Tuesday, March 1, 2011

పేగు కాలిన వాసన( ఎ.ఎన్.జగన్నాథ శర్మ) కథా సంపుటి - పరిచయం



గత అయిదుసంవత్సరాలుగా ప్రతిఏటా ఒక ఉత్తమ కథల సంపుటికి మాడభూషి రంగాచార్య ట్రస్టు, రచయితకి 5000 రూ. నగదు బహుమతి,మెమెంటోతో  పురస్కారం అందచేస్తోంది. 2011సంవత్సారానికి గాను మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం -శ్రీ  ఎ.ఎన్.జగన్నాథశర్మ గారి పేగుకాలిన వాసన కథా సంపుటికి లభించింది. ఫిబ్రవరి 25,2011 న జరిగిన సభలో శ్రీ శర్మగారు ఈ పురస్కారం అందుకున్నారు.



కథా సంపుటి రచన  ఎ.ఎన్. జగన్నాథ శర్మ
ప్రతులకు:
పాలపిట్ట ప్రచురణలు 
16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట,
హైదరాబాద్- 500 036
వెల       125.


 పేగుకాలిన వాసన కథా సంపుటి - పరిచయం

కొన్ని కథలు ఆహ్లాదాన్నిస్తాయి. కొన్ని కథలు ఆవేశాన్ని రగిలిస్తాయి. మరికొన్ని కథలు తీరని మన కలలకీ, ఆశలకీ రెక్కలు తొడిగి ఊహాలోకంలో విహరింప చేస్తాయి. అతి తక్కువ కథలు మాత్రమే మన కళ్ళకు వాస్తవికత అనే కళ్ళజోడు తొడిగి, అంతవరకు మనం చూడని, చూడలేని జీవితపు మూలల్ని(మూలాల్ని) స్పష్టాతి స్పష్టంగా చూపుతాయి. ఆలోచింపచేస్తాయి. అటువంటి కథలకు సాహితీ లోకంలో ఎప్పటికీ శాశ్వతత్వం ఉంటుంది.

 ఎ.ఎన్. జగన్నాథ శర్మ  పేగు కాలిన వాసన కథలు ఈ కోవకు చెందినవి. దిగువ మధ్య తరగతి జీవితాల్లోని వివిధ కోణాలను చిత్రించిన ఈ కథలను చదివినప్పుడు మనం నివసిస్తున్న సమాజం పై కసీ, ఛిద్రమైన జీవితాల పట్ల జాలీ, వారి కోసం ఏదో చెయ్యాలనే తాపత్రయం, ఏదీ చెయ్యలేని నిస్సహాయతా కలగలిసిపోయి ఒకానొక అచేతన స్థితికి చేరుకుంటుంది మనసు. ఈ కథలను  చదువుతున్నప్పుడు మనం ఏ అనుభూతిని పొందుతామో సరిగ్గా అదే అనుభూతితో రచయిత రాసిన కథలివి. అందుకే ఈ కథలను చదువుతున్నప్పుడు మనం పీల్చేది పేగు కాలిన వాసన ని మాత్రమే కాదు. ఛిద్ర జీవితాలకోసం అలమటించే రచయిత గుండె కాలిన వాసన కూడా.

దిగువ మధ్య తరగతి జీవితాల్లోని విషాదాన్ని, వేదనను, దారిద్ర్యాన్ని, బలవంతుల దౌర్జన్యాలనీ, పరపీడన పరాయణత్వాన్ని, పిడికెడు అన్నం కోసం దిగజార్చుకుంటున్న విలువల్నీ రచయిత కరుణ రసాత్మకంగా చిత్రించారు. ఈ కథలన్నీ వాస్తవ జీవితాన్ని చిత్రించినవే అయినా ఆ వాస్తవ జీవితాల్లోని వ్యథార్త జీవిత యాథార్థ దృశ్యాలన్నీ మనల్ని భయపెడతాయి. వెంటాడి వేధిస్తాయి. వేదన రగిలిస్తాయి. ఆలోచించడం తప్ప మరేమీ చేయలేని మన చేతకానితనాన్ని, శూన్య హస్తాలనీ వెక్కిరిస్తూనే ముందుకు తీసుకుపోతాయి. మళ్ళీ మళ్ళీ చదివేలా చేస్తాయి.

ఈ సంపుటి లోని చాలా కథలు మధ్య తరగతి జీవితాలకు అద్దం పట్టిన కొడవటిగంటి కుంటుంబరావు, కాళీ పట్నం రామారావు, తిలక్ వంటి రచయితలను గుర్తు చేస్తాయి. అంత మాత్రాన ఈ కథలు వాటికి అనుకరణలూ, అనుసరణలూ కావు. ఈ సారూప్యతకి కారణం వీరందరి కథా భూమిక ఒకటే కావడం. వీరందరూ మధ్యతరగతి జీవితాలు అనే నేలపై వాస్తవికత అనే విత్తనాలు నాటి కథల పంటలు  పండించిన రచయితలు. నేల ఒకటే అయినా పండే పంటలు భిన్నమే కదా. వాటిని ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే రుచీ భిన్నమైనదే. అలాగే ఈ రచయితల ఇతివృత్తమూ, కథన శైలీ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ ఏదో అంతస్సూత్రం మాత్రం వీటిని ఒకే చోట బంధించేలా చేస్తుంది.

పేగుకాలిన వాసన సంపుటి లోని చాలా కథల్లో మధ్య తరగతి జీవితాలను, కోరికలను చిన్నా భిన్నం చేసే ఆకలీ, దానికి మూలమైన దారిద్ర్యం భిన్న రూపాల్లో విలయతాండవం చేస్తుంది. మధ్యతరగతి మనుషులు ఏ విలువలనైతే నమ్ముకుని, ఊపిరనుకుని బతుకుతారో చివరికి ఆ విలువలనే జానెడు పొట్టకోసం అమ్ముకునే, లేదా చేజార్చుకునే పరిస్థితిని నిప్పుబొమ్మ, తెగిపడిన పావురం రెక్కలు అనే కథలు నిరూపిస్తాయి. నిప్పుబొమ్మ  లోని ఆమె (పేరులేదు) మరిదికి అమ్ముడు పోవడాన్ని కొంతవరకైనా సమర్థించగలమేమో కాని తెగిపడిన పావురం రెక్క లో కొన్ని అవసరాలకు భార్యనే పావుగా వాడుకునే శంకరాన్ని సమర్థించలేం. రచయిత కూడా సమర్థించలేదు. అనేక రకాలుగా అనేకులు బతుకుతుంటారు. వారిలో శంకరం ఒకడు. అంతే అని వ్యాఖ్యానించి శంకరం వంటి వ్యక్తులుంటారని తెలియజేస్తారు. ఈ కథలో వనజాక్షి పాత్రమీద కూడా మనకి ప్రత్యేకమైన సానుభూతి కలగదు. ఇంటరు వరకూ చదువుకున్న అమ్మాయి ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు కదా. భర్తకు లొంగవలసిన అవసరం ఏమిటి అన్పించక మానదు. అయితే రచయిత  శంకరం పాత్ర గురించి చెప్పిన మాటలు ఈమెకి కూడా అన్వయించుకుంటే సరిపోతుంది.

మధ్యతరగతి చావు, చేతులు తెగిన హృదయం, శవం వంటి కథలు మరణాన్ని, మానవత్వపు విలువల్నీ కూడా శాసిస్తూ తన చుట్టూ తిప్పుకోగలిగే ధనరాకాసిని నిలువెత్తునా చూపించి భయపెడతాయి.

గాంధీ, గాజు పెంకులు కథలు చికితిపోయిన నాటక రంగాన్నీ, రంగస్థల నటుల జీవితాల్నీ అద్దం పడతాయి. గాంధీలో నాయకుడికి పేరు లేదు. వేషాలు వేయడం ఇతని కులవృత్తి. పొట్టకూటి కోసం
గాంధీ వేషం కట్టినా నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవడం లేదు. పైగా జాతీయ నాయకుడి వేషం కట్టినందుకు  నాల్రోజులు జైలుకూడు తినవలసి వచ్చింది కూడానూ. కళలకి మూల విరాట్ అయిన శివుడి లాగే జీవనగరళాన్ని గొంతులోనే నిలుపుకొని , శ్మశానం లోనే నివసిస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలుగొందిన నాటకరంగం వెండితెర వెలుగుల్లో ఎలా వెల వెల పోయిందో , ఆ రంగాన్ని నమ్ముకున్న కళాకారుల జీవితాల్లో కళ ఎలా తప్పిపోయిందో  నాయకుడి పాత్ర ద్వారా రచయిత తెలియజేస్తారు ఈ కథలో ఆఖరి వాక్యాలు కథకి ముగింపు కావచ్చునేమో కానీ పాఠకుల బుద్ధి వికసనకు అవే బీజం వేస్తాయి.

రేపటినుండి గాంధీ వేషం కట్టను. నా మనవరాలు పెద్దమనిషయింది. ఈ మూడు మూర్ల గావంచా గుడ్డ దానికి ఇచ్చేసి నేను గోచీ కట్టుకొని మరో వేషం వేస్తాను.....వేమన వేషం.

రంగస్థల కళాకారుల జీవితాల్లోని చీకటి కోణాన్ని అత్యద్భుతంగా చిత్రించిన వాక్యాలివి. ఆర్థికంగా చితికిపోయి ఆసరా కోసం ఆశగా ఎదురుచూసే కళాకారులకు సన్మానాలు చేసి శాలువలూ, కప్పులూ ఇచ్చే బదులు బతకడానికి తోవచూపించి ఆదుకోవడం ఉత్తమమనే సందేశాన్నిస్తుంది గాజుపెంకులు కథ.

చుక్కెదురు, మళ్ళీ ఖాళీ ఆకాశం, అన్నదాతా సుఖీభవ కథలలో కూడా ఆకలీ, దారిద్ర్యమూ  పెద్ద పీట వేసుక్కూర్చుంటాయ్. వివిధ వృత్తులను నమ్ముకున్నా పొట్ట గడవని చితికిన బ్రతుకులు అవన్నీ. సహస్ర వృత్తుల సహస్ర చిహ్నాల్ అని శ్రీశ్రీ చెప్పినట్టుగా శ్రమ శక్తికే  కాకుండా ఆకలీ, దారిద్ర్యానికి చిహ్నాలుగా మారడం ఖేదదాయకం.

పై కథలకు భిన్నంగా మార్నింగ్ గ్లోరీ, పయనించే ఓ చిలుకా, గుండె తోటలో నీలి గోరింట, ఓనమాలు, నొసటి సూరీడు నాన్నంటే, గూడు బండిలో నాన్న, ఉద్ధరిణి మొదలైనవి వేటికవే ప్రత్యేకమైన ఇతి వృత్తంతోనూ, కథల శైలి తోనూ రూపుదిద్దుకొని పాఠకుల గుండె తోటలో నీలి గోరింటలు పూయిస్తాయి.
ఈ కథా సంపుటికంతటికీ తల మానికమైన కథ పేగు కాలిన వాసన. ఈ కథను రచయిత ఉత్తమ పురుషలో చెప్పారు. వర్షం నాటి రాత్రి జట్కాబండిలో మనని కూచో పెట్టి రచయితే జట్కావాలాగా మారి అలవోకగా కథను ముందుకు నడిపిస్తారు. జట్కాబండి అంత వడిగాను, లయబద్ధంగానూ సాగిపోతుందీ కథ.

పసితనం నుండీ దరిద్రంతో సహవాసం చేసిన ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలనే కోరికతో కుటుంబ బంధాలను తెంపుకుని దూరంగా పారిపోయి జట్కా తోలుకుంటూ ఒంటరిగా బ్రతుకుతుంటాడు. ఒక వర్షం కురిసిన రాత్రి అతని జట్కాలో బొటన వేలు లేని తన తండ్రి లాంటి వ్యక్తి  ఎక్కినపుడు అతని మనసులో రేగిన ఆలోచనలే ఈ కథకు రూపం ఇచ్చాయి.  ఒక్కసారిగా అతనికి గతమంతా కదలినట్టవుతుంది. ఏదో ఒక అవసరం కోసం తండ్రి తన వేళ్ళను యంత్రానికి బలి ఇవ్వడం, అమ్మ అనారోగ్యం, అక్క ఆప్యాయతా, తన బాల్యం అన్నీ కళ్ళముందు మెదలడంతో  వారిని ఎలా అయినా చూడాలనే  కోరిక  బలంగా వేళ్ళూను కుంటుంది. దరిద్రాన్ని అసహ్యించుకునో లేక భయపడో పారిపోయిన అతను ఈ పదేళ్ళనూ సాధించినదేమీ లేదు. మరికొంత దరిద్రాన్ని తప్ప.
నా అన్న వారిని చేజేతులా దూరం చేసుకొని దారిద్ర్య సాగరాన్ని ఒంటరిగా ఈదలేక ఉక్కిరి బిక్కిరి అవడం తప్ప . అందుకే చివరికి అనుకుంటాడతను

దేనికి దూరంగా పారిపోదలచానో అది నాకు సాధ్యం కాలేదు. ఎల్లెడలా ఒకే దృశ్యం ఒకే జీవితం. రాకాసి లోయ అంతటా వ్యాపించి ఉంది. క్రూర మృగాలు, మారణాయుధాలు, మంత్ర తంత్రాలు నాలాంటి కుటుంబీకుల కోసమే పొంచి ఉన్నాయనిపించింది. నా వాళ్ళను నేను రక్షించుకోవాలి. అందుకు సన్నధ్ధం కావాలి.
ఆకలీ దరిద్రం ఎక్కడ లేవు. దరిద్రాన్ని చూసి భయపడడం కన్నా దరిద్రం మరోకటి లేదు. జీవితాన్ని ధైర్యంగా  ఎదుర్కోవాలి గానీ బంధాలను తెంచుకుని పారి పోవడం అనుచితం.... అనే గొప్ప స్ఫూర్తిని ఈ కథ అందిస్తుంది. అద్భుతమైన కథన శైలీ, నిర్మాణ శిల్పమూ ఉన్న విలువైన కథ యిది.

సుమారు 500 కథలు రాసి లబ్ధ ప్రతిష్ఠులయిన ఎ.ఎన్. జగన్నాథ శర్మ గారి కథానిర్మాణ శైలి గురించి గానీ, పదప్రయోగం, వాక్య విన్యాసం వంటి విషయాలను గురించి చెప్పడం సూర్యుడి ముందు దివిటీ పట్టడం లాంటిది. ఉత్తరాంధ్ర గర్వించ దగ్గ అతికొద్ది గొప్ప కథకుల్లో వారు ఒకరు. ఉత్తరాంధ్ర మాండలికపు నాడిని అతి వాడిగా పట్టుకోగలిగిన రచయితగా ఈ సంపుటిలోని శవం కథ ద్వారా మరోసారి నిరూపించుకోగలిగేరు. జాబిల్లి నుండి వెన్నెల జాలువారినంత అలవోకగా కథక చంద్రుడి కలం నుండి కథా చంద్రికలు జాలువారతాయి. వెన్నెల్లో ఉండే స్వచ్ఛతా, సారళ్యమూ, సౌందర్యమూ వీరి కథల్లో నిబిడీ కృతమై ఉంటాయి. కానీ ఈ వెన్నెల మనసుకి మత్తెక్కించి జోలపాడి నిద్రపుచ్చే వెన్నెల కాదు. నిద్రాణమై ఉన్న  జగతిని జాగృత పరిచే వెన్నెల. జీవితపు  చీకటి కోణాలను కూడా దర్శించి ఆ చీకట్లను తొలగించడానికి ప్రయత్నించే పదునైన వెన్నెల. గుండెలను చీల్చే కత్తి వాదర లాంటి 
వెన్నెల.
ఈ కథా చంద్రికలను సాహితీ ప్రియులందరూ ఆస్వాదించి తీరవలసిందే. మంచి మనసున్న ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీరవలసిందే.

No comments:

Post a Comment

మీ అభిప్రాయం ఇక్కడ చెప్పండి...

Related Posts with Thumbnails