *           *        *            *              *

ఆమె -
నవ రసాలను ప్రేక్షకులకు పంచి ఇచ్చి
తాను మాత్రం విషాదాన్నే గ్రోలిన నవరస కథానాయిక
సంతోషపు వెన్నెల కోసం కడదాకా వేచిన అభిసారిక
కలవరించే మన(సు)లను కలలో మాత్రమే వరించే మధుర స్వాప్నిక !!

8 comments:

  1. ఆమె...
    అందం అపూర్వం.
    అభినయం అద్వితీయం.
    వ్యక్తిత్వం అభినుతం.
    కీర్తి అజరామరం...

    మరణంలేని మహానటికి..నివ్వాళి.

    మీ..శైలి...బాగుంది..రాధ గారు.

    ReplyDelete
  2. Wow!! చాలా బాగారాశారండి.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. అబ్బ ఎంత బాగా రాసారాండీ....సావిత్రి గారికి ఇవే నా నివాళులు!

    ReplyDelete
  5. Happy New Year...మీ బ్లాగ్ గురించి ఈ టపాలో రాసానండి. వీలున్నప్పుడు చూడండి. http://trishnaventa.blogspot.com/2010/12/2-discovered-blogs.html

    ReplyDelete
  6. baagundanDee..mee kavitaa saundaryam ..aame darahaasa saundaryam..
    I wish you a happy new year Radha garu

    ReplyDelete
  7. yela natinchalo aamenu chusi nerchukovali. jivitam patla jagrataga undaka pote yemavutundo aame zivitam nunchi nerchukovali

    ReplyDelete
  8. సావిత్రి గురించి వికిపీదియాలో ,బ్లాగుల్లో రాసిన సమాచారం చాలా వివరంగానె ఉంది.ఒకటి,రెండు మాటలు మాత్రం రాస్తాను.ఆమె నటించిన చివరకు మిగిలేది చిత్రం చాలామంది చూసిఉండరు.అది ఒక బెంగాలీ సినిమాకి అనుకరణ. ఆర్టు సినిమా లాగ ఉంటుంది. సావి త్రి నటన అందులో హైలైటు.మిస్సమ్మ సినిమాకి ముందు భానుమతినీ, దేవదాసు చిత్రానికి జానకినీ అనుకొని తర్వాత సావిత్రిని బుక్ చేసుకొన్నారట. ఆ రెండు చినిమాలు సావిత్రి కెరీర్ని ఎలా పైకి తీసుకెళ్ళాయో అందరికీ తెలిసినదే. ఆమెకి ప్రతిభ, అద్రిష్టము రెండు అలాగ కలిసివచ్చాయి. రమణారావు.ముద్దు

    ReplyDelete

మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి...

Related Posts with Thumbnails